Lance Naik Sai Teja: దేశం ముద్దుబిడ్డ.. నిను మరవదు ఈ గడ్డ.. సాయితేజకు సెల్యూట్
లాన్స్ నాయక్ సాయితేజ.. దేశం ముద్దుబిడ్డ.. నిను మరవదు ఈ గడ్డ అంటూ రేగడపల్లె భోరుమంటోంది. కుటుంబసభ్యులంతా గుండెలవిసేలా రోధిస్తుంటే.. ఊరు ఊరంతా ఏకమై వారిని ఓదార్చే ప్రయత్నం చేస్తోంది.
లాన్స్ నాయక్ సాయితేజ.. దేశం ముద్దుబిడ్డ.. నిను మరవదు ఈ గడ్డ అంటూ రేగడపల్లె భోరుమంటోంది. కుటుంబసభ్యులంతా గుండెలవిసేలా రోధిస్తుంటే.. ఊరు ఊరంతా ఏకమై వారిని ఓదార్చే ప్రయత్నం చేస్తోంది. విషాద ఛాయలు అలుముకున్న రేగడపల్లె.. సాయితేజ ఆఖరి చూపు కోసం ఎదురుచూస్తోంది. చిత్తూరుజిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో.. రేగడపల్లె.. ఓ చిన్న గ్రామం. వీరుడికి పురుపు పోసిన ఈ పల్లె ఇప్పుడు దు:ఖ సాగరంలో మునిగిపోయింది. దేశానికి భద్రత కల్పించే అధికారికి… నిరంతరం కాపు కాసిన వీరుడు వీర మరణం చెందగా.. ఆ పల్లె కన్నీరు పెడుతోంది.
సాయితేజ.. సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టాడు. 30 ఏళ్లు కూడా నిండలేదు. అయితేనేం.. దేశానికి సేవచేస్తూ.. ఊపిరి వదిలి.. చిరస్థాయిగా జనం గుండెల్లో నిలిచిపోయాడు. టెన్త్ వరకు ఊళ్లోనే చదువుకున్నాడు సాయితేజ. డిగ్రీ పూర్తయ్యాక.. గుంటూరులో జరిగిన ఆర్మీ సెలక్షన్‌కి హాజరై 2012లో సోల్జర్‌గా సెలెక్ట్ అయ్యాడు. ఆ తర్వాత పారా కమాండో ఎగ్జామ్ పాసై.. 11వ పారా లాన్స్ నాయక్ హోదా దక్కించుకున్నాడు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ ఏర్పాటైన తర్వాత తొలి సీడీఎస్ జనరల్ బిపిన్‌కు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేశాడు.
సాయితేజ ఢిల్లీలో ఉన్నా ఊళ్లో ఉన్నా క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవాడు. ఆయన ఫిట్‌నెస్ చూసి మిత్రులంతా ఆశ్చర్యపోయేవాళ్లు. క్రికెట్ చాలా ఇష్టంగా ఆడే సాయితేజ.. యువతను టోర్నమెంట్లకు పంపుతూ ఎంకరేజ్ చేసేవాడు. అందరితో కలుపుగోలుగా ఉంటూ.. చిరునవ్వుతో పలకరించేవాడని గ్రామస్తులు గుర్తు చేసుకుంటున్నారు. పిల్లలు తమతోనే ఉండాలి.. మనవళ్లు, మనవరాళ్లతో ఇల్లు సందడిగా ఉండాలి.. ఏ పేరెంట్స్ అయినా ఇలానే భావిస్తారు. కానీ భువనేశ్వరి-మోహన్ దంపతులు మాత్రం తమ ఇంటి బిడ్డలను.. దేశ సేవకు పంపారు. దేశానికే రక్షణ కల్పించే తమ బిడ్డలను చూసి.. ఆనందపడ్డారు. ఉన్న ఇద్దరు పిల్లలు ఆర్మీలో చేరగా.. పెద్ద కొడుకు రక్షణ విధుల్లోనే వీర మరణం చెందాడు.
బిడ్డలను చూడాలని, వారితో మాట్లాడాలని ఉందని సాయితేజ వీడియో కాల్ చేశాడని.. అదే చివరి కాల్ అవుతుందని ఊహించలేదంటూ భార్య శ్యామల గుండెలవిసేలా రోదిస్తోంది. ఏమి జరిగిందో, ఏంటో తెలియక… చిన్నారులిద్దరూ అమాయకంగా చూడటం అందర్నీ కలచివేస్తోంది. సాయితేజ్ మరణంతో రేగడపల్లెలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన పార్దీవదేహం కోసం కుటుంబంతో పాటు ఊరు ఊరంతా ఎదురుచూస్తోంది.
Also Read: సరైన సినిమా పడితే బాలయ్య స్టామినా ఇది.. కలెక్షన్ల ఊచకోత.. వన్ వీక్ రిపోర్ట్
Kurnool district: మిరప చేనులో నక్కిన భారీ కొండచిలువ.. రైతు పొలానికి వెళ్లగానే