AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏనుగు పిల్లకు అనంత్ అంబానీ సాయం.. ప్రత్యేక ఫ్లైట్‌లో ఎయిర్‌లిఫ్ట్.. అస్సాం సీఎం ప్రశంసలు..

పుట్టిన మొదటి రోజే విరిగిన కాలితో.. ఏడు వారాలుగా మృత్యువుతో పోరాడుతున్న ఏనుగు పిల్ల రాజాకు వంతారా వ్యవస్థాపకుడు అనంత్ అంబానీ మరో జన్మను ప్రసాదించారు. మెరుగైన వైద్యం కోసం రాజాను వంతారాకు ప్రత్యేక విమానంలో ఎయిర్‌లిఫ్ట్ చేశారు. అనంత్ అంబానీ చూపిన ఈ ఉదార సేవపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రశంసల వర్షం కురిపించారు.

ఏనుగు పిల్లకు అనంత్ అంబానీ సాయం.. ప్రత్యేక ఫ్లైట్‌లో ఎయిర్‌లిఫ్ట్.. అస్సాం సీఎం ప్రశంసలు..
Assam Cm Himanta Biswa Sarma Praises Anant Ambani
Krishna S
|

Updated on: Nov 20, 2026 | 8:56 PM

Share

పుట్టినప్పటి నుంచే కాలికి తీవ్ర గాయంతో, ప్రాణాలతో పోరాడుతున్న ఏడు వారాల ఆసియా ఏనుగు పిల్ల రాజాకు వంతారా వ్యవస్థాపకుడు అనంత్ అంబానీ మరో జన్మను ప్రసాదించారు. మెరుగైన వైద్యం కోసం రాజాను అస్సాం నుంచి గుజరాత్‌లోని జామ్‌నగర్ వంతారా ఆస్పత్రికి ప్రత్యేక విమానంలో తరలించారు. అనంత్ అంబానీ చొరవతో దేశంలో ఒక ఏనుగు పిల్లను ఇలా ఎయిర్‌లిఫ్ట్ చేయడం ఇది మూడోసారి. అస్సాంలోని గోగాముఖ్‌లో 2026 అక్టోబర్ 2న రాజా జన్మించాడు. ఈ గున్న ఏనుగు తల్లికి కేవలం 11 ఏళ్లే కావడంతో ప్రసవం తర్వాత భయంతో పుట్టిన పిల్లను కాలితో తన్నింది. దీంతో రాజా కుడి వెనుక తొడ ఎముక పూర్తిగా విరిగిపోయింది. రాజా యజమాని భోలానాథ్ అభ్యర్థన మేరకు అక్టోబర్ 8న వంతారా రాపిడ్ రెస్పాన్స్ టీమ్ అక్కడికి చేరుకుంది. కాలికి ప్లాస్టర్ వేసి, ప్రత్యేక స్లింగ్ సాయంతో నిలబెట్టే ప్రయత్నం చేశారు. కాలిపై బరువు పడకుండా వ్యాయామం చేసేందుకు ప్రత్యేకంగా హైడ్రోథెరపీ కొలను కూడా నిర్మించారు.

తల్లి పాలు అందకపోవడం, కదలలేని స్థితిలో ఉండటంతో రాజా ఆరోగ్యం మరింత క్షీణించింది. డయేరియా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోవడం, కాలేయ సమస్యలు, ఎక్కువ సేపు పడుకోవడం వల్ల తలపై పుండ్లు రావడంతో పరిస్థితి విషమించింది. 2,500 కిలోమీటర్ల దూరం రోడ్డు మార్గంలో ప్రయాణించే పరిస్థితి లేకపోవడంతో, వెంటనే ఆస్పత్రికి తరలించాలని వైద్యులు నిర్ణయించారు. ఈ విషయం తెలుసుకున్న అనంత్ అంబానీ తక్షణమే స్పందించి ఎయిర్‌లిఫ్ట్‌కు ఏర్పాట్లు చేశారు. నవంబర్ 20న గువాహటి నుంచి జామ్‌నగర్‌కు ప్రత్యేక విమానంలో నాలుగు గంటల పాటు ప్రయాణించి రాజాను వంతారాకు చేర్చారు.

అస్సాం సీఎం అభినందనలు

రాజా యజమాని కోరిక మేరకు తాను వంతారాను సంప్రదించగా, వారు వెంటనే స్పందించి ఎయిర్‌లిఫ్ట్ చేశారని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఎక్స్ వేదికగా తెలిపారు. ఈ ఉదార స్వభావానికి అనంత్ అంబానీ, వంతారా బృందాన్ని ఆయన అభినందించారు. రాజా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. “రాజా విరిగిన కాలితో పుట్టి ఉండవచ్చు, కానీ దాన్ని ఆత్మస్థైర్యం చెక్కుచెదరలేదు. రాజా తిరిగి నిలబడేలా, నడిచేలా, ఏదో ఒక రోజు పరిగెత్తేలా మా బృందం అన్ని విధాలా కృషి చేస్తుంది” అని వంతారా సీఈఓ వివాన్ కరాణి పేర్కొన్నారు. ప్రస్తుతం జామ్‌నగర్‌లోని వంతారా ఏనుగుల ఆస్పత్రిలో నిపుణుల పర్యవేక్షణలో రాజాకు పూర్తిస్థాయి వైద్యం కొనసాగుతోంది.

Follow Us