AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దారం లాంటి ఈ చేపలను అంత ఇష్టంగా ఎందుకు తింటారు.. చీరమేను అసలు సీక్రెట్స్ ఇవే..

సన్నటి దారం ముక్కల్లా ఉండే చీరమీను చేపలు దీపావళికి ముందు గోదావరి నది సముద్రంలో కలిసే ప్రాంతంలో కొద్ది వారాల పాటు మాత్రమే దొరుకుతాయి. వీటిని చీరలతో పట్టి, అధిక ధరలకు అమ్ముతారు. పులసతో పోల్చదగిన డిమాండ్, ధర ఉన్న ఈ చేపలు కాల్షియం, ఇతర ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.

దారం లాంటి ఈ చేపలను అంత ఇష్టంగా ఎందుకు తింటారు.. చీరమేను అసలు సీక్రెట్స్ ఇవే..
Cheeramenu Fish
Ram Naramaneni
|

Updated on: Oct 10, 2026 | 5:47 PM

Share

గోదావరి నది సముద్రంలో కలిసే ప్రాంతంలో, ప్రత్యేకించి చలికాలం ప్రారంభంలో దీపావళికి ముందు రెండు, మూడు వారాల పాటు మాత్రమే దొరికే ఒక అరుదైన చేప చీరమీను. సన్నటి దారం ముక్కల్లా ఉండే ఈ చేపలకు చీరమీను అనే ఆసక్తికరమైన పేరు వచ్చింది. ఎందుకంటే, వీటిని మత్స్యకారులు చీరలు లేదా సన్నటి వలల సహాయంతో పడతారు. ఈ చేపలకు డిమాండ్ చాలా ఎక్కువ.

అరుదైన లభ్యత, వేట పద్ధతులు:

చీరమీను చేపలు కేవలం ఏడాదికి ఒకసారి మాత్రమే లభ్యమవుతాయి. తూర్పు గాలులు మొదలైన తర్వాత, మడ అడవుల సమీపాన అధిక ఆక్సిజన్ ఉన్న నీటిలో అవి గుడ్లు పెడతాయి. ఆ గుడ్లు పిల్లలుగా మారిన తర్వాత, అవి గోదావరి జలాల్లోకి ఎదురీదుతూ వస్తుంటాయి. ఈ సమయంలోనే మత్స్యకారులు వీటిని పట్టుకుంటారు. యానంతో పాటు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, తూర్పు గోదావరి జిల్లాల్లో ఈ చేపలు ఎక్కువగా దొరుకుతాయి. వీటిని చీరలతో పాటు, చిన్న వలలతో కూడా పడతారు.

వలస స్వభావం:

నిపుణులు తెలిపిన ప్రకారం, చీరమీను ఒక వలస చేప (మైగ్రేటరీ ఫిష్). చేపలు వలస వెళ్లడానికి రెండు ప్రధాన కారణాలుంటాయి: ఒకటి కావలసినంత ఆహారం సంపాదించుకోవడానికి, మరొకటి పిల్లలు పెట్టిన తర్వాత వాటికి అవసరమైన పోషకాలను అందించడానికి సురక్షితమైన ప్రాంతానికి వెళ్లడం. చీరమీను చేపలు సుమారు 25 నుంచి 75 సెంటీమీటర్ల వరకు పెరుగుతాయి. సంతానోత్పత్తి కోసం ఇవి ఉప్పునీటి ప్రాంతాలకు వలస వస్తాయి. అయితే, సాధారణంగా లార్వా దశలో ఉన్న చిన్న చేపలనే పట్టుకుని చీరమీను చేపలుగా అమ్ముతుంటారు.

అధిక డిమాండ్, అదిరే ధర:

చీరమీను చేపలకు డిమాండ్ ఊహించని స్థాయిలో ఉంటుంది. సంవత్సరానికి ఒకేసారి దొరికే పులస చేపల మాదిరిగానే చీరమీను కూడా అధిక ధరలకు అమ్ముడవుతుంది. మామూలుగా చేపలను కిలోల లెక్కన అమ్ముతారు కానీ, చీరమీనును తవ్వ, శేరు, కుంచం, బిందెల వంటి ప్రత్యేక కొలతలతో అమ్ముతారు. ఈ సీజన్‌లో శేరు (సుమారు కేజీ) రూ.2,500 నుంచి రూ.4,000 వరకు ధర పలుకుతుంది. బకెట్లు బకెట్లు కూడా అమ్ముతారు.  ఒక్కో బకెట్ చీరమేను ధర రూ.14 వేల నుంచి రూ.18 వేల వరకు పలికింది. రేటు ఎంత ఉన్నా సరే, ఎగబడి కొంటారు. ఇక్కడే కాకుండా, ఈ చేపలను హైదరాబాద్, అమెరికా వంటి ప్రాంతాలకు కూడా ప్యాకింగ్ చేసి పంపిస్తారు. ఎదురులంక రాజులు, అమలాపురం, నర్సాపురం ప్రాంతాల ప్రజలు యానాం వచ్చి వీటిని కొనుగోలు చేస్తారు.

ఆరోగ్య ప్రయోజనాలు, వంట విధానాలు:

చీరమీను చేపల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను నిపుణులు వివరించారు. చిన్న సైజు చేపలను ఎముకలతో సహా తినడం వల్ల శరీరానికి అవసరమైన కాల్షియం సమృద్ధిగా లభిస్తుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా బాలింతల్లో పాల ఉత్పత్తిని పెంచడానికి పెద్దలు ఈ చేపలను సిఫార్సు చేస్తారు, ఎందుకంటే అధిక కాల్షియం తల్లి పాలు పెరగడానికి, తద్వారా పెరుగుతున్న బిడ్డకు పోషకాలు లభించడానికి తోడ్పడుతుంది. చీరమీనును చింతకాయ వేసి వండటం లేదా చింతకాయ గుజ్జు తీసి వండటం ఆనవాయితీ. కొందరు మాంసం కూరలాగా ఇగురు వండుకుంటారు. ఈ చేప రుచి చాలా బాగుంటుందని, ముఖ్యంగా రాజులు దీన్ని చాలా బాగా వండుతారని, అధిక ధర పెట్టినా సరే కొంటారని స్థానికులు చెబుతారు.

Follow Us