AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

APPSC Group 1లో 166 ఉద్యోగాలకు దరఖాస్తులు ప్రారంభం.. ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?

ఏపీ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC) గ్రూప్‌-1 సర్వీసుల్లో 166 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. డిప్యూటీ కలెక్టర్‌, డీఎస్పీ, అసిస్టెంట్‌ కమిషనర్‌, డీఈఓ, డిప్యూటీ రిజిస్ట్రార్‌ తదితర పోస్టులు ఇందులో ఉన్నాయి. అక్టోబర్‌ 6 నుంచి 27 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షను 2027 జనవరి 24న నిర్వహించనున్నారు..

APPSC Group 1లో 166 ఉద్యోగాలకు దరఖాస్తులు ప్రారంభం.. ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
APPSC Group 1 Applications Open
Srilakshmi C
|

Updated on: Oct 06, 2026 | 1:34 PM

Share

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కీలక అప్‌డేట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్‌-1 సర్వీసుల్లో 166 ఖాళీల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు ఈ రోజు నుంచి మొలయ్యాయి. ఈ పోస్టులకు అక్టోబర్‌ 6, 2026 నుంచి అక్టోబర్‌ 27, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రూప్‌-1లో డిప్యూటీ కలెక్టర్‌, డీఎస్పీ, అసిస్టెంట్‌ కమిషనర్‌, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్‌, డిప్యూటీ రిజిస్ట్రార్‌, డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌ తదితర కీలక పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 13 విభాగాల్లో ఈ నియామకాలు చేపట్టనున్నారు.

పోస్టుల వివరాలు

  • డిప్యూటీ కలెక్టర్‌ (ఏపీ సివిల్ సర్వీస్) పోస్టుల సంఖ్య: 12
  • అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ పోస్టుల సంఖ్య: 14
  • డీఎస్పీ (సివిల్), కేటగిరీ-II పోస్టుల సంఖ్య: 36
  • డీఎస్పీ (కమ్యూనికేషన్స్) పోస్టుల సంఖ్య: 3
  • డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్‌ (DEO) పోస్టుల సంఖ్య: 14
  • రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్‌ (RTO) పోస్టుల సంఖ్య: 3
  • డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్‌ పోస్టుల సంఖ్య: 1
  • డిప్యూటీ రిజిస్ట్రార్‌ పోస్టుల సంఖ్య: 16
  • మున్సిపల్ కమిషనర్‌ గ్రేడ్-II పోస్టుల సంఖ్య: 12
  • అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌ / అసిస్టెంట్‌ అకౌంట్స్ ఆఫీసర్‌ పోస్టుల సంఖ్య: 2
  • డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్‌ పోస్టుల సంఖ్య: 3
  • అసిస్టెంట్‌ ఆడిట్ ఆఫీసర్‌ పోస్టుల సంఖ్య: 15
  • డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌ పోస్టుల సంఖ్య: 35

గ్రూప్‌-1 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అయితే డీఎస్పీ (కమ్యూనికేషన్స్) పోస్టుకు ప్రత్యేక విద్యార్హత అవసరం. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ లేదా రేడియో ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి డీఎస్పీ (సివిల్) పోస్టులకు 21 నుంచి 30 సంవత్సరాలు, డీఎస్పీ (కమ్యూనికేషన్స్) 18 నుంచి 30 సంవత్సరాలు, ఇతర పోస్టులకు 18 నుంచి 44 సంవత్సరాలు వరకు నిర్ణయించారు. రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితికి సంబంధించిన సడలింపులు నిబంధనల ప్రకారం వర్తిస్తాయి. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో అక్టోబర్ 27, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొదట కొత్త అభ్యర్థులు One Time Profile Registration (OTPR) పూర్తి చేసి యూజర్‌ ఐడీ పొందాలి. అనంతరం OTPR ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్‌ అయి Online Application Submission లింక్‌పై క్లిక్‌ చేసి దరఖాస్తు పూర్తి చేయాలి. దరఖాస్తు ఫీజు కింద అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు రూ.250తోపాటు పరీక్ష ఫీజు రూ.120 చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులు, తెల్ల రేషన్‌ కార్డు కలిగిన అభ్యర్థులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. అయితే రూ.250 ప్రాసెసింగ్ ఫీజు వీరు చెల్లించాల్సి ఉంటుంది.

గ్రూప్‌-1 ఉద్యోగాలకు అభ్యర్థుల ఎంపిక మూడు దశల్లో జరుగుతుంది. స్క్రీనింగ్ టెస్ట్ (ప్రిలిమినరీ), మెయిన్స్‌ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్‌ ఆఫ్‌లైన్‌లో OMR ఆధారిత ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. పేపర్‌-I జనరల్ స్టడీస్ – 120 మార్కులు, పేపర్‌-II జనరల్ ఆప్టిట్యూడ్ – 120 మార్కులకు ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రిలిమ్స్‌ పరీక్ష జనవరి 24, 2027న ఉంటుంది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారికి మెయిన్స్ ఉంటుంది. మెయిన్స్‌ పరీక్ష డిస్క్రిప్టివ్‌ విధానంలో ఉంటుంది. ఇందులో రెండు క్వాలిఫైయింగ్‌ లాంగ్వేజ్‌ పేపర్లు (తెలుగు, ఇంగ్లిష్‌), ఐదు జనరల్‌ కోర్‌ పేపర్లు ఉంటాయి. జనరల్‌ కోర్‌ పేపర్లలో ఒక్కో పేపర్‌కు 150 మార్కులు కేటాయించారు. ఇంటర్వ్యూకు 75 మార్కులు ఉంటాయి. మొత్తం ఎంపిక ప్రక్రియను 825 మార్కులకు నిర్వహిస్తారు.

ఇవి కూడా చదవండి

పోస్టును బట్టి పే స్కేల్‌ ఇలా ఉంటుంది..

  • డిప్యూటీ కలెక్టర్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌, డీఎస్పీ, డీఈఓ పోస్టులకు నెలకు: రూ.61,960 నుంచి రూ.1,51,370 వరకు
  • ఆర్‌టీఓ, డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్‌, డిప్యూటీ రిజిస్ట్రార్‌ పోస్టులకు నెలకు: రూ.57,100 నుంచి రూ.1,47,760 వరకు
  • డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌ పోస్టులకు నెలకు: రూ.65,360 నుంచి రూ.1,54,980 వరకు
  • ఇతర పోస్టులకు నెలకు: రూ.54,060 నుంచి రూ.1,40,540 వరకు

ముఖ్యమైన తేదీలు..

  • దరఖాస్తుల ప్రారంభ తేదీ: అక్టోబర్ 6, 2026 నుంచి
  • దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 27, 2026 వరకు
  • ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ పరీక్ష తేదీ: జనవరి 24, 2027.

ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us