GVL: ఆ రెండు పార్టీల మధ్య స్టిక్కర్ల కాంపిటీషన్.. జీవీఎల్ ఘాటు వ్యాఖ్యలు..
వైసీపీ-బీజేపీ ఒక్కటేనన్న టీడీపీ విమర్శలపై ఘాటుగా స్పందించారు బీజేపీ ఎంపీ జీవీఎల్. ఏపీలో తమది ప్రతిపక్ష పాత్రేనని స్పష్టం చేశారు. వైసీపీని గద్దె దించి అధికారంలోకి రావాలన్నదే బీజేపీ - జనసేన కూటమి లక్ష్యమని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ)ది ప్రతిపక్ష పాత్ర అని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. వైసీపీతో తమకు ఎలాంటి సంబంధాల్లేవని అన్నారు. బీజేపీ-జనసేన కూటమి అధికారంలోకి రావాలన్నదే మా టార్గెట్ అని తెలిపారు. టీడీపీ నేతలు అక్కసుతో మాట్లాడుతున్నారు? ఇలాంటి తప్పుడు కూతలు కూస్తే సహించేది లేదని జీవీఎల్ హెచ్చరించారు. రాష్ట్రంలో స్టిక్కర్ల కాంపిటీషన్ నడుస్తోందని ఎద్దేవ చేశారు. జగనన్నే మా భరోసా అంటూ స్టిక్కర్లు అతికిస్తున్నారు.. అంటించి వెళ్ళగానే ప్రజలు ఆ స్టిక్కర్లు పీకేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ కూడా స్టిక్కర్లతో పోటీ పడుతోందని.. ఈ స్టిక్కర్ల వ్యవహారం రోత పుట్టిస్తుందని విమర్శించారు. విశాఖ నుంచి పరిపాలన సాగిస్తాం అంటూ చెప్పిందే చెబుతున్నారని.. విశాఖ అభివృద్ధికి ఏం తపనపడ్డారు? రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏముందో చెప్పాలని ప్రశ్నించారు.
అభివృద్ధి అంటే అక్రమాలు చేసి భూములు లాక్కుంటామని చెప్పడమా అని విమర్శించారు. జనసేన గత మూడేళ్లుగా మాతో కూటమిలో ఉందన్నారు. టీడీపీ నేతలు ఎందుకు అక్కసు మాటలు మాట్లాడుతున్నారు? వైఎస్సార్సీపీ ని గద్దె దించి అధికారంలోకి రావాలన్నదే బీజేపీ – జనసేన కూటమి లక్ష్యం అని తెలిపారు. బీజేపీతో పొత్తు కోసం తహతహలాడుతూ, మరోవైపు మాకు వైఎస్సార్సీపీ తో సంబంధం అంటూ తప్పుడు కూతలు కూస్తే సహించేది లేదన్నారు ఎంపీ జీవీఎల్.
బీఆర్ఎస్ అంటే భ్రమ రాజకీయాల సమితి అని విమర్శించారు. స్టీల్ కొనడానికి EOI పిలిస్తే, స్టీల్ ప్లాంట్ కొనడానికి అనుకుని బిడ్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఏం సమాధానం చెబుతారో చెప్పాలన్నారు. మాతో పొత్తులో ఉన్న పార్టీ గురించి అవాస్తవాలు చెబుతున్న టీడీపీ ముందు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి భయం వారిని వెంటాడుతోందని.. మా కూటమిలో చిచ్చుపెట్టే ప్రయత్నం వారు చేస్తున్నారని.. మేమంటే ఎలా ఉంటుందో రాబోయే రోజుల్లో చూస్తారని అన్నారు.
వైయస్సార్సీపీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలన్నదే మా కూటమి లక్ష్యం అని స్పష్టం చేశారు. ఇందులో వేరే పార్టీకి కడుపునొప్పి, బీజేపీపై పడి ఏడవడం సరికాదు.. అందులోనూ మీ నేత పుట్టినరోజున ఇలా వ్యవహరించడం తగదన్నారు. మా పార్టీ నుంచి నేతలను లాక్కుని, మాపై ఇప్పుడు నిందలు మోపడం వెనుక ఉద్దేశ్యం ఏంటో చెప్పాలని టీడీపీని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం
