AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోజా పూల సాగుతో రాజాలా మారిన రైతు జీవితం.. జీతంలా ప్రతినెల ఆదాయం

గుంటూరు జిల్లాకు చెందిన రైతు అల్లా శివాంజనేయులు పూల సాగుతో రోజువారీ ఆదాయం పొందుతున్నారు. లిల్లీతో మొదలై గులాబీ సాగుతో విస్తరించిన ఆయన వ్యవసాయం ఉద్యోగి జీతంలా స్థిరమైన సంపాదనకు మార్గంగా మారింది. పూలు కేవలం అందానికే కాదని, రైతు జీవితంలో నిత్య ఆదాయ వనరులని నిరూపిస్తున్నారు.

రోజా పూల సాగుతో రాజాలా మారిన రైతు జీవితం.. జీతంలా ప్రతినెల ఆదాయం
Flower Farming
Ram Naramaneni
|

Updated on: Aug 31, 2026 | 12:12 PM

Share

సాధారణ వ్యవసాయంలో పెట్టుబడి పెట్టి, పంట చేతికి వచ్చే వరకు నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తుంది. కానీ, పూల సాగులో మాత్రం ప్రతిరోజూ ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉంటుందని గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామానికి చెందిన రైతు అల్లా శివాంజనేయులు తమ విజయగాథ ద్వారా నిరూపిస్తున్నారు. ఆయన పూల సాగును ప్రభుత్వ ఉద్యోగి జీతంలా నిత్య ఆదాయ వనరుగా మలచుకొని, ప్రతి నెలా స్థిరమైన సంపాదన పొందుతున్నారు. శివాంజనేయులు రెండేళ్ల క్రితం 70 సెంట్లలో లిల్లీ పూల సాగుతో తన పూల ప్రయాణాన్ని ప్రారంభించారు. లిల్లీ సాగులో ప్రతిరోజూ పూలను కోసి స్థానిక మార్కెట్‌లో విక్రయించే అవకాశం ఉండటంతో, నిత్య ఆదాయానికి అది సరైన మార్గంగా ఆయన గుర్తించారు. రెండేళ్లుగా లిల్లీ పూల నుంచి దిగుబడిని పొందుతూ, రోజువారీగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. అయితే, ఆయన ఆలోచన అక్కడితో ఆగలేదు. ఈ ఏడాది ఏప్రిల్‌లో మరో 70 సెంట్లలో సెంట్ గులాబీ రకాన్ని సాగులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం గులాబీ పూల దిగుబడి ప్రారంభమైంది. మొక్కలు మరింత ఎదిగి రానున్న రోజుల్లో దిగుబడి బాగా పెరుగుతుందని ఆయన ఆశిస్తున్నారు.

సెంట్ గులాబీ సాగు కోసం శివాంజనేయులు బెంగళూరు నుంచి బాపట్ల మీదుగా నాటు మొక్కలను తెప్పించారు. 70 సెంట్లలో సుమారు 1400 మొక్కలు నాటారు. మొక్కకు మొక్కకు అడుగున్నర, బోదెకు బోదెకు మూడు గజాల దూరం పాటించారు. ఒక్కో మొక్కకు రవాణా ఖర్చులతో కలిపి దాదాపు రూ.37-38 ఖర్చయింది. ఈ 70 సెంట్ల సెంట్ గులాబీ సాగుకు మొత్తం రూ.65,000 వరకు పెట్టుబడి అయ్యింది. లిల్లీ విత్తనం మాత్రం స్థానికంగానే లభిస్తుంది. బస్తా రూ.1200 నుంచి రూ.1500 వరకు ఉండగా, ఎకరానికి 10-12 బస్తాలు పడుతుంది. కూలీలు, ఇతర ఖర్చులతో కలిపి లిల్లీ సాగుకు రూ.15,000-20,000 అవుతుందని ఆయన వివరించారు. ప్రస్తుతానికి గులాబీ తోట నుంచి రోజుకు 700-800 పూలు లభిస్తున్నాయి. ఇది కేజీల లెక్కన ఏడెనిమిది కేజీలకు సమానం. రానున్న రోజుల్లో ఇది 15-20 కేజీలకు పెరుగుతుందని అంచనా. సెంట్ గులాబీకి మార్కెట్‌లో మంచి ధర లభిస్తుంది. సాధారణంగా కేజీ రూ.120 నుంచి రూ.200-250 వరకు పలుకుతుంది. పండుగల సీజన్లలో ఈ ధర మరింత పెరుగుతుంది. ఉండవల్లి, తాడేపల్లి, ఉంచినపల్లి, పెనమాక, వడ్లపూడి వంటి చుట్టుపక్కల ప్రాంతాల్లోని రాజీవ్ గాంధీ మార్కెట్ వంటి పూల మార్కెట్లలో రోజువారీగా పూలను విక్రయిస్తారు. ఈ ప్రాంతాల నేల సెంట్ గులాబీ సాగుకు చాలా అనుకూలమని, అందువల్ల ఈ ప్రాంతంలో చాలా మంది రైతులు ఈ రకాన్ని సాగు చేస్తారని ఆయన తెలిపారు. లిల్లీ సాగు మూడు సంవత్సరాల పై పంట. శివాంజనేయులు వేసిన తోట రెండు సంవత్సరాల ఒక నెల అయినప్పటికీ, దిగుబడి బాగానే ఉందని, ఇది చాలా అనుకూలమైన పంట అని పేర్కొన్నారు. ఒక రైతుకు ఒకటిన్నర నుంచి రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉండి, ఒక ఎకరం లిల్లీ, మరో ఎకరం సెంట్ గులాబీ సాగు చేస్తే, అన్ని ఖర్చులు (కూలీలు, మందులు మొదలైనవి) పోనూ నెలకు రూ.30,000 నుంచి రూ.70,000 వరకు నికర ఆదాయం పొందవచ్చని అల్లా శివాంజనేయులు ఆచరణలో చూపిస్తున్నారు.

రైతు ఆదాయం పెరగాలంటే పంటలో మార్పు మాత్రమే కాకుండా, ఆలోచనలోనూ మార్పు రావాలని ఆయన సందేశం. పూల సాగును కేవలం వ్యవసాయంగా కాకుండా, నిత్య ఆదాయ వనరుగా మలచుకోవడం ద్వారా రైతు భవిష్యత్తుకు కొత్త ఆశలు చిగురిస్తాయని, పువ్వు పూస్తే పరిమళమే కాకుండా రైతు జీవితంలో ఆదాయం కూడా పూస్తుందని శివాంజనేయులు తమ విజయంతో రుజువు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us