రఘురామ కస్టడీ టార్చర్ కేసులో కీలక మలుపు! బీహార్ కేడర్ ఐపీఎస్ అధికారికి ఏపీ పోలీసుల నోటీసులు
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుపై సీఐడీ అధికారులు చేసిన హింస కేసులో మరో ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్‌కు నోటీసులు జారీ అయ్యాయి. ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. ఇప్పటికే రిటైర్డ్ ఏఎస్పీ విజయ్ పాల్ మరియు ప్రైవేటు వ్యక్తి కామేపల్లి తులసిబాబును అరెస్ట్ చేశారు. ఈ కేసులో సునీల్ నాయక్ పాత్రను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సీఐడీ కస్టడీ టార్చర్ కేసు విచారణలో మరో ఐపీఎస్ అధికారికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. బీహార్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్‌ను ఈ నెల 3న ఒంగోలులో విచారణకు హాజరుకావాలని విచారణ అధికారిగా ఉన్న ప్రకాశంజిల్లా ఎస్‌పీ దామోదర్ నోటీసులు పంపించారు. ఫ్యాక్స్, వాట్సప్ ద్వారా నోటీసులు పంపారు. వైసీపీ హయాంలో తనను సీఐడీ అధికారులు విచారణ పేరుతో కస్టడీలో టార్చర్‌కు గురి చేశారని డిప్యూటీ స్పీకర్ రఘురామ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుంటూరు నగరంపాలెం పీఎస్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే అప్పటి సీఐడీ అదనపు ఎస్పీగా పనిచేసిన రిటైర్డ్ పోలీసు అధికారి విజయ్‌పాల్‌ను పోలీసులు విచారించి అరెస్ట్ చేశారు.
ఇదే కేసులో ప్రమేయం ఉందంటూ ప్రైవేటు వ్యక్తి కామేపల్లి తులసిబాబును కూడా పోలీసులు పలుమార్లు విచారించి అరెస్ట్ చేశారు. ఈ కేసులో తాజాగా ఈనెల 3న విచారణకు హాజరుకావాలని అప్పట్లో సీఐడీ డీఐజీగా పనిచేసిన సునీల్‌నాయక్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. సునీల్ నాయక్‌ను విచారించేందుకు విచారణాధికారిగా ఉన్న ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఫిబ్రవరి 25న నోటీసులు పంపారు. రఘురామను గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణ చేస్తున్న సమయంలో సునీల్ నాయక్ కూడా వచ్చినట్టు నిర్ధారించుకున్న పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. బీహార్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్, వైసీపీ ప్రభుత్వ హయాంలో డిప్యూటేషన్‌పై సీఐడీ విభాగంలో డీఐజీగా పనిచేశారు.
ఆ సమయంలో రఘురామను విచారించే క్రమంలో సునీల్ నాయక్ కూడా పాల్గొన్నారన్నది అభియోగం. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సునీల్ నాయక్ తిరిగి బిహార్‌కు వెళ్ళిపోయారు. ప్రస్తుతం బిహార్ ఫైర్ డిపార్ట్‌మెంట్‌లో ఐజీగా పనిచేస్తున్నారు. కాగా ఈ కేసులో నిందితులుగా ఉన్న వారిని ఒంగోలు ఎస్‌పీ కార్యాలయానికి పిలిపించి విచారిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే అప్పటి సీఐడీ ఏఎస్‌పీ, ఇప్పటి రిటైర్డ్ ఏఎస్‌పీగా ఉన్న విజయ్‌పాల్‌ను రెండుసార్లు ఒంగోలులో విచారించి అరెస్ట్ చేశారు. ఆ తరువాత గుంటూరు జీజీహెచ్ వైద్యులను విచారించి పంపేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
