ఇదేం దోపిడీ రా నాయనా…ఫోన్ పే చేస్తారు…సక్సెస్ వస్తుంది.. కానీ డబ్బులు జమ కావు..! అదే ట్విస్ట్..
ఫోన్ పే ద్వారా ఘారానా మోసం... దుకాణాల్లో వస్తువులు కొని ఫోన్ పే చేస్తారు... సక్సెస్ మెసేజ్ చూపిస్తారు... అయితే డబ్బులు జమకావు... తీరా ఎకౌంట్ చెక్ చేసుకుంటే కానీ జరిగిన మోసం తెలియదు... ప్రకాశంజిల్లాలో ఫోన్ పే మోసాలతో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అంటేనే భయపడిపోతున్నారు వ్యాపారులు... డిజిటల్ పేమెంట్ల లావాదేవీల్లో రోజుకో కొత్త మోసం వెలుగులోకి వస్తుండటంతో ప్రజలు ఆన్‌లైన్ మనీ ట్రాన్సఫరింగ్ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

డిజిటల్ నగదు లావాదేవీల్లో ఇటీవల కాలంలో ఏదో ఒక చోట ప్రజలు మోసపోతూనే ఉన్నారు. సైబర్ ఉచ్చులో పడవద్దని ప్రభుత్వం, పోలీస్ శాఖ అప్రమత్తం చేస్తున్నా, ప్రజలు మోసగాళ్ల మాయలో పడుతూనే ఉన్నారు. తాజాగా మార్కాపురంజిల్లా ఎర్రగొండపాలెం పట్టణం నడిబొడ్డున అంబేడ్కర్ సెంటర్, త్రిపురాంతకం రోడ్డు లోని ఇద్దరు వ్యాపారులను డిజిటల్ పేమెంట్ పేరుతో నేరగాళ్ళు అడ్డంగా దోచుకున్నారు..
మర్కాపురంజిల్లా యర్రగొండపాలెంలో ఇద్దరు వ్యాపారులను ఫోన్ పేలో నగదు బదిలీ పేరుతో ఘారానా మోసగాళ్ళు లక్ష రూపాయలకు టోకరా వేశారు… పట్టణంలోని లోని ఓ మినీ సూపర్ మార్కెట్ దగ్గరకు కారులో వచ్చిని ఇద్దరు వ్యక్తులు వంట సామాగ్రి కొనుగోలు పేరుతో మోసానికి పాల్పడ్డారు… కొత్తగా తాము హోటల్ పెట్టామని హోల్‌సేల్‌లో వంట నూనె కావాలని నమ్మబలికారు… 25 వేల రూపాయలకు వంట నూనె కొనుగోలు చేశారు… క్యాష్ లేదని ఫోన్ పే చేస్తామని చెప్పారు… అయితే తమ ఫోన్‌లో స్కానర్ పనిచేయడం లేదని, ఫోన్‌పే నెంబర్ చెప్పాలని కోరారు… షాపు యజమానురాలు ఇచ్చిన హోల్ సేల్ వ్యాపారి ఫోన్ నెంబర్‌కు 25 వేల రూపాయలు ఫోన్ పే చేశారు… ఫోన్ పే సక్సెస్‌ఫుల్ అని రావడంతో ఫోన్‌లోని రిసిప్ట్ చూపించారు… వ్యాపారంలో నిమగ్నమైన దుకాణంలోని వ్యక్తులు డబ్బులు ట్రాన్స్‌ఫర్ అయిందా లేదా… అని హోల్ సేల్ వ్యాపారిని సంప్రదించలేదు… తీరా మరుసటి రోజు హోల్‌సేల్ వ్యాపారి సూపర్‌మార్కెట్ దగ్గరకు వచ్చి వంట నూనె తాలూకా డబ్బులు ఇవ్వమని చెప్పడంతో తాము మోసపోయామని దుకాణదారులు గుర్తించారు… వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు…
అలాగే పెద్దారవీడు మండలం కుంట దగ్గర కూడా ఓ కిరాణా షాపు యజమానిని ఇదే విధంగా మోసం చేసి 21 వేల రూపాయలతో ఉడాయించి మాచర్ల వైపు వెళ్ళినట్టు గుర్తించారు.
మరోవైపు త్రిపురాంతకంలో ఇదే విధంగా ఓ వ్యాపారిని మోసగాళ్ళు మోసం చేశారు… కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఫోన్ ద్వారా నగదు బదిలీ చేస్తాం, క్యాష్ కావాలంటూ నగదు లావాదేవీల వ్యాపారం చేసే వ్యాపారిని అడిగి ఫోన్‌పేలో 70 వేలు నగదు బదిలీ చేశారు… ఫోన్ పేలో నగదు ట్రాన్స్‌ఫర్ సక్సెస్ అయినట్టు రావడంతో తన ఎకౌంట్‌ను వ్యాపారి చెక్ చేసుకున్నాడు… 70 వేలు క్రెడిట్ అయినట్టు చూపించడంతో నగదు ఇచ్చేశాడు… అరగంట తర్వాత ఆ ఇద్దరు ఫోన్ చేసి రాంగ్ ఎకౌంట్‌కు నగదు బదిలీ అయిందని చెప్పారని, అలా చెప్పిన కొద్దిసేపటికే తన ఎకౌంట్ ఫ్రీజ్ అయిపోయిందని, ఇలా ఎందుకు అయిందో అర్ధంకాక చివరకు తాను మోసపోయినట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశానని, మోసపోయిన బాధితుడు తెలిపారు.
కారులో దర్జాగా తిరుగుతూ ఫోన్ పే నగదు లావాదేవీల పేరుతో వ్యాపారులను మోసం చేస్తున్న ముఠా వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు… యర్రగొండపాలెం పరిసర ప్రాంతాల్లో మోసపోయిన పలువురు వ్యాపారులు చెప్పిన ఆనవాళ్ళ మేరకు నిందితులను గుర్తించే పనిలో పడ్డారు… టోల్‌ప్లాజాల దగ్గర నెంబర్ ప్లేట్‌లేని ఓ కారు పలుమార్లు తిరిగినట్టు గుర్తించి, సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు… నగదు లావాదేవీల విషయంలో వ్యాపారులు, ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని యర్రగొండపాలెం ఎస్‌ఐ చౌడయ్య కోరుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




