పాకిస్తాన్‌కు తలనొప్పిలా మన తెలుగోడు.. క్రీజులోకి అడుగుపెడితే పూనకాలే..!
Team India: తిలక్ వర్మ (Tilak Varma) పాకిస్థాన్‌తో జరిగిన రెండు కీలక ఫైనల్స్‌లో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడాడు. 2025 ఆసియా కప్ ఫైనల్‌లో 69 పరుగులు, ఆసియా క్రీడల ఫైనల్‌లో 51 నాటౌట్‌తో భారత్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన తిలక్ రికార్డులు చూస్తే పాక్ టీంకు అసలైన మొగుడు ఇతనేనంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Tilak Varma: పాకిస్థాన్‌తో కీలక మ్యాచ్ అంటే తిలక్ వర్మ బ్యాట్ మరోసారి ప్రభావం చూపిస్తోంది. 2025 ఆసియా కప్ ఫైనల్‌లో 69 పరుగులతో భారత్ విజయానికి కీలకంగా నిలిచిన తిలక్.. తాజాగా ఆసియా క్రీడల ఫైనల్‌లోనూ అజేయ అర్ధశతకంతో జట్టుకు ఉపయోగపడ్డాడు. రెండు సందర్భాల్లోనూ మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్టుగా ఆడిన తిలక్ ఇన్నింగ్స్‌లు ప్రత్యేకంగా నిలిచాయి. ఆసియా కప్ ఫైనల్‌లో భారత్ 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన సమయంలో క్రీజులోకి వచ్చిన అతడు 53 బంతుల్లో 69 పరుగులతో చివరి వరకు నిలిచాడు. తాజాగా పాకిస్థాన్‌తో జరిగిన ఆసియా క్రీడల ఫైనల్‌లో 22 బంతుల్లో 51 పరుగులతో నాటౌట్‌గా నిలిచి భారత్ 211 పరుగులు చేయడంలో కీలక పాత్ర పోషించాడు.
తొలి ఫైనల్‌లో కీలక భాగస్వామ్యం..
2025 ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్ 146 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో భారత్ ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో తిలక్ వర్మ, సంజూ శాంసన్ కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఆ తర్వాత శివమ్ దూబేతో కలిసి స్కోరును ముందుకు తీసుకెళ్లాడు.
తిలక్ 53 బంతుల్లో మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 69 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. భారత్ 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. ఆ మ్యాచ్‌లో తిలక్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
రెండో ఫైనల్‌లోనూ అజేయ అర్ధశతకం..
తాజా ఆసియా క్రీడల ఫైనల్‌లో అభిషేక్ శర్మ 28 బంతుల్లో 61 పరుగులతో భారత్‌కు మంచి ఆరంభం ఇచ్చాడు. మధ్య ఓవర్లలో వికెట్లు పడటంతో చివర్లో పరుగులు వేగంగా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తిలక్ బాధ్యత తీసుకుని పాక్ స్పిన్నర్లపై సింగిల్స్‌తో ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. అవకాశం వచ్చినప్పుడు బౌండరీలు సాధించాడు.
చివరికి 22 బంతుల్లో మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 51 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. శివమ్ దూబేతో కలిసి ఆరో వికెట్‌కు 31 బంతుల్లో 62 పరుగులు జోడించాడు. భారత్ 211/6 స్కోరు చేయగా, పాకిస్థాన్ 192/6కే పరిమితమైంది. భారత్ 19 పరుగుల తేడాతో గెలిచింది.
కోహ్లీకి పాక్‌పై ప్రత్యేక రికార్డు..
పాకిస్థాన్‌పై కీలక మ్యాచ్‌ల్లో విరాట్ కోహ్లీ కూడా ఎన్నో ప్రభావవంతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. 2022 టీ20 ప్రపంచకప్‌లో మెల్‌బోర్న్‌లో పాకిస్థాన్ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 31 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో కోహ్లీ 53 బంతుల్లో 82 పరుగులతో నాటౌట్‌గా నిలిచి భారత్‌ను విజయానికి చేర్చాడు.
తిలక్ తాజా రెండు ఫైనల్ ఇన్నింగ్స్‌లను పరిశీలిస్తే.. పాకిస్థాన్‌పై కీలక మ్యాచ్‌ల్లో అతడి ప్రదర్శన జట్టుకు ఉపయోగపడింది. ఇదే సమయంలో ఇతర సిరీస్‌ల్లో అతడి స్కోర్లు స్థిరంగా లేకపోయినా, పాక్‌తో జరిగిన ఈ రెండు ఫైనల్స్‌లో మాత్రం కీలక పరుగులు సాధించాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
