AP News: 41ఏ నోటీసులు ఇచ్చి మోహిత్‌రెడ్డిని విడిచిపెట్టిన పోలీసులు
హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని.. బెంగళూరులో తిరుపతి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కాసేపు విచారించి... 41ఏ నోటీసులు ఇచ్చి వదిలేశారు.
వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఎలక్షన్ పోలింగ్ తర్వాత అప్పటి టీడీపీ అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతి డీఎస్పీ రవిమనోహరాచారి నేతృత్వంలో పోలీసులు ఆయన్ను బెంగళూరు విమానాశ్రయంలో అదుపులోకి తీసుకుని.. తిరుపతిలోని ఎస్వీయూ పీఎస్‌కు తరలించి.. కాసేపు విచారించిన అనంతరం 41ఏ నోటీసులు ఇచ్చి వదిలేశారు. మోహిత్ రెడ్డి విదేశాలకు వెళ్లకూడదని పోలీసులు కండీషన్ పెట్టారు. అయితే తనపై అక్రమ కేసు పెట్టారని.. దీనిపై న్యాయ పోరాటం చేస్తానన్నారు మోహిత్ రెడ్డి. కాగా ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం చెవిరెడ్డి మోహిత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ఆ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.
మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి అరెస్ట్‌తో తిరుపతిలో హీట్ నెలకొంది. మే 14న పద్మావతి యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఎమ్మెల్యే పులివర్తి నానిపై జరిగిన దాడిలో ఏ 37గా మోహిత్ రెడ్డి పేరు చేర్చారు పోలీసులు. 52 రోజుల తర్వాత అదుపులోకి తీసుకున్నారు. మోహిత్‌ను అక్రమ కేసులో అరెస్ట్ చేయించారన్నారు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. మోహిత్ తనకు మించి ప్రజల పక్షాన నిలబడతాడని అన్నారు. ప్రజా పోరాటాలు ఎలా ఉంటాయో.. ప్రభుత్వానికి, పోలీస్ అధికారులకు రుచి చూపిస్తారన్నారు. ప్రజల పక్షాన ఏ పోరాటానికైనా సిద్ధమన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.