AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విజయవాడలో బాధితులకు సీఎం భరోసా.. పూర్తిగా అండగా ఉంటానన్న చంద్రబాబు

విజయవాడలోనూ సీఎం చంద్రబాబు ప్రజలకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. విజయవాడ ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు.

విజయవాడలో బాధితులకు సీఎం భరోసా.. పూర్తిగా అండగా ఉంటానన్న చంద్రబాబు
AP CM Chandrababu Naidu
Balaraju Goud
|

Updated on: Sep 01, 2024 | 9:59 PM

Share

భారీ వర్షాలు, వరదలు, ఇతర ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు పాలకులు ప్రజలను కలవడం, వారిని పరామర్శించడం సర్వసాధారణం. కానీ ఈ విషయంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు తీరు మాత్రం మిగతా వారికంటే భిన్నంగా ఉంటుంది. ఏదో బాధితులను నామమాత్రంగా పరామర్శించి వెళ్లిపోకుండా.. పరిస్థితులు పూర్తిగా చక్కబడేంతవరకు పని చేయడం చంద్రబాబు స్టయిల్. తానే స్వయంగా రంగంలోకి దిగితే.. అధికారగణం అంతా సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొంటుందని ఆయన భావిస్తుంటారు. పరిస్థితులు చక్కబెట్టేందుకు తాను పనిచేస్తూ.. అధికారులతో పని చేయిస్తుంటారు. 74 ఏళ్ల వయసులోనూ అదే జోరు చూపిస్తున్నారు.

తాజాగా విజయవాడలోనూ సీఎం చంద్రబాబు అదే తరహాలో ప్రజలకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిపారు. భారీ వర్షాలు, వరదల పరిస్థితిపై సమీక్షించారు. వరదల కారణంగా రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు వివరించినట్లు చంద్రబాబు తెలిపారు. ప్రాణ నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సాయం అందజేస్తామని అమిత్ షా హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. బాధితులను ఆదుకునేందుకు కేంద్రం నుంచి అదనపు బలగాలు రాష్ట్రానికి రానున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఈ రాత్రికి విజయవాడ కలెక్టరేట్‌లో ఉండి స్వయంగా సమీక్షిస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు.

రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు విజయవాడ చిగురుటాకులా వణుకుతోంది. ఎక్కడికక్కడ నిలిచిన వరదతో జనజీవనం స్తంభించింది. నగరంలోని పలు కాలనీలు నీటమునిగాయి. ఏరు-దారి ఏకమైపోవడంతో ఇళ్లలోంచి బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. అపార్టుమెంట్ల సెల్లార్లను ఎక్కడికక్కడ వరద ముంచెత్తింది. రోడ్లపై మోకాల్లోతు నీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లోకి నీరు చేరి ప్రమాదకరంగా మారింది. ఈ నేపథ్యంలోనే విజయవాడ కలెక్టరేట్‌లో బస చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు.

అంతకుముందు భారీ వర్షాలు, వరదల కారణంగా పూర్తిగా నీట మునిగిన కాలనీల్లో బోటులో పర్యటించారు. కొందరు వద్దని వారించినా.. చంద్రబాబు మాత్రం వెనక్కి తగ్గలేదు. ప్రజలు కష్టాలు ఉన్నప్పుడు వాళ్లకు ధైర్యం చెప్పాల్సిన అవసరం తన మీద ఉందని ముందుకు కదిలారు. వరదలతో ఇబ్బందిపడుతున్న వారితో మాట్లాడారు. నేనున్నానని వారికి ధైర్యం చెప్పారు. ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు రాత్రంతా కలెక్టర్ కార్యాలయంలోనే ఉంటానని చెప్పారు. అంతేకాదు లక్షమందికి ఆహారం అందించేలా చర్యలు చేపట్టారు. అక్షయపాత్ర సంస్థ చంద్రబాబు ఆదేశాలతో ఇందుకోసం ఏర్పాట్లు చేసింది.

గతంలో హుద్ హుద్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న విశాఖలోనూ ఇదే రకంగా పర్యటించినట్లు చంద్రబాబు తెలిపారు. బస్సులో తిరుగుతూ విశాఖ వాసుల కష్టాలు తెలుసుకున్నానని చెప్పారు. ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలిస్తూ.. వారి ఇబ్బందులు తీర్చానన్నారు. సాధ్యమైనంత తొందరగా ఉక్కు నగరం హుద్ హుద్ ప్రభావం నుంచి కోలుకునేలా చేశామని చంద్రబాబు ఈ సందర్భంగా వెల్లడించారు.

అధికారంలో ఉన్నా.. విపక్షంలో ఉన్నా.. ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను కలిసేందుకు.. వారికి భరోసా కల్పించేందుకు.. సాధ్యమైనంత తొందరగా వాళ్ల దగ్గరికి వెళుతుంటారు చంద్రబాబు. విపక్షంలో ఉన్నప్పుడు పార్టీపరంగా.. అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వపరంగా వారిని ఆదుకునేందుకు ప్రయత్నిస్తారు. తాజాగా భారీ వర్షాలు, వరదల కారణంగా ఇబ్బందిపడుతున్న విజయవాడ, గుంటూరు వాసుల కష్టాలు తీర్చేందుకు జెట్ స్పీడ్‌తో రంగంలోకి దిగిన చంద్రబాబు.. ఈ కష్టం నుంచి ప్రజలను త్వరలోనే గట్టెక్కిస్తారని చాలామంది నమ్ముతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..