Mango Farmers: ఆందోళన బాట పట్టిన మామిడి రైతులు.. గిట్టుబాటు ధర కల్పించాలంటూ డిమాండ్
చిత్తూరు జిల్లా మామిడి రైతులు ఆందోళన బాట పట్టారు. మామిడి పంటకు గిట్టుబాటు ధర ఇప్పించాలంటూ మంగళవారం బంగారుపాలెం మార్కెట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. గతంలో మామిడి...
చిత్తూరు జిల్లా మామిడి రైతులు ఆందోళన బాట పట్టారు. మామిడి పంటకు గిట్టుబాటు ధర ఇప్పించాలంటూ మంగళవారం బంగారుపాలెం మార్కెట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. గతంలో మామిడి పంటకు గిట్టుబాటు ధర ఇప్పిస్తామని చెప్పిన ప్రభుత్వం చేతులెత్తేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మామిడి రైతులు మార్కెట్ ఎదుట మామిడికాయలు పారబోసి బైటాయించారు. తోతాపురి కిలోకి రూ.20 చెల్లించాలని, ధరల పట్టికను గుజ్జు పరిశ్రమ వద్ద ప్రదర్శించాలని డిమాండ్ చేశారు.
మామిడి బోర్డు ఏర్పాటు చేయాలని రైతులు కోరారు. సహకార రంగంలో గుజ్జు పరిశ్రమను స్థాపించాలంటూ రైతులు డిమాండ్ చేశారు. జిల్లాలో గుజ్జు పరిశ్రమల యజమానులు సిండికేటుగా మారి గిట్టుబాటు ధర దక్కకుండా చేశారని రైతులు ఆరోపించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 23న కలెక్టరేట్ ఎదుట సామూహిక నిరాహార దీక్ష చేపట్టనున్నామని హెచ్చరించారు.
సోమవారం కలెక్టరేట్ ఎదుట మామిడికాయలు పారబోసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సమస్యలపై డీఆర్‌వో మురళికి వినతిపత్రం అందజేశారు. నాయకులు నరసింహులు, హేమలత, కుమార్, హరిబాబు, కోదండ, శ్రీనివాస్, బాలాజీ, యువరాజ్, దామోదరం, జయచంద్ర తదితరులు పాల్గొన్నారు.