AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు.. కౌంటింగ్ ప్రక్రియ ఎలా ఉంటుందంటే…

MLC Elections Counting : అసెంబ్లీ ఎన్నికలకు ఏ మాత్రం తీసిపోని తరహాలో సాగిన ఎన్నికల పోరు. అదే స్థాయిలో ప్రచారంతో హోరెత్తించిన అభ్యర్థులు. పోటాపోటీగా తలపడిన అభ్యర్థులు, పార్టీల్లో గెలుపు ఎవరికి దక్కబోతోందో తేలే ప్రక్రియ మరికాసేపట్లోనే మొదలుకాబోతోంది. గెలుపుపై ఎవరికి వాళ్లు ధీమాతో ఉన్నారు. అయితే మిగతా ఎన్నికల ఓట్ల లెక్కింపుతో పోల్చితే ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ భిన్నంగా ఉండటంతో.. ఫలితం ఎవరి వైపు మొగ్గుతుందనే ఉత్కంఠ నెలకొంది.

ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు.. కౌంటింగ్ ప్రక్రియ ఎలా ఉంటుందంటే...
Election Counting
Ram Naramaneni
|

Updated on: Mar 03, 2025 | 7:09 AM

Share

ఏపీ, తెలంగాణలో హోరాహోరీగా సాగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నల్లగొండలో వరంగల్‌- ఖమ్మం- నల్లగొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానం ఓట్ల లెక్కింపు జరగనుంది. కరీంనగర్‌- మెదక్‌- ఆదిలాబాద్‌- నిజామాబాద్‌ పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం కరీంనగర్‌లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. కౌంటింగ్‌ ప్రారంభమైనప్పటి నుంచి చివరి వరకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సిబ్బందికి సూచించారు. ఓట్ల లెక్కింపు చేసే హాళ్లలో సీసీ కెమెరాలను, భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఏపీలో.. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా-గుంటూరు జిల్లాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్ స్థానాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. గుంటూరులోని ఏసీ కాలేజీలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఏలూరులోని సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జరగనుంది.

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. ఆంధ్రా యూనివర్శిటీ ఈఈఈ బిల్డింగ్ లో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ స్టార్ట్ కానుంది. మూడు అంచెలుగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుండగా ఫలితం తేలడానికి 10 గంటలకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది. రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించాల్సిన వస్తే.. ఫలితం మరింత ఆలస్యం కావొచ్చు. తొలి ప్రాధాన్యత ఓటుతోనే విజేత ఎవరో తేలితే.. సాయంత్రం 4 గంటలకే కౌంటింగ్ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

భిన్నంగా ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ

ఇతర ఎన్నికల ఓట్ల లెక్కింపుతో పోల్చితే ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ భిన్నంగా ఉంటుంది. ఇందులో పోలైన ఓట్లలో చెల్లుబాటు అయిన ఓట్లనే పరిగణనలోకి తీసుకుంటారు. అలా ఆ ఓట్లలో సగానికంటే ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా ఆ అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. మొదటి ప్రాధాన్యత ఓటుతో ఏ అభ్యర్థి ఈ మార్క్‌ను చేరుకోకపోతే ఎలిమినేషన్ ​ప్రక్రియను ప్రారంభిస్తారు. గెలుపు కోటాకు సరిపడినన్ని ఓట్లు ఎవరికైతే వస్తాయో అప్పటి వరకు మిగతా ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. ఈ విధంగా మొదటి ప్రాధాన్యత తర్వాత రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. అయితే పోటీ చేసిన అభ్యర్థుల్లో అందరికన్నా మొదటి ప్రాధాన్యత ఓట్లు తక్కువ వచ్చిన అభ్యర్థి నుంచి ఈ ఎలిమినేషన్​ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఈ క్రమంలో అభ్యర్థులు సాధించిన మొదటి ప్రాధాన్యత ఓట్ల జాబితాను తయారు చేస్తారు. ఇలా చివరి అభ్యర్థికి రెండో ప్రాధాన్యత ఎవరికి వేశారనే ఓట్లను లెక్కించి ఆ ఓట్లను ఆయా అభ్యర్థుల ఖాతాలో వేస్తారు. ఇలా కింద నుంచి పై వరకు ఇదే తరహాలో లెక్కించి, ఈ ఓట్లను వారికి కలుపుతూ చివరి అభ్యర్థులను ఎలిమినేట్​ చేస్తూ వెళతారు. ఒకవేళ రెండో ప్రాధాన్యత ఓట్లలోనూ మెజార్టీ ఓట్ల మార్కుకు ఏ అభ్యర్థి చేరకపోతే మూడో ప్రాధాన్యత ఓట్లను లెక్కించి ఆ అభ్యర్థులకు ఖాతాలో వేస్తారు. అప్పటికీ ఫలితం తేలకపోతే నాలుగో ప్రాధాన్యత ఓట్లను కూడా లెక్కిస్తారు. ఇలా మెజారిటీ మార్కు సంఖ్యను ఏదో ఒక అభ్యర్థి చేరేవరకు ఎలిమినేషన్​ప్రక్రియ సాగుతుంది. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు ఓటముల్లో మొదటి ప్రాధాన్యంతో పాటు ఇతర ప్రాధాన్యత ఓట్లు కూడా చాలా కీలకం అవుతాయి.