AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ఆయేషా మీరా హత్య కేసులో ముగిసిన సీబీఐ దర్యాప్తు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన ఆయేషా మీరా హత్యకేసు మరోసారి తెరపైకి వచ్చింది. 2007 నుంచి ఈ కేసు అనేక మలుపులు తిరిగి సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించింది. అయితే ఈ కేసులో సీబీఐ అధికారుల విచారణ ముగిసింది. ఫైనల్‌ రిపోర్ట్‌ సీల్డ్‌ కవర్‌లో కోర్టుకు చేరింది. మరి సీబీఐ తన ఏడేళ్ల విచారణలో ఏం తేల్చింది..? ఆ సీల్డ్ కవర్‌లో ఏం ఉంది..? 18 ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఆయేషా మీరా తల్లిదండ్రులకు న్యాయం జరుగుతుందా..?

Andhra: ఆయేషా మీరా హత్య కేసులో ముగిసిన సీబీఐ దర్యాప్తు
Ayesha Meera Case
Ram Naramaneni
|

Updated on: Jun 20, 2025 | 9:41 PM

Share

18 ఏళ్ల క్రితం దారుణ హత్యకు గురైన ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు రీ ఓపెన్ చేసి దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ హైకోర్టుకు తన తుది నివేదికను సీల్డ్ కవర్ లో అందజేసింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటనలో సీబీఐ అందజేసిన నివేదికపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.

2007 డిసెంబర్ 27న బీ.ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య

ఆయేషా మీరా హత్య జరిగిన 2007 నాటి నుంచి ఈ కేసు అనేక మలుపులు తిరిగింది. 2007 డిసెంబర్ 27న విజయవాడ దగ్గర ఇబ్రహీంపట్నంలోని శ్రీ దుర్గ లేడీస్ హాస్టల్‌లో17 ఏళ్ల బీ.ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా దారుణంగా అత్యాచారం, హత్యకు గురైంది. ప్రారంభంలో స్థానిక పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేసి, 2008లో పిడతల సత్యం బాబు అనే వ్యక్తిని అరెస్టు చేశారు. 2010లో విజయవాడ మహిళా కోర్టు అతన్ని అత్యాచారం, హత్య ఆరోపణలతో 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అయితే ఆ తీర్పును సవాల్​ చేస్తూ సత్యంబాబు 2010 అక్టోబర్‌లో హైకోర్టులో అప్పీల్‌ దాఖలు చేశారు. దానిపై విచారణ జరిపిన హైకోర్టు… 2017లో సత్యంబాబును నిర్దోషిగా ప్రకటించి, పోలీసు దర్యాప్తులో లోపాలను ఎండగట్టింది. దీంతో ఆయేషా తల్లిదండ్రులు న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించారు. 2018లో హైకోర్టు ఈ కేసును రీ ఓపెన్ చేసి సీబీఐకి అప్పగించింది. అలాగే, 2014లో కేసు రికార్డులు నాశనం చేయబడ్డాయని తెలిసి, దానిపై మరో కేసు నమోదు చేయాలని ఆదేశించింది.

2019లో ఆయేషా మృతదేహాన్ని తవ్వి రీ-పోస్ట్‌మార్టం

సీబీఐ 2019లో ఆయేషా మృతదేహాన్ని తవ్వి రీ-పోస్ట్‌మార్టం చేసింది. ఫోరెన్సిక్ నిపుణులు తలపై గాయాలను నిర్ధారించి, 2020లో ఒక నివేదికను సీల్డ్ కవర్‌లో హైకోర్టుకు ఇచ్చారు. 2023లో సీబీఐ ఆయేషా కుటుంబ స్నేహితుడు పుసపటి కృష్ణ ప్రసాద్, నాటి నందిగామ డీఎస్పీ ఎం. శ్రీనివాసులతో సహా పలువురిని విచారించింది. ఈ ఏడేళ్లలో మొత్తం 266 మందిని విచారించింది. ఈ కేసులో రాజకీయ ఒత్తిళ్లు, ఆధారాలు నాశనం కావడం, దర్యాప్తులో జాప్యం లాంటి సమస్యల వంటి పరిణామాల అనంతరం సీబీఐ తన తుది నివేదికను సీల్డ్ కవర్‌లో హైకోర్టుకు సమర్పించగా.. కోర్టు ఈ కేసు విచారణను జూన్ 26కు వాయిదా వేసింది. ఈ కేసు గత 18 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో ఎంతో చర్చనీయాంశంగా మారింది. ఆయేషా తల్లి షమ్షాద్ బేగం, తండ్రి ఇక్బాల్ బాషా ఈ కేసులో న్యాయం కోసం 18 ఏళ్లుగా నిరంతరం పోరాడుతున్నారు. తమ బిడ్డను ఎవరు చంపారో తేల్చి శిక్ష పడేలా చేసేందుకు 18 ఏళ్లుగా ఎదురు చూస్తున్నామని అయేషామీరా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. సేకరించిన ఆధారాల ప్రకారం అయేషామీరా ఎలా చనిపోయిందనేది నిర్ధరించే అవకాశాలున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..