కుజుడు, గురువు అనుగ్రహం.. ఈ రాశుల వారు స్థిరాస్తులు కొనే ఛాన్స్..!
Property Horoscope: జ్యోతిషశాస్త్రం ప్రకారం కుజుడు ఆస్తిపాస్తులకు కారకుడిగా భావిస్తారు. ప్రస్తుతం కుజుడు ధన కారకుడైన గురువుతో కలిసి కర్కాటక, సింహ రాశుల్లో సంచరిస్తుండటంతో కొన్ని రాశుల వారికి ఆస్తిపరంగా శుభ ఫలితాలు కలిగే అవకాశముంది. మేషం, వృషభం, కర్కాటకం, సింహం, తుల, వృశ్చికం, ధనుస్సు రాశుల వారికి ఇల్లు, స్థలం, పొలాలు కొనుగోలు చేసే అవకాశాలతో పాటు వారసత్వ ఆస్తి లభించే సూచనలు ఉన్నాయని చెబుతున్నారు.

జ్యోతిషశాస్త్రం ప్రకారం ఆస్తిపాస్తులకు కారకుడు కుజుడు. ఆస్తిపాస్తులకు సంబంధించిన సహజ స్థానాలు కర్కాటక, సింహ రాశులు. ధన కారకుడైన గురువుతో కుజుడు జనవరి 25 వరకు కర్కాటక, సింహ రాశుల్లో సంచారం చేస్తున్నందువల్ల కొన్ని రాశుల వారికి స్థిరాస్తులు కలగడం, స్థిరాస్తులు వృద్ధి చెందడం వంటివి తప్పకుండా జరుగుతాయి. ఈ రాశుల వారు ఆస్తుల మీద పెట్టుబడులు పెట్టడం వల్ల అపర కుబేరులయ్యే అవకాశం ఉంది. మేషం, వృషభం, కర్కాటకం, సింహం, తుల, వృశ్చికం, ధనూ రాశుల వారికి ఇల్లు కొనడం, స్థలాలు, పొలాలు సంపాదించడం, ఆస్తులు సంక్రమించడం, వారసత్వ సంపద లభించడం వంటివి చోటు చేసుకునే అవకాశం ఉంది.
మేషం
ఈ రాశికి చతుర్థ, పంచమ స్థానాల్లో కుజ, గురువుల సంచారం వల్ల తప్పకుండా సొంత ఇంటి కల నెరవేరుతుంది.. ఇల్లు కొనడం కంటే కట్టుకునే అవకాశమే ఎక్కువగా ఉంది. ఆస్తి వివాదాలు అను కూలంగా పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి అందుతుంది. స్థలాల మీద పెట్టుబడులు ఎక్కువగా పెట్టడం, అంచనాలను మించి లబ్ధి పొందడం కూడా జరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి ఇళ్లు, స్థలాల క్రయ విక్రయ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది.
వృషభం
ఈ రాశికి తృతీయ, చతుర్థ స్థానాల్లో కుజ, గురువుల సంచారం వల్ల ఈ రాశికి చెందిన రియల్ ఎస్టేట్ వారికే కాక, ఇళ్లు, స్థలాల క్రయ విక్రయాలకు ప్రయత్నిస్తున్నవారికి కూడా లాభాల పంట పండుతుంది. వీరు ఇళ్లు, స్థలాల మీద పెట్టుబడులు పెట్టడం వల్ల తప్పకుండా ఆశించిన లాభాలు కలుగుతాయి. సొంత ఇంటి ప్రయత్నం తప్పకుండా నెరవేరుతుంది. ప్రభుత్వపరంగా కూడా ఇల్లు లేదా స్థలం లభించే అవకాశం ఉంది. వారసత్వ సంపద లభించే సూచనలు కూడా ఉన్నాయి.
కర్కాటకం
ప్రస్తుతం ఈ రాశిలో సంచారం చేస్తున్న కుజ, గురువులు నవంబర్ నుంచి ధన స్థానంలో సంచారం చేయబోతున్నందు వల్ల జనవరి 25 లోగా ఈ రాశివారికి కొద్ది ప్రయత్నంతో స్థిరాస్తులు బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ లో విపరీత రాజయోగాలు కలుగుతాయి. భూమి, స్థలాలు, ఇళ్లు క్రయ విక్రయాల్లో అగ్రస్థానానికి చేరుకుంటారు.. సొంత ఇంటి కోసం ప్రయత్నిస్తున్న వారికి గృహ యోగం కలుగుతుంది. తల్లి వైపు నుంచి విలువైన ఆస్తి సంక్రమిస్తుంది.
సింహం
ఈ రాశికి అత్యంత శుభులైన కుజు, గురువులు జనవరి 25 వరకు కలిసే ఉండబోతున్నందువల్ల ఈ రాశివారు ఆస్తిపాస్తుల మీద ఎంతగా పెట్టుబడులు పెడితే అంత మంచిది. ఇళ్లు, భూముల క్రయ విక్రయాల ద్వారా వీరు అపర కుబేరులయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. జీవిత భాగ స్వామి తరఫు నుంచి ఆకస్మిక గృహ లాభానికి, ఆస్తి లాభానికి అవకాశం ఉంది. త్వరలో గృహ యోగం పట్టే అవకాశం ఉంది. ఇదివరకు సంపాదించిన ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది.
తుల
ఈ రాశికి దశమ, లాభ స్థానాల్లో కుజ, గురువులు కలిసికట్టుగా సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారికి ఇల్లు, ఆస్తుల కొనుగోలు విషయంలో పట్టిందల్లా బంగారం అవుతుంది. అనేక విధా లుగా భూలాభం కలుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి కొత్త ప్రాజెక్టులు లభిస్తాయి. అతి త్వరలో వీరికి తప్పకుండా గృహ యోగం పట్టే అవకాశం ఉంది. ఉద్యోగ పరంగా గృహ సౌకర్యం ఏర్పడడానికి కూడా అవకాశం ఉంది. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమై భూలాభం కలుగుతుంది.
వృశ్చికం
ఈ రాశికి భాగ్య, దశమ స్థానాల్లో రాశ్యధిపతి కుజుడు ధన కారకుడైన గురువుతో కలిసి సంచారం చేస్తున్నందువల్ల జనవరి 25 లోగా ఈ రాశివారు జమిందారులయ్యే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కొత్త ప్రాజెక్టులు అంది వస్తాయి. వీరు పట్టిందల్లా బంగారం అవు తుంది. పోటీదార్ల మీద పైచేయి సాధించడం జరుగుతుంది. కొద్దిపాటి ప్రయత్నంతో గృహ యోగం, స్థల యోగం పట్టే సూచనలున్నాయి. ఆస్తి వివాదం పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి వస్తుంది.
ధనుస్సు
ప్రస్తుతం కర్కాటక రాశిలో ఉచ్ఛ స్థితిలో ఉండడంతో పాటు, కుజుడితో కలిసి ఉన్న రాశ్యధిపతి గురువు వచ్చే నెల భాగ్య స్థానంలోకి ప్రవేశిస్తున్నందు వల్ల ఈ రాశివారికి భారీగా ఆస్తిపాస్తులు సమకూరే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు పరిష్కారమై ఆస్తి లభించడంతో పాటు కొత్తగా ఆస్తులు కొనడం జరుగుతుంది.. రియల్ ఎస్టేట్ లో ఉన్నవారు అపర కుబేరులయ్యే సూచనలు న్నాయి. ఇళ్లు, స్థలాల మీద పెట్టుబడులు పెట్టి లబ్ధి పొందడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది.



