AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీలో రక్తికడుతున్న సారా రాజకీయం.. ఆ విషయంలో సక్సస్ సాధించిన విపక్షాలు..

Jangareddygudem Incident: అవును.. ఇప్పుడు ఏపీలో సారా రాజకీయం నడుస్తోంది. అన్ని పార్టీలు ఇప్పుడు నాటుసారా మరణాలపైనే దృష్టిపెట్టాయి. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం ఇందుకు వేదిక అవుతోంది.

Andhra Pradesh: ఏపీలో రక్తికడుతున్న సారా రాజకీయం.. ఆ విషయంలో సక్సస్ సాధించిన విపక్షాలు..
Jangareddygudem Incident
TV9 Telugu
| Edited By: Janardhan Veluru|

Updated on: Mar 16, 2022 | 2:03 PM

Share

AP Politics: అవును.. ఇప్పుడు ఏపీలో సారా రాజకీయం నడుస్తోంది. అన్ని పార్టీలు ఇప్పుడు నాటుసారా మరణాలపైనే దృష్టిపెట్టాయి. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం(Jangareddygudem) ఇందుకు వేదిక అవుతోంది. అన్ని ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు నాటుసారా మరణాలు అనే అంశాన్ని అధికార YCPపై దుమ్మెత్తిపోయడానికి ఒక అస్త్రంగా మలుచుకుంటున్నాయి. ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీ (TDP) మొదలుపెట్టిన ఈ వివాదాన్ని అటు BJP.. ఇటు జనసేన, కాంగ్రెస్ , లెఫ్ట్ పార్టీలు తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఏపీ అసెంబ్లీలో సైతం తెలుగుదేశం పార్టీ సింగిల్ ఎజెండాగా జంగారెడ్డిగూడెం నాటుసారా మరణాల అంశాన్ని తీసుకుని సభలో ఆందోళ చేస్తూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఒక విధంగా ఇదే అంశంతో ప్రతిరోజూ టీడీపీ సభ్యులు సభ నుంచి సస్పెండ్ అవుతున్నారు. సాక్షాత్తూ సీఎం జగన్ ప్రతిరోజూ సభలో దీనిపై వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోంది. అసలు అవి నాటుసారా తాగిన మరణాలు కాదనేది రాష్ట్ర ప్రభుత్వ వాదన. ఎలాంటి ఆధారాలు లేకుండానే ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని సీఎం సభలో అసహనం వ్యక్తంచేశారు. అసలు ఇంతకీ జంగారెడ్డి గూడెంలో ఏం జరిగింది..? ఇందులో 18మంది చనిపోయింది నిజమేనా..? లేక ఇది సారా రాజకీయమా..?

వాళ్లంతా నాటుసారా తాగే చనిపోయారా..?

ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సింది అక్కడి ఎక్సైజ్ అధికారులు.. కానీ ఇంతవరకూ ఎక్సైజ్ అధికారులెవరూ ఇక్కడ నాటుసారా తాగి అంతమంది చనిపోయారని చెప్పడం లేదు. పోనీ జిల్లా ఆరోగ్యశాఖాధికారుల దగ్గర ఏదైనా సమాచారం ఉందా అంటే అదీ లేదు. అసలు ఆరోగ్య శాఖ రికార్డుల్లో ఈ మరణాలు లేనేలేవు. ఇందులో నలుగురు తప్ప మిగిలిన వారంతా సహజమరణాలే అనేది ఆరోగ్యశాఖాధికారులు ఇస్తున్న సమాచారం. మరి ప్రభుత్వాధికారులెవరూ ధృవీకరించకుండానే.. ఇవి నాటుసారా మరణాలు ఎలా అయ్యాయి అనేది ఇంతవరకూ ఎక్కడా క్లారిటీ రావడం లేదు. పోనీ బాధితులు ఎవరైనా నాటుసారా వల్లే తమవాళ్లు చనిపోయారని బాధితులు ఫిర్యాదు చేసిన దాఖలాలు కూడా లేవు.

మరి ఎక్కడ పుట్టిందీ వ్యవహారం..?

జంగారెడ్డి గూడెం పరిసరాల్లో నాటుసారు కాస్తున్నమాట వాస్తవమే. ఒక్క జంగారెడ్డిగూడమే కాదు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ నాటుసారా కాస్తున్నారు.. అమ్ముతున్నారు..తాగేవాళ్లు తాగుతున్నారు. అందులోనూ ఏపీలో లిక్కర్ రేటు పెరగడంతో సారావైపు ఎక్కువ మంది మళ్లుతుండడంతో సారా వ్యాపారం కూడా బాగానే ఉంది. అయితే నాటుసారా వికటిస్తేనో ఇంకోటి జరిగితే మరణాలన్నీ ఒకేచోట సంభవిస్తాయి. కానీ ఇక్కడ అలా జరగలేదు. జంగారెడ్డి గూడెం లోని అనేక గ్రామాల్లో గత రెండుమూడు నెలలుగా వివిధ కారణాలతో పద్దెనిమిది మంది చనిపోయిన మాట వాస్తవం..ఇలా చనిపోయినవారిలో కొంతమందికి మద్యం సేవించే అలవాటు ఉన్న మాట వాస్తవం.. అయితే ఇందుకు రకరకాల కారణాలున్నాయి..వారిలో కొంతమంది వృద్దాప్యంతో చనిపోతే మరికొందరు అనారోగ్య కారణాలతో చనిపోయారు. కేవలం నలుగురు మాత్రం విపరీతంగా సారా సేవించి చనిపోయారని బంధువులు చెబుతున్నారు. మిగిలిన వారి బంధువులు ప్రతిపక్షాలు వెళ్లి అక్కడ హడావిడి చేసేదాకా ఎవరూ నోరు విప్పలేదు. ఆ తర్వాత ప్రభుత్వం 18మంది చనిపోయినవారి లిస్ట్ విడుదల చేసింది. అందులో వారు చనిపోవడానికి కారణాలేంటనేది స్పష్టంగా పేర్కొన్నారు అధికారులు. అయితే అందరూ నాటుసారాతోనే చనిపోయారు అని విషయం ఎక్కడి నుంచి పుట్టిందో ఇప్పటికీ మిస్టరీనే..

అన్ని రాజకీయపార్టీలకు ఇప్పుడు ఇదో అస్త్రం..

చాలా కాలం తర్వాత ఏపీలో అన్ని ప్రతిపక్షపార్టీలు కలిసి అధికారపార్టీ(వైసీపీ) మీద దాడి చేయడానికి నాటుసారా మరణాల రూపంలో ఒక అంశం దొరికింది. అందుకే అన్ని పార్టీలు పోటీలు పడి మరీ జంగారెడ్డిగూడెంవైపు పరుగులు తీస్తున్నాయి.. ఇటు ప్రభుత్వం కూడా ఏం సమాధానం చెప్పాలో అర్థంగాక డిఫెన్స్ లో పడిపోయే పరిస్థితి ఏర్పడింది. నాటుసారా మరణాల వ్యవహారంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడంలో టీడీపీ సక్సెస్ అయింది. స్వయంగా చంద్రబాబు జంగారెడ్డి గూడెం వెళ్లడం, ఆ తర్వాత వ్యూహాత్మకంగా టీడీపీ ఎమ్మెల్యేలు వేరే ఏ అంశాలు ప్రస్తావించకుండా సింగిల్ పాయింట్ ఎజెండాగా కేవలం సారా మరణాల అంశాన్ని అసెంబ్లీలో లేవెనెత్తడం జరిగింది. ఇది కేవలం ఒకరోజుతో వదిలేయకుండా గత నాలుగురోజులుగా ఇదే అంశంపై టీడీపీ ఆందోళన చేస్తుండడంతో జనసేన, బీజేపీ, కాంగ్రెస్ , లెఫ్ట్ పార్టీలు సైతం అదే బాటపట్టాయి. మొత్తం మీద ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడంలో ఓ రకంగా సక్సస్ సాధించాయి.

అశోక్ వేములపల్లి, డిప్యూటీ ఇన్ పుట్ ఎడిటర్, టీవీ9 తెలుగు

Also Read..

AP News: ఏపీలో నకిలీ థైరాయిడ్ మందుల కలకలం.. అనుమానం రాకుండా దందా.. చివరకు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలభిషేకం చేసిన గ్రామస్తులు.. ఎందుకంటే..