Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ గురించి గుడ్ న్యూస్ చెప్పిన రామ్మోహన్ నాయుడు
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారిపోతాయన్నారు కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు. గడువు కంటే ముందుగానే విమానాశ్రయం నిర్మాణం పనులను పూర్తి చేస్తామన్నారు.
భోగాపురం విమానాశ్రయం పనులు అనుకున్న దానికంటే వేగంగా జరుగుతున్నాయని అన్నారు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు. ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చే శక్తి ఈ ప్రాజెక్ట్‌కు ఉందన్నారు. విమానాశ్రయ పనులను పరిశీలించిన రామ్మోహన్‌నాయుడు.. పనుల్లో పురోగతిని ప్రతి నెల ప్రజలకు తెలియజేస్తున్నామని తెలిపారు. గత నెల నుంచి ఇప్పటి వరకు 4 శాతం పురోగతి ఉందని చెప్పారు. విమానాశ్రయ పనుల్లో ఇప్పటి వరకు 36 శాతం పూర్తయ్యాయని తెలిపారు. నిర్మాణాన్ని గడువు కంటే ముందే పూర్తి చేస్తామని చెప్పారు. నిర్మాణ సంస్థలు వేగంగా పూర్తి చేస్తున్నాయన్నారు. ఏపీలోని శ్రీకాకుళం, దగదర్తిలో, కుప్పం, నాగార్జునసాగర్‌లోనూ విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
ఏపీతోపాటు తెలంగాణలోనూ కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణం కోసం ఎప్పటి నుంచో ప్రతిపాదనలు ఉన్నాయని రామ్మోహన్ నాయుడు తెలిపారు. వరంగల్, ఆదిలాబాద్, కొత్తగూడెం, రామగుండంలో కొత్త ఎయిర్‌పోర్టులు నిర్మించాలని కోరుతున్నారన్న కేంద్రమంత్రి.. వాటి సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నామని వెల్లడించారు. తెలుగురాష్ట్రాలకు ఎక్కువ ప్రయోజనం జరిగేలా చూస్తామన్నారు.
ఇక దేశంలో మరిన్ని ఎయిర్‌పోర్టుల అవసరం ఉందన్నారు రామ్మోహన్‌నాయుడు. రాబోయే రోజుల్లో ఎయిర్‌పోర్టుల కోసం భూమి సేకరించడం కష్టమవుతుందని.. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొత్త విమానాశ్రయాల నిర్మాణం చేపట్టడం ఎంతో కీలకమని అన్నారు. ఉడాన్ స్కీమ్ వల్ల మన దేశ విమానయాన శాఖ ప్రపంచంలోనే ఉన్నతంగా తయారైందని రామ్మోహన్ నాయుడు చెప్పుకొచ్చారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..