AP News: రేయ్ ఎవడ్రా నువ్వు ఇంత ట్యాలెంటెడ్‌గా ఉన్నావ్..డ్రమ్ నిండా డిజీల్ కొట్టించుకొని..
అది సత్తెనపల్లిలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్.. రాత్రి తొమ్మిది గంటల సమయం... పెట్రోల్ బంక్లో పెద్దగా హాడావుడి లేదు...ఓ కుర్రాడు నేరుగా పెట్రోల్ బంక్‌లోకి వచ్చాడు. పెట్రోల్ బంక్ నిర్వాహకులతో బల్క్‌లో డిజీల్ కావాలంటూ అడిగాడు. వెయ్యి లీటర్ల డిజీల్ కావాలని చెప్పడంతో బంక్ నిర్వాహకులు కూడా పెద్ద మొత్తంలో ఆర్డర్ వచ్చినట్లు భావించారు.
ఆ కుర్రాడితో మాట్లాడిన తర్వాత డిజీల్ కొట్టడానికి సిద్దమయ్యారు. అదే సమయంలో క్యాన్లతో కూడిన ఆటో ఒకటి వచ్చింది ఆటోతో పాటు కొంతమంది లారీ డ్రైవర్లు కూడా అక్కడికి వచ్చారు. అయితే ఆ సన్నని కుర్రాడితో మాట్లాడిన నిర్వాహకులు 765 లీటర్ల డిజీల్‌ను ఆటోలో ఉన్న క్యాన్లలో నింపారు. వెంటనే ఆ కుర్రాడు మిగిలిన డిజీల్ వేరే ఆటోలో ఉన్న క్యాన్ల పట్టాలని చెప్పి అక్కడున్న ఆటోను పంపించాడు. అయితే అటు బంక్ సిబ్బంది ఇటు కుర్రాడు కొద్దీ సేపు మాట్లాడుకున్నారు. సిబ్బందిని మాటల్లో పెట్టిన కుర్రాడు ఆటోను పిలుస్తున్నాననంటూ రోడ్డు పైకి వచ్చి మాయమయ్యాడు. ఆ తర్వాత ఎంత సేపు చూసిన ఆ కుర్రాడు రాలేదు. దీంతో అనుమానం వచ్చిన బంక్ సిబ్బంది 765 లీటర్లకు డబ్బులు రాలేదని నిర్వాహకులకు చెప్పారు. దీంతో అక్కడే ఉన్న లారీ డ్రైవర్లను నిర్వాహకులు ప్రశ్నించారు. దీంతో అసలు జరిగిన మోసం బయటపడింది.
ఆ కుర్రాడితో మాకు ఎటువంటి సంబంధం లేదని డ్రైవర్లు చెప్పారు. బంక్‌కు చెందిన కుర్రాడినంటూ డ్రైవర్లతో అంతకముందే మాటలు కలిపిన కుర్రాడు డెబ్బై రూపాయలకే లీటర్ డిజీల్ కొట్టిస్తానని వారితో చెప్పి బంక్ వద్దకు తీసుకొచ్చినట్లు వారు నిర్వాహకులకు తెలిపారు. అంతేకాకుండా వెయ్యి లీటర్ల ఒకేసారి కొట్టిస్తే మాకు తక్కువకే వస్తుందని డ్రైవర్లను నమ్మించిన కుర్రాడు వారి వద్ద నుండి ఏకంగా యాభై మూడు వేల రూపాయలు తీసుకొన్నాడు. ఆ డబ్బులు బంక్ వాళ్లకు ఇవ్వకుండానే అక్కడ నుండి జంప్ అయ్యాడు. దీంతో బంక్ సిబ్బంది, నిర్వాహకులు మోసపోయినట్లు గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే డిజీల్ కొట్టిచ్చిన కుర్రాడిని సీసీ కెమెరా విజువల్స్ ద్వారా గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. డ్రైవర్లతో బంక్ సిబ్బందినని అటు బంక్ నిర్వాహకులతో డ్రైవర్లకు చెందిన వ్యక్తినని నమ్మబలికి ఇద్దరిని బురిడీ కొట్టించి యాభై మూడు వేల రూపాయలతో ఉడాయించడం కలకలం రేపింది. అయితే సీసీ కెమెరా విజువల్స్‌ను పరిశీలించిన ఆ కుర్రాడిని గుర్తించలేకపోయారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి కేటుగాడిని గుర్తించే పనిలో పడ్డారు.
వీడియో:
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.