Polavaram Project: పోల’వరం’.. మాకు శాపం… ఒడిశాలో బీజేడీ కొత్త రాగం

పోలవరం ప్రాజెక్టు పనులు చాలా కాలంగా కొనసాగుతున్నాయి. దీనికి 2005లో పర్యావరణ అనుమతులు లభించగా, కేంద్రం 2014 మేలో జాతీయ ప్రాజెక్టుగా గుర్తించింది. ప్రాజెక్ట్ ప్రారంభం నుండి బీజేడీ అభ్యంతరాలను లేవనెత్తుతూ వచ్చింది. అనేక వేదికలపై తమ నిరసన, వ్యతిరేకత వ్యక్తం చేసింది. 2007లో ఒడిశా ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది.

Polavaram Project: పోల'వరం'.. మాకు శాపం... ఒడిశాలో బీజేడీ కొత్త రాగం
Polavaram Project
Follow us
Mahatma Kodiyar, Delhi, TV9 Telugu

| Edited By: Ram Naramaneni

Updated on: Aug 11, 2024 | 5:56 PM

ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడిగా పేరొందిన పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టుపై ఒడిశాలోని బిజూ జనతా దళ్ (BJD) కొత్త రాగం అందుకుంది. ఏపీలో నిర్మించే ఈ ప్రాజెక్టు ముంపు ప్రాంతం తెలంగాణ, చత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. దీనిపై సర్వోన్నత న్యాయస్థానంలో వ్యాజ్యాలు కొన్ని పెండింగులో ఉన్నాయి. ముంపు ప్రాంతాలకు 2014 నాటి భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం, పునరావాసం అందించాలని ఒక రాష్ట్రం డిమాండ్ చేయగా.. మరో రాష్ట్రం పూర్తిగా ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకించింది. ఇంకో రాష్ట్రం ప్రాజెక్టు నిర్మాణంపై తమకు అభ్యంతరం లేదని, అయితే ప్రాజెక్టు ఎత్తును పరిమితం చేసి ముంపు పరిధిని తగ్గించాలని డిమాండ్ చేస్తోంది. మొత్తంగా ఆయా రాష్ట్రాల డిమాండ్ల సంగతెలా ఉన్నా ఇప్పుడు ఒడిశాలో భారతీయ జనతా పార్టీ (BJP)ని ఇరకాటంలో పెట్టేందుకు బిజూ జనతా దళ్ (BJD) పోలవరం అంశాన్ని ఆయుధంగా మలచుకుంటోంది.

రెండున్నర దశాబ్దాలుగా ఒడిశా రాష్ట్రాన్ని పరిపాలించిన నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజూ జనతా దళ్ (BJD), కొద్ది నెలల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అటు అసెంబ్లీ, ఇటు లోక్‌సభలో ఓటమి పాలైంది. అప్పటి వరకు కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వారితో సన్నిహితంగా ఉంటూ నెట్టుకొచ్చిన బీజేడీ నాయకత్వం, రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత బీజేపీని ఇరకాటంలో పెట్టే ప్రయత్నాలు మొదలుపెట్టింది. తద్వారా రాష్ట్రంలో తాము కోల్పోయిన పట్టు తిరిగి సాధించాలని చూస్తోంది. లేదంటే ఒడిశాలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ మళ్లీ పుంజుకునే అవకాశాలు లేకపోలేదు. అందుకే.. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీని లక్ష్యంగా చేసుకుంది. నిన్న మొన్నటి ఎన్నికల్లో ఓటమిపాలయ్యే వరకు బీజేడీని అనధికార ఎన్డీఏ (NDA) మిత్రపక్షంగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణించేవారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక బిల్లులు, విప్లవాత్మక నిర్ణయాలకు నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీ బేషరతుగా మద్దతు తెలుపుతూ వచ్చింది. కానీ చివరకు ఆ బీజేపీ చేతిలోనే ఓటమిపాలై అధికార పీఠాన్ని కోల్పోవాల్సి వచ్చింది. దీంతో ఇప్పటికైనా మేల్కొనకపోతే రాష్ట్రంలో పార్టీ పూర్తిగా తుడుచిపెట్టుకుపోవడం ఖాయమని అధినేత నవీన్ పట్నాయక్ గ్రహించినట్టున్నారు. ఏ కాస్త అవకాశం ఇచ్చినా.. కాంగ్రెస్ మళ్లీ ఊపిరి పోసుకుంటుందని అంచనా వేశారు. అందుకే బీజేపీని టార్గెట్ చేస్తూ రాష్ట్రంలో రాజకీయ ప్రత్యర్థి స్థానాన్ని పదిలం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. కేంద్ర బడ్జెట్‌లో ప్రత్యేకంగా ప్రస్తావించిన పోలవరం ప్రాజెక్టునే ఇందుకు ఆయుధంగా ఎంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు జరిపిన కేటాయింపులపై దేశవ్యాప్తంగా విపక్షాలు విమర్శలు సంధిస్తున్న తరుణంలో.. పోలవరం ప్రాజెక్టు ద్వారా ఒడిశా ప్రజలకు జరుగుతున్న నష్టంపై ఉద్యమించాలని పట్నాయక్ నిర్ణయించారు. ఆ మేరకు తన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

పోలవరం – ఆదివాసీలకు శాపం

పోల’వరం’ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ‘వర’ప్రదాయిని కావొచ్చేమో కానీ ఒడిశా ప్రజలకు మాత్రం అదొక శాపమని బీజేడీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కారణంగా మల్కన్‌గిరి జిల్లాలో ఎక్కువ భాగం ముంపునకు గురికానుంది. అందుకే ఒడిశా రాష్ట్రం ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో దావా వేసింది. ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ భాగస్వామిగా ఉంది. ఈ క్రమంలో ముంపు అంశంపై బీజేపీ అనుసరించే వైఖరి ఏదో ఒక రాష్ట్రంలో నష్టం కల్గించే ప్రమాదం ఉంది. ఇప్పటికే బీజేపీని “ఒడిశా వ్యతిరేక”, “ఆదివాసి వ్యతిరేక” పార్టీగా చిత్రీకరిస్తూ బీజేడీ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన తర్వాత తన మొదటి రాజకీయ కార్యక్రమంలో భాగంగా బీజేడీ మల్కన్‌గిరిలోని పోలవరం ప్రాజెక్టు కారణంగా మునిగిపోయే ప్రాంతాలకు ప్రతినిధి బృందాన్ని పంపింది. పోలవరం ప్రాజెక్టు ఆమోదిత డిజైన్ ప్రకారం నిర్మాణం పూర్తయితే.. మోటు తహసీల్‌లోని కనీసం 25 గ్రామాలు పూర్తిగా మునిగిపోతాయి. మల్కన్‌గిరి జిల్లాలో మొత్తం 7,656 హెక్టార్ల వ్యవసాయ భూమి, అటవీ భూములు ముంపునకు గురవుతుంది.

మల్కన్‌గిరిని సందర్శించిన బృందంలో భాగమైన బిజెడి సీనియర్ నాయకుడు సబ్యసాచి నాయక్ మాట్లాడుతూ ఒడిశాలో పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రభావంపై సరైన అధ్యయనం జరగలేదని అన్నారు. “మేము ప్రభావితమయ్యే అనేక గ్రామాలను సందర్శించాము. ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలనే కేంద్రం నిర్ణయంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు” అని నాయక్ వ్యాఖ్యానించారు. బీజేడీ రాజ్యసభ సభ్యురాలు సులతా దేవ్ ఈ అంశాన్ని సభలో లేవనెత్తారు. “ప్రాజెక్ట్ అమలు కారణంగా గిరిజన గ్రామాలతో సహా మొత్తం 162 గ్రామాలు మునిగిపోతాయి. గిరిజన సంక్షేమం గురించి ఇంతగా అరిచిన బీజేపీ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంది? ఒడిశాలో జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా బీజేడీ పోరాటం కొనసాగిస్తుంది” అని దేవ్ అన్నారు.

పోలవరం ప్రాజెక్టు పనులు చాలా కాలంగా కొనసాగుతున్నాయి. దీనికి 2005లో పర్యావరణ అనుమతులు లభించగా, కేంద్రం 2014 మేలో జాతీయ ప్రాజెక్టుగా గుర్తించింది. ప్రాజెక్ట్ ప్రారంభం నుండి బీజేడీ అభ్యంతరాలను లేవనెత్తుతూ వచ్చింది. అనేక వేదికలపై తమ నిరసన, వ్యతిరేకత వ్యక్తం చేసింది. 2007లో ఒడిశా ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది. అయితే 2014లో కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒడిశా అభ్యంతరాలు కేవలం లేఖల రాతకే పరిమితమయ్యాయి. ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయాలని కోరుతూ.. బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రి హోదాలో ప్రధానమంత్రికి పలుమార్లు లేఖలు రాశారు. 2018 జూన్‌లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గోదావరి జల వివాద ట్రిబ్యునల్‌ను ఉల్లంఘించిందని, మల్కన్‌గిరిలో బ్యాక్ వాటర్ విస్తీర్ణాన్ని డిజైన్ సరిగ్గా అంచనా వేయలేదని పట్నాయక్ మోదీకి లేఖ రాశారు.

అధికార బీజేపీ పోలవరం ప్రాజెక్టు కారణంగా రెండు రాష్ట్రాల్లో నెలకొన్న సంక్లిష్ట పరిస్థితిని అంచనా వేసుకుంది. నీతి ఆయోగ్ సమావేశానికి ఇటీవల ఢిల్లీకి వచ్చిన ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ, ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత తాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశానని, రాష్ట్ర సమస్యలపై చర్చించడానికి, సామరస్య పరిష్కారం కనుగొనడానికి అధికారుల స్థాయితో పాటు సీఎం స్థాయి సమావేశాలను ప్రతిపాదించానని చెప్పారు. మరోవైపు బీజేడీ చేస్తున్న ప్రచారాన్ని ఒడిశా బీజేపీ నేతలు తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. రెండున్నర దశాబ్దాలుగా అధికారంలో ఉన్న బీజేడీ ఈ అంశంపై గాఢ నిద్రలో ఉందని ఎద్దేవా చేశారు. ఒడిశా ప్రయోజనాలు కాపాడ్డానికి ఇన్నేళ్లుగా ఏమీ చేయలేదని మండిపడ్డారు. తీరా ఇప్పుడు ఓడిపోయాక అన్నీ గుర్తుకొచ్చాయని విమర్శించారు. విమర్శలు, ప్రతివిమర్శల సంగతెలా ఉన్నా.. ఈ అంశంపై అందరికీ ఆమోదయోగ్య సామరస్య పరిష్కారం కనుక్కోవాల్సిన అనివార్యత బీజేపీకి ఏర్పడింది. లేదంటే అటు ఒడిశాలో.. ఇటు ఆంధ్రప్రదేశ్‌లో ఆ పార్టీకి పోల’వరం’ ఒక శాపంగా మారే ప్రమాదం పొంచి ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.