Andhra Pradesh: భేటీ అజెండాలో బిగ్ ట్విస్ట్.. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని తొలగించిన కేంద్ర హోంశాఖ

కేంద్రం బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. ప్రత్యేక హోదాపై చర్చించనున్నట్లు మార్నింగ్ తెలిపి. సాయంత్రం కల్లా అది పొరపాటు నుంచి అంటూ కొత్త సర్కులర్ ఇచ్చింది. దీంతో ఏపీ ప్రజల ఆశలు ఆవిరయ్యాయి.

Andhra Pradesh: భేటీ అజెండాలో బిగ్ ట్విస్ట్..  ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని తొలగించిన కేంద్ర హోంశాఖ
Ap Special Status Issue
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 12, 2022 | 7:40 PM

ఈ నెల 17న జరిగే తెలుగు రాష్ట్రాల భేటీ అజెండాలో కేంద్ర హోంశాఖ మార్పులు చేసింది. ఏపీకి ప్రత్యేక హోదా(Special Status) అంశాన్ని తొలగించింది. అజెండాలో మార్పు చేస్తూ మరో సర్క్యులర్‌ జారి చేసింది. సమావేశం అజెండాలో తొలుత ప్రత్యేక హోదా, పన్ను రాయితీలను కేంద్ర హోంశాఖ చేర్చింది. అయితే బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు(GVL Narasimha Rao )మాట్లాడిన అనంతరం పొరపాటును కేంద్ర హోంశాఖ గ్రహించింది. సమావేశం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న అపరిష్కృత అంశాలకు మాత్రమే పరిమితమని జీవీఎల్‌కు హోం శాఖ స్పష్టం చేసింది. తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాల పరిధిలోకి రాని ప్రత్యేక హోదా, పన్ను రాయితీలు సహా మరికొన్ని అంశాలను అజెండా నుంచి తొలగించింది. సవరించిన ఎజెండాతో తాజా ఉత్తర్వులు విడుదల చేసింది. ఏపీ విభజన చట్టంలోని హామీల అమలు, తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై కేంద్రం ఫోకస్‌ చేస్తోంది. ఇందుకోసం కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి నేతృత్వంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఏపీ, తెలంగాణ నుంచి ఒక్కొక్కరు కమిటీలో ఉంటారు. ఈ నెల 17న త్రిమెన్‌ కమిటీ తొలి భేటీ జరుగుతుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగనున్న సమావేశంలో వివిధ అంశాలపై చర్చించబోతున్నారు.  తాజా సర్కులర్‌లో.. అజెండా నుంచి ప్రత్యేక హోదా అంశాన్ని తొలగించింది. కేవలం 5 అంశాలతో మాత్రమే అజెండా తయారు చేసింది.

హోదా అంశంపై జీవీఎల్ క్లారిటీ…

విభజన సమస్యల పరిష్కారం కోసం ఈనెల 17న జరిగే సమావేశం అజెండాలో ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్ర హోంశాఖ ప్రస్తావించడంపై బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు ట్విటర్‌లో స్పందించారు. కేంద్రం కొత్తగా సర్కులర్ జారీ చేయటానికి ముందు ట్విట్టర్ వేదికగా జీవీఎల్.. ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. వైసీపీ ఎంపీలు ఏదో సాధించారని టీవీల్లో విని చాలా సంతోషించానన్న జీవీఎల్‌.. కేంద్ర హోంశాఖ నోట్‌పై ఆరా తీశానట్లు చెప్పారు. స్పెషల్ స్టేటస్ అంశం రెండు రాష్ట్రాల కమిటీ ఎజెండాలో ఉండేది కాదని తెలిసిందని వెల్లడించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే తెలంగాణతో చర్చించాలా? అన్న జీవీఎల్‌ ..ఈ విషయం ఆలోచిస్తే అర్ధమవుతుందని కదా అని పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ నోట్‌ను తాను చూశానని, అధికారులతో మాట్లాడానని ఆతరువాతే వివరణ ఇస్తున్నట్టు తెలిపారు.

‘‘ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటుపై చర్చ ఉంటుందని ప్రస్తావించిన తరుణంలో దీనిపై స్పష్టత తీసుకోవడం కోసం కేంద్రంలోని సీనియర్‌ అధికారులతో మాట్లాడాను. ప్రత్యేక హోదా అనేది రెండు రాష్ట్రాలకు సంబంధించిన విభజన అంశం కాదు. ఇది కేవలం ఏపీకు సంబంధించిన అంశం మాత్రమే. రెవెన్యూ లోటు కూడా ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే సంబంధించిన అంశం. ఈ రెండు అంశాలు జాబితాలోకి ఎలా వచ్చాయని ఆరా తీస్తే.. ఈ కమిటీ రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఆర్థిక పరమైన విషయాల్లో ఎక్కడ విభేదాలు ఉన్నాయో.. అవి పరిష్కరించడానికి మాత్రమే ఏర్పాటైన కమిటీ అని తెలిసింది. ఇందులో ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటు అంశాలపై చర్చకు ఆస్కారం లేదని స్పష్టత వచ్చింది. కానీ, ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం ప్రజల్ని తప్పుదోవపట్టించే విధంగా ఉంది. అందుకే ఈ వివరణ ఇస్తున్నా’’ అని జీవీఎల్‌ పేర్కొన్నారు.