Chandrababu Naidu: “ప్రకటనలపై పెడుతున్న శ్రద్ధ ప్రజా పాలనపై పెట్టాలి”.. సీఎంకు చంద్రబాబు సూచన
కాకినాడ జిల్లాలో జరిగిన యువతి హత్య ఘటనపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో స్పందించారు. హత్య విషయంలో చట్టమే లేని దిశా చట్టం ప్రకారం నిందితులపై చర్యలు...
కాకినాడ జిల్లాలో జరిగిన యువతి హత్య ఘటనపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో స్పందించారు. హత్య విషయంలో చట్టమే లేని దిశా చట్టం ప్రకారం నిందితులపై చర్యలు అంటూ స్వయంగా సీఎం ప్రకటనలు చేయడం హాస్యాస్పదంగా ఉందని మండిపడ్డారు. మహిళలపై రోజురోజుకు పెరిగిపోతున్న నేరాలను అరికట్టడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకటనలపై పెడుతున్న శ్రద్ధ ప్రజా పాలనపై పెట్టాలని హితవు పలికారు. సీఎం, ప్రభుత్వం ఇలాంటి ఉత్తుత్తి ప్రకటనలు మాని, నిందితులకు వెంటనే శిక్షపడేలా చూడాలని డిమాండ్ చేశారు. అలా చేసినప్పుడు మాత్రమే నేరస్తులకు భయం, మహిళలకు నమ్మకం కలుగుతుందని సూచించారు. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న చట్టాలనూ పోలీసులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వారు పట్టించుకోని ఉంటే ఇలాంటి నేరాలు జరగకుండా ఉండేవని ఆవేదన చెందారు. మహిళలపై నేరాల విషయంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని.. తద్వారా బాధితులు మోసపోతున్నారని ప్రభుత్వ తీరుపై చంద్రబాబు మండిపడ్డారు.
కాగా.. దేవకి హత్య ఘటనపై సీఎం జగన్ స్పందించారు. ఆమె కుటుంబానికి రూ.10 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. కాకినాడ జిల్లా కాండ్రేగుల కూరాడలో ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురయిన దేవకి మరణంపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేవకి కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ప్రకటించారు. ఘటనపై కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబుతో ఫోన్లో మాట్లాడారు. జరిగిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా యువతి కుటుంబానికి అండగా నిలవాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు.
కాకినాడ రూరల్ పెదపూడి మండలంలోని కూరాడకు చెందిన ఓ యువతిని కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన గుబ్బల వెంకట సూర్యనారాయణ ప్రేమించాలంటూ వేధిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం యువకుడు దారి కాసి ఆమె వస్తుండగా కత్తితో దాడి చేశాడు. గొంతు కోసేశాడు. ఘటనను చూసిన స్థానికులు 108 కు సమాచారమిచ్చారు. తీవ్రంగా గాయపడిన యువతి అంబులెన్స్ వచ్చేసరికి ప్రాణాలు కోల్పోయింది. నేరస్థుడిని పట్టుకున్న స్థానికులు.. దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వగా.. పెదపూడి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆ మృగాడిని అదుపులో తీసుకున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..