CM Jagan: ఢిల్లీలో సీఎం జగన్ జరిపిన చర్చలు ఇవే !
ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ ఆయ్యారు ఏపీ సీఎం జగన్. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలు, ప్రత్యేక హోదా విభజన హామీల అమలు అంశాలు చర్చించారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లొచ్చిన మరసటి రోజే ప్రధానిని జగన్ కలవడం రాజకీయంగా ఆసక్తి రేపింది.
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్ బిజీబిజీగా గడిపారు. ముందుగా పార్టీ ఎంపీలతో కలిసి పార్లమెంట్‌కు వెళ్లారు. ప్రధాని కార్యాలయంలో మోదీతో సమావేశం అయ్యారు. అప్పటికే ప్రధాని చాంబర్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు పెండింగ్ బకాయిలపై అటు మోదీ ఇటు అమిత్ షాతో చర్చించారు. ఏపీకి ప్రత్యేక హోదా విభజన హామీల అమలకు సంబంధించిన విషయాలను వారి దృష్టికి తీసుకెళ్లారు. గంటపాటు ఈ భేటీ కొనసాగింది. ఆ తర్వాత మోదీతో జగన్ ప్రత్యేకంగా భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యం ఏర్పడింది.
ప్రధానంగా మోదీ దృష్టికి 8 అంశాలను తీసుకెళ్లారు సీఎం జగన్. పోలవరం మొదటి విడత పనులు పూర్తి చేయడానికి దాదాపు 17,144 కోట్లు ఖర్చు అవుతాయని.. సంబంధిత ప్రతిపాదన జలశక్తిశాఖ దగ్గర పెండింగ్‌లో ఉందన్నారు. వెంటనే పరిశీలించి ఆమోదం తెలపాలని కోరారు. 2014 జూన్ నుంచి మూడేళ్లపాటు తెలంగాణ రాష్ట్రానికి ఏపీ జెన్‌కో విద్యుత్ సరఫరా చేసిందని.. ఇందుకు సంబంధించి 7,230 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయన్న విషయాన్ని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేక హోదా సహా ఇతర హామీలను కూడా అమలు చేయాలని కోరారు జగన్. రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించామని.. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటుకి సహయ సహాకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. విశాఖ నగరాన్ని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుతో అనుసంధానించేలా ప్రతిపాదించిన భోగాపురం, భీమిలి, రుషికొండ, విశాఖ పోర్టులను కలిపే 55 కిలోమీటర్ల 6 లేన్ల రహదారికి సాయం అందించాలని మోదీని కోరారు జగన్. విభజన చట్టంలో పేర్కొన్న విశాఖ – కర్నూలు హైస్పీడ్ కారిడార్‌ను వయా కడప మీదుగా బెంగుళూరు వరకూ పొడిగించాలని.. పరిశీలనలు పూర్తిచేసిన ప్రాజెక్టు సాకారం అయ్యేలా చూడాలని కోరారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేయాలని కోరిన జగన్.. విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుకు వీలైనంత త్వరగా ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు.
ప్రధాని మోదీతో భేటీ అనంతరం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యారు జగన్. ఏపీకి రావల్సిన నిధులపై చర్చించారు. రెండ్రోజుల క్రితం చంద్రబాబు ఢిల్లీలో అమిత్ షాతో భేటీ అయ్యారు. నిన్న ఢిల్లీ నుంచి చంద్రబాబు తిరిగి వచ్చిన తరువాత జగన్ ప్రధానితో భేటీ కావడంతో రాజకీయాల పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..