అప్పుడు ఇందిరా.. ఇప్పుడు మోదీ.. 43 ఏళ్ల తర్వాత విజయనగరంలో ప్రధాని పర్యటన..
దాదాపు 43 ఏళ్ల తర్వాత ప్రధానమంత్రి హోదాలో విజయనగరం జిల్లాకు నరేంద్ర మోదీ రానుండటం చారిత్రక ఘట్టంగా మారింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవంలో పాల్గొనే మోదీ పర్యటనతో ఉత్తరాంధ్ర అభివృద్ధిపై దేశవ్యాప్తంగా దృష్టి కేంద్రీకృతమవుతుందని భావిస్తున్నారు. ఇందిరా గాంధీ తర్వాత ప్రధానమంత్రి హోదాలో జిల్లాకు వస్తున్న నాయకుడిగా మోదీ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది.

విజయనగరం జిల్లా చరిత్రలో మరో అరుదైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జిల్లా పర్యటనకు రానుండటంతో అన్ని వర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒక ప్రధానమంత్రి అధికారిక హోదాలో విజయనగరం జిల్లాకు రావడం అనేది చాలా అరుదైన సంఘటన.. దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా విరామం తర్వాత మరోసారి ప్రధానమంత్రి జిల్లా గడ్డపై అడుగుపెట్టబోతుండటం చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకుంది. 1983లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ జిల్లా పర్యటన ప్రజల్లో విశేష స్పందన తెచ్చింది. ఆమె పర్యటన అనంతరం మళ్లీ ప్రధానమంత్రి స్థాయిలో ఏ ఒక్కరు కూడా జిల్లా సందర్శన చేయకపోవడంతో, ఈ ప్రాంత ప్రజలు అప్పటి నుంచి అలాంటి సందర్భాన్ని చూడలేదు. ఇప్పుడు నరేంద్ర మోదీ రాకతో ఆ నిరీక్షణకు తెరపడుతోంది. ఈ పర్యటనను కేవలం రాజకీయ కార్యక్రమంగా కాకుండా, ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్రయాణంలో కీలక మైలురాయిగా అధికారులు, ప్రజాప్రతినిధులు అభివర్ణిస్తున్నారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం వంటి ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొనడం వల్ల దేశవ్యాప్తంగా ఉత్తరాంధ్రపై దృష్టి మరింత కేంద్రీకృతమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భోగాపురం విమానాశ్రయం ప్రారంభం తర్వాత విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు కొత్త అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. పర్యాటకం, పారిశ్రామిక రంగం, ఐటీ, లాజిస్టిక్స్, ఎగుమతులు, ఉపాధి అవకాశాలు మరింత విస్తరించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి స్వయంగా వచ్చి ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేయడం ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది.
ప్రధాని పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేపట్టింది. భద్రతా ఏర్పాట్ల నుంచి ట్రాఫిక్ నియంత్రణ వరకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. లక్షలాది మంది హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తూ, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. రాజకీయంగా కూడా ఈ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. కేంద్ర ప్రభుత్వం ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యతను ఈ పర్యటన ప్రతిబింబిస్తోందని ఎన్డీఏ వర్గాలు చెబుతుండగా, ప్రతిపక్షాలు కూడా ఈ పర్యటన పై ఆసక్తిగా దృష్టి సారించాయి.
ప్రజల్లో మాత్రం అభివృద్ధి ప్రాజెక్టులు వేగంగా పూర్తి కావాలని, కొత్త పెట్టుబడులు రావాలని ఆశభావం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 43 ఏళ్ల తర్వాత విజయనగరం జిల్లా మరోసారి ప్రధానమంత్రి పర్యటనకు వేదిక కావడం చరిత్రలో నిలిచిపోయే ఘట్టంగా నిలవనుంది. ఇందిరా గాంధీ తర్వాత నరేంద్ర మోదీ జిల్లా గడ్డపై అడుగుపెడుతున్న ఈ సందర్భం, ఉత్తరాంధ్ర అభివృద్ధి చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అయితే నరేంద్ర మోదీ విజయనగరం జిల్లాలో 2014 ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పటికీ అప్పటికి ప్రధాని కాకపోవడంతో ప్రధాని హోదాలో ఇప్పుడు మరోసారి రావడం గమనార్హం..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
