Andhra: చిన్న ముంబాయిలో ఎంత ఘోరం.. తల్లీకొడుకుల ప్రాణాలు బలి తీసుకున్న మైక్రో వ్యాపారులు..
బాపట్ల జిల్లా చీరాలలో ఘోరం జరిగింది.. మైక్రో ఫైనాన్షియర్ల వేధింపులు భరించలేక చిరు వ్యాపారం చేసుకుంటున్న తల్లీకొడుకులు ఆత్మహత్య చేసుకున్నారు.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఈనెల 13వ తేదిన జరిగింది. ఒంటిపై పెట్రోల్ పోసుకుని తల్లీకొడుకులు నిప్పంటించుకున్న ఘటనలో అదేరోజు తల్లి మృతి చెందగా, తాజాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొడుకు కూడా చనిపోయాడు.

బాపట్ల జిల్లా చీరాలలో ఘోరం జరిగింది.. మైక్రో ఫైనాన్షియర్ల వేధింపులు భరించలేక చిరు వ్యాపారం చేసుకుంటున్న తల్లీకొడుకులు ఆత్మహత్య చేసుకున్నారు.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఈనెల 13వ తేదిన జరిగింది. ఒంటిపై పెట్రోల్ పోసుకుని తల్లీకొడుకులు నిప్పంటించుకున్న ఘటనలో అదేరోజు తల్లి మృతి చెందగా, తాజాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొడుకు కూడా చనిపోయాడు. ఈ ఘటన చీరాలలో కలకలం రేపింది. మైక్రో ఫైనాన్సియర్ల ఆగడాలను అరికట్టి తల్లీకొడుకుల మృతికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాల నేతలు కోరుతున్నారు. అయితే ఇంత వరకు నిందితులను అరెస్ట్ చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
రెచ్చిపోతున్న ఫైనాన్స్ వ్యాపారులు..
చిన్న ముంబాయిగా పేరున్న చీరాలలో మైక్రో ఫైనాన్స్ వ్యాపారులు రెచ్చిపోతున్నారు. వడ్డీల మీద వడ్డీలు వేసి చిరువ్యాపారులను జలగల్లా పట్టిపీడిస్తున్నారు. వీరి బారిన పడి ఎంతోమంది అధిక వడ్డీలు చెల్లించలేక ఆస్తులు, ఆప్తులను కోల్పోతున్నారు. మరికొందరు ఎవరికీ చెప్పుకోలేక, పరువు పోయిందన్న బాధతో ఆత్మహత్యలకు తెగబడుతున్న ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా చీరాలలో చిరువ్యాపారం చేసుకునే తల్లీకొడుకులు మైక్రో ఫైనాన్షియర్ల వేధింపులు తట్టుకోలేక ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పగించుకోవడంతో 90 శాతం గాయాలపాలై మృత్యువాత పడ్డారు.
తండ్రి అనారోగ్యంతో, తల్లీకొడుకు అప్పుల బాధతో మృత్యువాత…
బాపట్లజిల్లా చీరాల కొట్లబజారులో నివాసం ఉండే 55 ఏళ్ల వేముల సుజాత, 23 ఏళ్ళ ఆమె కుమారుడు సాయి రైల్వేస్టేషన్ దగ్గర చిన్న టిఫిన్ బండి పెట్టుకుని జీవిస్తున్నారు. సుజాత భర్త అనారోగ్యంతో మరణించడంతో కుటుంబ పోషణ ఆమెపై పడింది. ఎదిగొచ్చిన కొడుకును తోడు తీసుకుని రైల్వేస్టేషన్ దగ్గర తోపుడు బండిపై టిఫిన్ బండి పెట్టుకుని చిరువ్యాపారం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మైక్రో ఫైనాన్సియర్ల దగ్గర అప్పు తీసుకున్నారు. ఎంత కట్టినా అసలు తీరకపోగా ఇంకా వడ్డీలు కట్టాలంటూ వడ్డీ వ్యాపారులు తీవ్రంగా ఒత్తిడి పెంచడంతో ఆ తల్లీకొడుకులు భరించలేక పోయారు. ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన తల్లీకొడులు తమ గోడును ఎవరికీ చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు.
ఈ నెల 13న వేటపాలెం మండలం శ్రీనివాసనగర్ సమీప పొలాల్లో పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న బంధువులు, స్నేహితులు ఇద్దర్నీ చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే తల్లి సుజాత మృతి చెందింది. కొడుకు సాయిను మెరుగైన చికిత్స నిమిత్తం ఒంగోలు జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాయి ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశాడు. తోటి వ్యాపారి మృతి చెందడంతో సంతాపం తెలుపుతూ సోమవారం చీరాలలో టిఫిన్ బండ్లు మూసివేశారు. వడ్డీవ్యాపారుల వేధింపుల వల్లే తాము చనిపోవాలని నిర్ణయించుకుని ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నామని 90 శాతం కాలిన గాయాలైన సాయి.. మరణించే ముందు మరణ వాంగ్మూలం ఇచ్చాడు.
కఠిన చర్యలు తీసుకోరా…?
చీరాలలో చిరువ్యాపారుల నుంచి కొందరు వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీలు వసూలు చేస్తూ వారిని మానసికంగా మనోవేదనకు గురిచేస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. వడ్డీ వ్యాపారులు, డైలీ ఫైనాన్స్ వ్యాపారులను కట్టడి చేయాలని కోరుతున్నారు. తల్లీకొడుకులు మృతి చెందిన ఘటనలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని, మున్ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.
స్పందించని నేతలు, ప్రజా ప్రతినిధులు…
చీరాల పట్టణంలో ఇంత ఘోరం జరిగితే ఇటు రాజకీయ నేతలు, అటు పోలీసు ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నట్టు కనిపించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఘటన జరిగిన సమయంలో సంక్రాంతి సంబరాల్లో మునిగిపోయిన నేతలు, పోలీసులు.. ఈ జంట ఆత్మహత్యలపై ఇప్పటికైనా సీరియస్‌గా దృష్టి పెట్టాలని ప్రజా సంఘాల నేతలు కోరుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
