Badvel By Election Result Highlights: వైసీపీ ఫ్యాను జోరుకు పత్తాలేని ప్రతిపక్షాలు.. బీజేపీ, కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతు

Balaraju Goud

| Edited By: Shaik Madar Saheb

Updated on: Nov 02, 2021 | 4:13 PM

Badvel By Poll Result Counting Live Updates: బద్వేలులో అధికార పార్టీ వైసీపీ మరోసారి తన సత్తా చాటుతోంది. ప్రతి రౌండ్‌లోనూ వైసీపీ ఆధిక్యత కనబరుస్తోంది. భారీ విజయం దిశగావ వైసీసీ అభ్యర్థి డాక్టర్‌ దాసరి సుధ సాగుతున్నారు.

Badvel By Election Result Highlights: వైసీపీ ఫ్యాను జోరుకు పత్తాలేని ప్రతిపక్షాలు.. బీజేపీ, కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతు
Badvel

Badvel By Election Highlights:బద్వేల్‌…బరిలో ఎవరి సత్తా ఎంత ? అధికార పార్టీ ప్రకటించినట్లుగా భారీ మెజార్టీ వస్తుందా ? అంటే అదే నిజమైంది. YCPకి గట్టి పోటీ ఇచ్చి ఉనికిని చాటుకోవాలనుకున్న కమలం వ్యూహం ఫలించలేదు.

బద్వేల్‌లో ఊహించిందే జరిగింది. సంచలనాలను ఆశించిన విపక్షాలకు నిరాశే ఎదురైంది. నియోజకవర్గం మొత్తం ఫ్యాన్ గాలి సుడిగాలిలా వీచింది. వైసీపీ అభ్యర్ధి డాక్టర్‌ సుధ భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. తన సమీప బీజేపీ అభ్యర్థి పనతల సురేష్‌పై 90,590 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు.

ఇదిలావుంటే, వైఎస్సార్‌సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య మరణించడంతో క‌డ‌ప‌ జిల్లా బద్వేలు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక ఆవ‌శ్య‌క‌త ఏర్ప‌డింది. అధికార ప‌క్షం.. ఆన‌వాయితీ సెంటిమెంట్ ప్రకారం వైసీపీ బద్వేలు టికెట్ ను డాక్టర్ వెంకటసుబ్బయ్య అర్ధాంగి డాక్టర్ దాసరి సుధకు ఇచ్చింది. ప్రధాన ప్రతిప‌క్షం తెలుగు దేశం ఈ ఎన్నిక‌లో పాల్గొన‌డం లేద‌ని స్పష్టం చేసింది. తొలుత పాల్గొనాల‌ని భావించినా సెంటిమెంట్‌, ఆన‌వాయితీని పాటించాల‌ని నిర్ణయం తీసుకొంది. అంతే కాకండా గ‌త ఎన్నిక‌ల్లో ఎక్కువ‌గా ప్రభావం చూపుకున్నా.. ప్రతిప‌క్షంలా ప్రశ్నిస్తామంటూ నిరంతం ప్రజ‌ల్లో ఉండే ప్రయ‌త్నం చేస్తున్న జ‌న‌సేన కూడా పోటీ నుంచి త‌ప్పుకొంది. అయితే ఎన్నిక‌ల్లో రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్‌, బీజేపీ పోటీ చేశాయి.

ఏకగ్రీవం అవుతుందనుకున్న బద్వేల్ అసెంబ్లీ ఉపఎన్నిక… BJP పోటీకి దిగడంతో రసవత్తరంగా మారింది. 2019 ఎన్నికల్లో YCP అభ్యర్ధిగా డాక్టర్ వెంకటసుబ్బయ్య 44,734 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆయితే ఆయన అకాల మరణంతో ఉపఎన్నిక రావడంతో …ఏకగ్రీవం చేయాలని పిలుపునిచ్చింది వైసీపీ. ఇందుకు జనసేన, టీడీపీ పోటీకి దూరంగా ఉంటే…గత ఎన్నికల్లో కేవలం 735 ఓట్లు మాత్రమే వచ్చిన బీజేపీ మాత్రం అభ్యర్దిని బరిలోకి దింపింది. బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి డాక్టరు దాసరి సుధ, బీజేపీ అభ్యర్థి పనతల సురేష్, కాంగ్రెస్‌ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే కమలమ్మతో పాటు మరో 12 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

వరుస విజయాలతో జోష్‌ మీదుకున్న వైసీపీ బద్వేల్‌ గెలుపుపై ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉంది. డిపాజిట్‌ కూడా రాని బీజేపీ తమకు పోటీ కాదంటూ.. గతంలో వచ్చిన మెజార్టీ కంటె రెట్టింపు తెచ్చుకుంటామని ప్రకటించింది. టీడీపీ, జనసేన బరిలో లేకపోవడంతో రెండు పార్టీల ఓటు బ్యాంక్‌తో ఈసారి కాస్తో.. కూస్తో మైలేజ్ పొందవచ్చని భావించింది బీజేపీ.

తిరుపతి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని కొట్టినట్లుగానే బద్వేల్ బైపోల్‌లో కూడా గట్టి దెబ్బ కొట్టాలని వైసీపీ భావించింది. అందుకు తగిన విధంగా నియోజకవర్గ స్థాయిలో పార్టీ అధినాయకత్వంతో విస్తృతస్ధాయి సమావేశాలు నిర్వహించి మెజార్టీపైనే ఫోకస్ పెట్టారు పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అభ్యర్ధిని ప్రకటించిన నాటి నుంచి పోలింగ్‌ వరకూ భారీ మెజార్టీ కోసమే పనిచేస్తూ …బీజేపీకి చెక్ పెడుతూ వచ్చారు.

పోలింగ్‌ రోజున నియోజకవర్గంలో పలుచోట్ల జరిగిన చెదురుముదురు ఘటనలు జరగడంతో బీజేపీ వైసీపీ తీరును తప్పు పట్టింది. ఎన్నికలు ప్రజాస్వామ్య బద్దంగా జరగలేదని.. పోలీసుల్ని అడ్డుపెట్టుకొని రిగ్గింగ్‌లు, బయట వ్యక్తులతో అట్లూరు మండలంలో దొంగ ఓట్లు వేసుకున్నారని ఆరోపించారు. తమ ఏజెంట్లను భయబ్రాంతులకు గురి చేశారంటూ 28చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. కాశినాయన మండలం వరికుంట్లలో వైసీపీ నేతలు దొంగ ఓట్లు వేసారంటూ బీజేపీ అభ్యర్థి సురేష్ ఆందోళనకు దిగారు. ఇవే కాదు పోలింగ్ సమయంలో చింతలచెరువు గ్రామంలో వైసీపీకి ఓటు వేయాలంటూ వాలంటీర్లు సైతం ప్రచారం చేశారన్న ఆరోపణలు చేశారు బీజేపీ నేతలు. అలాగే బద్వేలు 21వ వార్డు వైసీపీ కౌన్సిలర్ భూమిరెడ్డి ఓబుల్ రెడ్డి ఓటర్లకు డబ్బులు పంచుతూ కెమెరాకు చిక్కారు.

బీజేపీ విమర్శలను వైసీపీ నేతలు అంతే ధీటుగా తిప్పికొట్టారు. టీడీపీ నేతలే కాషాయ పార్టీకి ఏజెంట్లుగా మారారని కౌంటర్‌ ఇచ్చారు. వైసీపీ-బీజేపీ మధ్యే కీలక పోరుగా మారిన బైపోల్‌ వార్‌లో కాంగ్రెస్‌ కనీసం ఉనికిని కాపాడుకునేందుకు అభ్యర్ధిని బరిలో దింపింది.

కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి..

బద్వేలు నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,15,292 కాగా… వారిలో పురుషులు 1,07,915 మంది, మహిళలు 1,07,355 మంది, థర్డ్‌ జండర్‌ 22 మంది ఉన్నారు. 2019 ఎన్నికల్లో బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గంలో 77.64 శాతం పోలింగ్‌ శాతం నమోదైంది. అప్పుడు 2,04,618 ఓట్లు ఉండగా 1,58,863 ఓట్లు పోలయ్యాయి.

ప్రతి కౌంటింగ్‌ కేంద్రంలో ఒక సూపర్‌వైజర్, అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్‌ ఉంటారు. గరిష్టంగా 12 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. మధ్యాహ్నం 12గంటలకు తుది ఫలితం వెల్లడయ్యే అవకాశముంది. ఇప్పటివరకు సర్వీసు ఓటర్లు, 80 ఏళ్లు పైబడిన, దివ్యాంగుల ఓట్లు మొత్తం 235 పోస్టల్‌ బ్యాలెట్లు వచ్చాయి. ఓట్లు లెక్కించే సమయానికి సర్వీసు ఓటర్ల ఓట్లు అందితే వాటిని కూడా కలిపి లెక్కిస్తారు. లెక్కింపు నేపథ్యంలో జిల్లా ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. అలాగే, లెక్కింపు కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు రాజంపేట సబ్‌కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కేతన్‌ గార్గ్‌ మీడియాకు తెలిపారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 02 Nov 2021 03:08 PM (IST)

    బీజేపీని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వం.. ఎమ్మెల్యే రోజా..

    బద్వేల్‌లో వైసీపీ ఘన విజయంపై ఎమ్మెల్యే రోజా మాట్లాడారు. బద్వేలు ప్రజలందరికి కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలో బీజేపీని అసెంబ్లీ సీటు కాదు క‌దా.. గేటు కూడా తాకనివ్వం అంటూ ఆమె తెలిపారు. ఏ ఎన్నికలైనా.. సెంటర్ ఏదైనా వైసీపీదే విజయం అంటూ స్పష్టంచేశారు. తమ సంక్షేమ పథకాల అమలే ఈ గెలుపునకు నిదర్శనమని తెలిపారు. సింగిల్‌ హ్యాండ్‌తో గెలిపించిన ఘనత సీఎం జగన్‌కే దక్కిందని ఎమ్మెల్యే రోజా తెలిపారు.

  • 02 Nov 2021 02:46 PM (IST)

    బద్వేల్‌లో కథ మొత్తం నడిపింది టీడీపీనే: చీప్‌విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి..

    బద్వేల్‌లో వైసీపీ గెలుపు అనంతరం ప్రభుత్వ చీప్‌ విప్‌ గడికోట శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బద్వేల్ నియోజకవర్గంలో వైసీపీ విజయం ప్రజా విజయమని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. బద్వేల్‌లో కథ మొత్తం నడిపింది టీడీపీనే అని చీప్‌విప్‌ శ్రీకాంత్‌ రెడ్డి తెలిపారు.

  • 02 Nov 2021 02:27 PM (IST)

    సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన వైసీపీ నేతలు..

    సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసిన మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాస రెడ్డి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి కలిశారు. బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన డాక్టర్‌ దాసరి సుధ, పార్టీ నేతలను సీఎం వైఎస్‌ జగన్‌ ఈ సందర్భంగా అభినందించారు. వారితోపాటు చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి, విప్‌ కొరుముట్ల శ్రీనివాసులు కూడా సీఎంని కలిశారు.

  • 02 Nov 2021 02:24 PM (IST)

    మూడు పార్టీలు గెలిచినా.. ఘన విజయం సాధించాం.. వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధా

    సీఎం జగన్ సంక్షేమ పథకాలే తన గెలుపునకు కారణమని వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధా పేర్కొన్నారు. వాతావరణం ప్రతికూలత కారణంగా పోలింగ్ పర్సంటేజ్ పెరగలేదని.. ఇంకా మెజార్టీ వచ్చేదన్నారు. తెరవెనుక మూడు పార్టీలు కలిసి పనిచేసినా.. 2019 లో వచ్చిన మెజారిటీ కంటే డబుల్ మెజారిటీ సాధించామని సుధా స్పష్టంచేశారు. బద్వేలు నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తి చేయడమే తన లక్ష్యమని సుధా తెలిపారు. మొదటి నుంచి బిజేపీ పోటీ అని తాము అనుకోలేదన్నారు. బీజేపీకి గతంలో 700 ఓట్లు వచ్చాయి. క్యాడర్ కూడా లేని బీజేపీకి టీడీపీ నేతలను ఏజెంట్లుగా పెట్టుకుందని పేర్కొన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి ఎన్ని ప్రయత్నాలు చేసినా.. చివరకి ఘన విజయం సాధించామని డాక్టర్ దాసరి సుధ తెలిపారు.

  • 02 Nov 2021 02:19 PM (IST)

    బద్వేలు గెలుపుపై ఎమ్మెల్యే రోజా స్పందన..

    బద్వేలు గెలుపుపై ఎమ్మెల్యే రోజా శుభాకాంక్షలు తెలిపారు.

  • 02 Nov 2021 02:18 PM (IST)

    ప్రజలు సీఎం జగన్ సంక్షేమ పథకాలను నమ్మారు: వైసీపీ అభ్యర్థి సుధ

    బద్వేల్ నియోజకవర్గ ప్రజలకు వైసీపీ అభ్యర్థి సుధ అభినందనలు తెలియజేశారు. వైసీపీకి ఇంతటి మెజారిటీ ఇచ్చిన బద్వేల్ ప్రజలకి కృతజ్నతలు తెలియజేస్తున్నట్లు వెల్లడించారు. తన అభ్యర్థిత్వాన్ని బలపరిచిన పార్టీ నాయకులకు అభినందనలు తెలియజేశారు. బద్వేల్ ప్రజలు సీఎం జగన్ సంక్షేమ పథకాలను నమ్మారని.. దానికి ఉదాహరణ ఈ ఎన్నికలని తెలియజేశారు.
  • 02 Nov 2021 02:00 PM (IST)

    ధృవీకరణ పత్రాన్ని అందుకున్న సుధ

    బద్వేలు ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన వైసీసీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధకు ఎన్నికల అధికారులు ధృవీకరణ పత్రాన్ని అందజేశారు. ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన సీఎం వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు తెలిపిన ఆమె.. జగన్ ప్రజా పాలనకు ఈ గెలుపు నిదర్శనమన్నారు.

  • 02 Nov 2021 01:39 PM (IST)

    వైసీపీ నేతల సంబరాలు

    బద్వేల్‌లో భారీ విజయాన్ని సాధించడంపై ఆనందం వ్యక్తం చేశారు వైసీపీ నేతలు. సీఎం జగన్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్లే భారీ విజయం సాధించగలిగామని తెలిపారు. 2024 ఎన్నికల్లోనూ ఇదే ఫలితాలు రిపీట్‌ అవుతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు.

  • 02 Nov 2021 01:28 PM (IST)

    బద్వేల్‌ ఫలితంతో బీజేపీ డీలా!

    బద్వేల్‌ ఫలితం బీజేపీకి షాక్‌ ఇచ్చింది. కనీసం ప్రభావం చూపకపోగా.. డిపాజిట్‌ కూడా దక్కించుకోలేదు. దీంతో విజయవాడలోని పార్టీ ఆఫీస్‌ దగ్గర కార్యకర్తలు లేక ఖాళీగా కనిపిస్తోంది. కార్యకర్తలు పూర్తిగా డీలా పడిపోయారు. అటు.. రాష్ట్ర కార్యాయంలో అధ్యక్షులు సోము వీర్రాజు కూడా అందుబాటులో లేకుండా పోయారు.

  • 02 Nov 2021 12:44 PM (IST)

    వైసీపీ అభ్యర్థి సుధ 90 వేల 590 ఓట్ల భారీ ఆధిక్యం

    బద్వేల్‌లో మొత్తం 13 రౌండ్ల కౌంటింగ్‌ ముగిసేసరికి వైసీపీ అభ్యర్థి సుధ 90 వేల 590 ఓట్ల భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. మొత్తం 1 లక్షా 46 వేల 981 ఓట్ల పోల్‌ కాగా, వైసీపీకి 1 లక్షా 12 వేల 72 ఓట్లు లభించాయి. బీజేపీకి 21 వేల 661 ఓట్లు, కాంగ్రెస్‌కు 6217 ఓట్లు వచ్చాయి. నోటాకు 3649 ఓట్లు వచ్చాయి

  • 02 Nov 2021 12:15 PM (IST)

    వైసీపీ అభ్యర్థి సుధ ఘన విజయం

    బద్వేల్‌లో వైసీపీ అభ్యర్థి సుధ భారీ విజయం సాధించారు. 90,089 ఓట్ల భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. వైసీపీకి మొత్తం 1 లక్షా 11 వేల 710 ఓట్లు రాగా, బీజేపీకి 21 వేట 612 ఓట్లు లభించాయి. బద్వేల్‌లో మొత్తం 1 లక్షా 46 వేల 546 ఓట్లు పోలయ్యాయి. ఇందులో వైసీపీకి 1 లక్షా 11 వేల 710 ఓట్లు లభించాయి. బిజెపికి 21 వేల 621 ఓట్లు కాంగ్రెస్ కు 6 వేల 205 ఓట్లు వచ్చాయి. నోటాకు 3 వేల 635 ఓట్లు వచ్చాయి. దీంతో 90 వేల 089 ఓట్ల తేడాతో వైసీపీ విజయం సాధించింది.

  • 02 Nov 2021 11:59 AM (IST)

    90,089 ఓట్ల భారీ ఆధిక్యంతో వైసీపీ విజయం

    బద్వేల్‌ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధ ఘన విజయం సాధించారు. 11వ రౌండ్‌ కౌంటింగ్‌ పూర్తయ్యేసరికి 90,089 ఓట్ల భారీ ఆధిక్యంతో విజయం సాధించారు వైసీపీ అభ్యర్థి సుధ.

  • 02 Nov 2021 11:57 AM (IST)

    వైసీపీ అభ్యర్థికి 85 వేల ఓట్ల ఆధిక్యత

    బద్వేల్‌లో 10వ రౌండ్‌ కౌంటింగ్‌ పూర్తయింది. పదో రౌండ్‌ కౌంటింగ్‌ ముగిసేసరికి వైసీపీ అభ్యర్థికి 85 వేల 505 ఓట్ల ఆధిక్యత లభించింది. పదో రౌండ్‌లో వైసీపీకి 10 వేల 52 ఓట్లు లభించాయి. బీజేపీకి 1,554 ఓట్లు , కాంగ్రెస్‌కు 449 ఓట్లు మాత్రమే లభించాయి.

  • 02 Nov 2021 11:47 AM (IST)

    బద్వేల్‌లో వైసీపీ భారీ విజయం

    బద్వేల్‌లో వైసీపీ భారీ విజయం సాధించింది. అధికారికంగా మరో మూడు రౌండ్ల ఫలితాలు వెలువడాల్సి వుంది. అయినప్పటికీ ఉప పోరులో విజయం అమెను వరించింది.

  • 02 Nov 2021 11:41 AM (IST)

    తొమ్మిదో రౌండ్ వైసీపీదే

    బద్వేల్‌లో తొమ్మిదో రౌండ్ కౌంటింగ్‌ పూర్తయింది. ఇప్పటి వరకు వైసీపీకి 77 వేల 7 ఓట్ల ఆధిక్యత లభించింది. 9వ రౌండ్‌లో వైసీపీకి 11,354 ఓట్లు రాగా, బీజేపీకి 2,839, కాంగ్రెస్‌కు 439 ఓట్లు లభించాయి.

  • 02 Nov 2021 11:34 AM (IST)

    8వ రౌండ్ పూర్తి..

    ఇప్పటిదాకా మొత్తం లెక్కించిన ఓట్లు 1,11,266 ఓట్లు వైసీపీ … 84,682 బీజేపీ …16,190 కాంగ్రెస్ … 5,026

    వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధాకు 68,492 ఓట్ల ఆధిక్యత.

  • 02 Nov 2021 11:32 AM (IST)

    8వ రౌండ్‌ ఫలితాలు

    బద్వేల్‌ ఉప పోరు ఫలితాల్లో రౌండ్ రౌండ్‌కి అధికార పార్టీ హవా కొనసాగుతోంది. ఇప్పటివరకు ఎనిమిది రౌండ్లు ముగిశాయి. 8వ రౌండ్‌లో వైసీపీ అభ్యర్థి సుధాకు 9,691 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి సురేష్‌కు 1,964 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి కమలమ్మకు 774 ఓట్లు పోలయ్యాయి. దీంతో మొత్తంగా 68,492 ఓట్ల ఆధిక్యంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డాక్టర్ సుధా కొనసాగుతున్నారు.

  • 02 Nov 2021 11:24 AM (IST)

    8వ రౌండ్‌లో వైసీపీకి 68 వేల ఆధిక్యం

    బద్వేల్‌ లో 8వ రౌండ్‌ కౌంటింగ్‌ ముగిసింది. 8వ రౌండ్‌ కౌంటింగ్‌ ముగిసేసరికి వైసీపీ అభ్యర్థి సుధ 68 వేల 492 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు వైసీపీకి 84 వేల 682 ఓట్లు రాగా, బీజేపీకి 16 వేల 190 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు 5 వేల 26 ఓట్లు మాత్రమే వచ్చాయి. నోటాకు 2 వేల 830 ఓట్లు వచ్చాయి.

  • 02 Nov 2021 11:21 AM (IST)

    ఏడు రౌండ్లు ముగిసే సరికి వైసీపీకి 74,991 ఓట్లు

    బద్వేల్‌లో ఏడో రౌండ్‌ ముగిసింది. ఏడో రౌండ్‌లో వైసీపీ అభ్యర్థి సుధాకు 10,726, బీజేపీ అభ్యర్థి సురేష్‌కు 1,924, కాంగ్రెస్‌ అభ్యర్థి కమలమ్మకు 841 ఓట్లు పోలయ్యాయి. ఏడు రౌండ్లు ముగిసే సరికి వైఎస్సార్‌సీపీ 74,991 ఓట్లు సాధించింది.

  • 02 Nov 2021 10:49 AM (IST)

    ఏడో రౌండ్‌‌లోనూ ఫ్యాను గాలి

    బద్వేల్‌ ఉప ఎన్నికల్లో వైసీపీ దూసుకుపోతోంది. ఏడు రౌండ్లు పూర్తయ్యేసరికి వైసీసీ అభ్యర్థి డాక్టర్ సుధా 60,826 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది.

  • 02 Nov 2021 10:46 AM (IST)

    ఆరో రౌండ్‌‌లోనూ వైసీపీ అధిక్యత

    బద్వేల్‌లో ఆరో రౌండ్‌ కౌంటింగ్‌ పూర్తయింది. ఆరో రౌండ్‌లో వైసీపీకి 47,589 ఓట్ల ఆధిక్యత లభించింది.

  • 02 Nov 2021 10:37 AM (IST)

    వైసీపీ నేతలు, కార్యకర్తల సంబరాలు

    బద్వేలు ఉప ఎన్నికల్లో ఫ్యాన్‌ గాలికి ఇతర పార్టీల గుర్తులన్నీ కొట్టుకుపోతున్నాయి. ఇప్పటికే మెజార్టీ భారీగా వస్తుండడంతో వైసీపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. స్వీట్లు పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రభత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు ప్రజలు ఇస్తున్న గుర్తింపని కొనియాడుతున్నారు.

  • 02 Nov 2021 10:31 AM (IST)

    ఐదో రౌండ్‌‌లోనూ అదే జోరు

    బద్వేలు ఉప ఎన్నిక ఫలితాల్లో అధికార పార్టీ వైసీపీ భారీ విజయం దిశగా దూసుకుపోతోంది. ఐదో రౌండ్‌ ముగిసే సమయానికి 42,824 ఓట్ల ఆధిక్యంలో వైసీపీ కొనసాగుతోంది.

  • 02 Nov 2021 10:30 AM (IST)

    ప్రతి రౌండ్‌లోనూ ఫ్యాను గాలి

    ప్రతి రౌండ్‌లోనూ ఫ్యాను పార్టీ గాలి వీస్తోంది. నాలుగో రౌండ్ పూర్తయ్యేసరికి అధికార పార్టీ వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధా 30,412 ఓట్ల అధిక్యంలో కొనసాగుతున్నారు. నాలుగు రౌండ్ల పూర్తయ్యేసరికి వైసీపీకి 41,099 ఓట్లు పోలవ్వగా, బీజేపీ అభ్యర్థి సురేశ్‌కు 8,504 ఓట్లు, కాంగ్రేస్ అభ్యర్థి కమలమ్మకు 2,305 ఓట్లు వచ్చాయి. కాగా, నోటాకు 1,448 ఓట్లు రావడం విశేషం. ఇదిలావుంటే, ఇప్పటివరకు మొత్తం లెక్కించిన ఓట్లు 54,672.

  • 02 Nov 2021 10:03 AM (IST)

    ప్రతి రౌండ్‌లోనూ వైసీపీదే హవా

    ప్రతి రౌండ్‌లోనూ వైసీపీ ఆధిక్యత కొనసాగిస్తోంది. మూడో రౌండ్‌లో వైసీపీకి 31,232 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థికి 6,263 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌ అభ్యర్థికి 1,812 ఓట్లు మాత్రమే లభించాయి.

  • 02 Nov 2021 10:01 AM (IST)

    నాలుగో రౌండ్‌లో వైసీపీకి 30,412 ఓట్ల ఆధిక్యత

    బద్వేల్‌లో నాలుగు రౌండ్ల కౌంటింగ్‌ పూర్తయింది. నాలుగో రౌండ్‌ పూర్తయ్యేసరికి వైసీపీ అభ్యర్థి సుధ 30 వేల 412 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

  • 02 Nov 2021 09:42 AM (IST)

    వైసీపీదే జోరు

    ఫస్ట్ రౌండ్ లో లెక్కించిన మొత్తం ఓట్లు 13,434.

    వైసీపీ అభ్యర్థి సుధా కు 10,478 ఓట్లు.

    వైసీపీ మెజారిటీ 8,790 ఓట్లు.

    బీజేపీ అభ్యర్థి పనతల సురేశ్‌సకు 1,688 ఓట్లు.

    కాంగ్రెస్ అభ్యర్థి కమలమ్మకు 580 ఓట్లు పోలయ్యాయి.

    Badvel Countng Ist

    Badvel Countng Ist

  • 02 Nov 2021 09:38 AM (IST)

    మూడో రౌండ్‌లో 23 వేల 700 ఓట్ల ఆధిక్యం

    బద్వేల్‌లో వైసీపీ దూసుకెళుతోంది. మూడు రౌండ్లు ముగిసేసరికి వైసీపీ అభ్యర్థి 23 వేల 700 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. తొలి రౌండ్‌లోనే 8 వేల 790 ఓట్ల ఆధిక్యం లభించింది.

  • 02 Nov 2021 09:35 AM (IST)

    వైసీపీకి 8,790 ఓట్ల ఆధిక్యత

    బద్వేల్‌లో తొలి రౌండ్‌లో వైసీపీకి భారీ ఆధిక్యత లభించింది. వైసీపీకి 8,790 ఓట్ల ఆధిక్యత లభించింది. తొలి రౌండ్‌లో వైసీపీకి 10 వేల 478 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థికి 1,688 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌ అభ్యర్థికి 580 ఓట్లు వచ్చాయి.

  • 02 Nov 2021 09:15 AM (IST)

    కలసపాడు ఓట్ల లెక్కింపు షురూ

    కలసపాడు మండలం ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది.

  • 02 Nov 2021 09:14 AM (IST)

    పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు పూర్తి

    బద్వేల్‌లో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. పోస్టల్‌ బ్యాలెట్‌లో వైఎస్సార్‌సీపీ ఆధిక్యంలో ఉంది. ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కలసపాడు మండలం ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది.

  • 02 Nov 2021 09:14 AM (IST)

    మొదటి రౌండ్‌లో వైసీపీ ఆధిక్యం

    బద్వేల్‌లో కౌంటింగ్‌ కొనసాగుతోంది. మొదట కలసపాడు మండలం నుంచి కౌంటింగ్‌ జరుగుతోంది. మొదటి రౌండ్‌లో ఇక్కడ వైసీపీ ఆధిక్యం సాధించింది.

  • 02 Nov 2021 09:01 AM (IST)

    4వ టేబుల్‌లో వైసీపీకి 322 మెజారిటీ

    బద్వేల్ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. 4వ టేబుల్‌లో 500 ఓట్లకు గాను వైసీపీ 322 ఓట్ల మెజారిటీని సాధించింది.

  • 02 Nov 2021 08:55 AM (IST)

    వైసీపీ ఆధిక్యం 

    బద్వేల్ ఉప ఎన్నిక పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్‌లో వైసీపీ ఆధిక్యం

  • 02 Nov 2021 08:35 AM (IST)

    పోస్టల్ బ్యాలెట్స్‌‌లో వైసీపీదే హవా

    బద్వేల్‌లో కౌంటింగ్‌ మొదలైంది. మొదట పోస్టల్ బ్యాలెట్స్‌తో ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. రిటర్నింగ్ అధికారి, అభ్యర్థుల సమక్షంలో పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తున్నారు అధికారులు. మొత్తం 235 ఓట్లు పోలయ్యాయి. వీటి లెక్కింపు తర్వాత ఈవీఎం ఓట్లను లెక్కించనున్నారు అధికారులు.

  • 02 Nov 2021 08:30 AM (IST)

    మూడంచెల భద్రతా వ్యవస్థః కడప ఎస్పీ

    బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక కౌంటింగ్ కోసం ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేశామని కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. 400 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. అదనపు ఎస్‌పి, 6 మంది డిఎస్‌పిలు, 12 మంది సిఐలు, 22 మంది ఎస్ఐలు, కేంద్ర బలగాల సిబ్బంది కౌటింగ్ విధుల్లో పాల్గొంటున్నారన్నారు. గెలుపొందిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని ఎస్పీ అన్బురాజన్ హెచ్చరించారు.

    Sp Anbu Rajan

    Sp Anbu Rajan

  • 02 Nov 2021 08:19 AM (IST)

    ఉప ఎన్నిక ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ

    బద్వేల్ ఉప ఎన్నిక బరిలో అధికార పార్టీ వైసీపీ అభ్యర్థిగా డాక్టరు దాసరి సుధ, బీజేపీ అభ్యర్థి పనతల సురేష్, కాంగ్రెస్‌ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే కమలమ్మతో పాటు మరో 12 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 77.64 శాతం పోలింగ్‌ నమోదైంది. అప్పట్లో 2,04,618 ఓట్లు ఉండగా 1,58,863 ఓట్లు పోలయ్యాయి. ఎన్నికల ఫలితాలపై అందరిలో ఆసక్తి ఉంది.

  • 02 Nov 2021 08:01 AM (IST)

    బద్వేల్‌లో కౌంటింగ్‌ ప్రారంభం

    బద్వేల్‌లో కౌంటింగ్‌ ప్రారంభమైంది. మొత్తం నాలుగు హాళ్లలో 28 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 10 రౌండ్లలో కౌంటింగ్ పూర్తవుతుంది. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 2 లక్షల 15 వేల 240 మంది. అయితే ఈసారి 1 లక్షా 47 వేల 213 ఓట్లు పోలయ్యాయి. 68.39 శాతం పోలింగ్‌ నమోదైంది. వైసీపీ, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది.

  • 02 Nov 2021 07:38 AM (IST)

    తొలి మూడు గంటల్లో అభ్యర్థుల భవితవ్యం

    బద్వేల్ కౌంటింగ్‌ ప్రారంభమైన తొలి మూడు గంటల్లో అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. మొత్తం 281 పోలింగ్ కేంద్రాలకు ఒకేచోట కౌంటింగ్‌ నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అభ్యర్థుల సమక్షంలోనే స్ట్రాంగ్‌ రూమ్‌లను తెరుస్తామని.. కొన్ని టేబుళ్ళకు రౌండ్ లు పెరిగే అవకాశం ఉందని.. సూపర్ వైజర్, మైక్రో అబ్జర్వర్ల పర్యవేక్షణలో కౌంటింగ్ జరగనుందన్నారు. రౌండ్ వారీగా ఫలితాలను డిస్‌ ప్లే చేస్తామని.. వర్షం వల్ల కౌటింగ్ కు ఏలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు.

  • 02 Nov 2021 07:32 AM (IST)

    బద్వేల్ నియోజకవర్గంలో గత విజేతలు

    బద్వేల్ నియోజకవర్గంలో గత విజేతలు

    2019 – జి.వెంకటసుబ్బయ్య (వైఎస్సార్సీపీ) 2014 – త్రివేది జయరాములు (వైఎస్సార్సీపీ) 2009 – పీఎం కమలమ్మ (కాంగ్రెస్) 2004 – దేవసాని చిన్న గోవింద రెడ్డి (కాంగ్రెస్) 2001 – ఉప ఎన్నిక కొనిరెడ్డి విజయమ్మ (టీడీపీ) 1999 – బిజివేముల వీరారెడ్డి (టీడీపీ) 1994 – బిజివేముల వీరారెడ్డి (టీడీపీ) 1989 – వడ్డెమాను శివరామక్రిష్ణారావు (కాంగ్రెస్) 1985 – బిజివేముల వీరారెడ్డి (టీడీపీ) 1983 – బిజివేముల వీరారెడ్డి (ఐసీజే) 1978 – వడ్లమాను శివరామక్రిష్ణారావు (జేఎన్పీ) 1972 – బిజివేముల వీరారెడ్డి (కాంగ్రెస్) 1967 – బీవీ రెడ్డి (కాంగ్రెస్) 1962 – వడ్డమాని చిదానందం (ఎస్ డబ్ల్యు ఏ) 1955 – రత్నసభాపతి పెట్టి భండారు (కాంగ్రెస్) 1952 – వి.చిదానందం (ఇండిపెండెంట్)

  • 02 Nov 2021 07:25 AM (IST)

    బాలయోగి గురుకుల పాఠశాలలో కౌంటింగ్‌

    కొన్నిగంటల్లో బద్వేల్‌ బాద్‌షా ఎవరో తేలిపోనుంది. బద్వేల్లోని బాలయోగి గురుకుల పాఠశాలలో కౌంటింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభంకానుంది. నాలుగు హాళ్లలో 28 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 10 రౌండ్లలో కౌంటింగ్‌ పూర్తవుతుంది. రౌండ్‌ వారీగా ఫలితాలను డిస్‌ప్లే చేస్తారు. ఈసారి పోస్టల్‌ బ్యాలెట్‌ రెండు కేటగిరీలు ఉంటాయి. అవి సర్వీస్‌ ఓట్లు, వయోవృద్ధుల ఓట్లు. కౌంటింగ్‌ మొదలయ్యే వరకు సర్వీస్‌ ఓట్లను అనుమతిస్తారు.

  • 02 Nov 2021 07:25 AM (IST)

    గెలుపు గ్యారంటీ ధీమా!

    ఈసారి వైసీపీ అభ్యర్ధిగా దివంగత ఎమ్మెల్యే సతీమణి డాక్టర్ సుధ పోటీలో వుండడంతో అధికార పార్టీ నేతలు ప్రచారం చేశారు. గెలుపు గ్యారంటీ కావడంతో అంతగా శ్రమించిన దాఖలాలు లేవు.

  • 02 Nov 2021 07:12 AM (IST)

    ఫ్యాను గుర్తు పార్టీ హవా

    బి.కోడూరు మండలంలో 75.41 శాతం పోలింగ్‌ నమోదై రెండో స్థానంలో నిలిచింది. మొత్తం 15,069మంది ఓటర్లుండగా.. 11,365ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ 2009 నుంచి టీడీపీ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ ప్రభావం ఉన్నప్పటికి .. 2014, 2019ఎన్నికల్లో వైసీపీ విజయంతో ఫ్యాను గుర్తు పార్టీ హవా కొనసాగుతోంది. ఇది ఒకింత బీజేపీకి మైనస్..కావచ్చనే సంకేతాలున్నాయి.

  • 02 Nov 2021 07:10 AM (IST)

    పోరుమామిళ్ల మండలంలో వైసీపీకే ఛాన్స్!

    పోరుమామిళ్ల మండలంలో 48,005మంది ఓటర్లుండగా…ఈసారి బైపోల్‌లో 30,801 ఓట్లు పోలయ్యాయి. అంటే అత్యల్పంగా ఓటింగ్ నమోదైంది ఇక్కడే. ఇక్కడ స్థానికుల్ని వైసీపీ ఏజెంట్లు భయపెట్టారని బీజేపీ ఆరోపించింది. స్థానికేతురులతో దొంగ ఓట్లు వేయించారనే విమర్శలు చేసింది.

  • 02 Nov 2021 07:08 AM (IST)

    కాశినాయన మండలంలో కనిపించని కషాయం

    కాశినాయన మండలంలో బీజేపీకి పెద్దగా పట్టులేకపోవడం.. వైసీపీ పటిష్టంగా ఉండటంతో.. ఇక్కడ వైసీపీ అభ్యర్ధి డాక్టర్ సుధాకు ఓటింగ్ శాతం పెరిగే ఛాన్సుంది. అయితే బీజేపీ మాత్రం వరికుంట్లలో వైసీపీ నేతలు దొంగఓట్లు వేశారన్న ఆరోపణలతో ఆందోళన కూడా చేపట్టారు. ఈ మండలంలో 22295 ఓటర్లుంటే…16254 ఓట్లు పోలయ్యాయి. 72.90శాతం పోలింగ్ నమోదైంది.

  • 02 Nov 2021 07:07 AM (IST)

    కలసపాడు మండలంలో ఎవరికి ప్లస్

    కలసపాడు మండలంలో ఓటింగ్‌ ఎవరికి ప్లస్ అవుతుందో …ఏ పార్టీకి మైనస్ అవుతుందో ఊహించని పరిస్థితి నెలకొంది. ఇక్కడ కాస్తో ..కూస్తో పట్టున్న టీడీపీ పోటీలో లేకపోవడంతో…ఆ ఓటు బ్యాంక్‌ని ఈసారి ఎన్నికల్లో బీజేపీ కాపాడుకునే ప్రయత్నం చేసింది. ఎగువ తంబళ్లపల్లె, బ్రహ్మణపల్లె గ్రామాల్లో వైసీపీకి బలంతో పాటు స్థానిక నాయకత్వం గట్టిగా పనిచేసింది. కలసపాడు మండలంలో మొత్తం 25,260మంది ఓటర్లుండగా…ఈసారి 17,748 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ 70.26శాతం పోలింగ్ శాతం నమోదైంది.

  • 02 Nov 2021 07:06 AM (IST)

    గోపవరం మండలంలో గట్టిపోటీ

    ఇక గోపవరం మండలంలోని కాల్వపల్లి, శ్రీనివాసపురం, గోపవరం, సండ్రపల్లి, రామాపురం, బ్రహ్మణపలల్లిలో టీడీపీకి గట్టి నాయకత్వం ఉంది. మాజీ ఎమ్మెల్యే కూడా కొంత ప్రభావం చూపగలరు. ఇవే కారణాలు వైసీపీకి కొంత మైనస్‌ పాయింట్‌ అని చెప్పాలి. శ్రీనివాసవురంలో సీఎం రమేష్ క్యాడర్ ఉండటం వల్ల…బీజేపీకి బాగా ఓట్లు పడ్డాయనే టాక్ ఉంది. సో ఈ రెండు పరిణామాల వల్ల వైసీపీకి ఓటు షేరింగ్‌లో కొంత ఎఫెక్ట్‌ పడే ఛాన్సుంది. 44,480మంది ఓటర్లుంటే..ఈసారి 27,617మంది ఓటేశారు. దీంతో మండలంలో 62.08శాతం పోలింగ్ నమోదైంది.

  • 02 Nov 2021 07:05 AM (IST)

    అట్లూరు మండలంలో వైసీపీదే హవా

    అట్లూరు మండలం…ఇక్కడ వైసీపీదే ఏకచత్రాధిపత్యం. పార్టీ ఏర్పడిన నాటి నుంచి మండలంలోని ఓటర్లంతా ఎమ్మెల్సీ గోవిందరెడ్డి మాటనే శిరసావహిస్తారు. దానికి తోడు ఇతర పార్టీలకు చెందిన పెద్ద నాయకులెవరూ లేకపోవడం వల్ల …వైసీపీదే హవా. ఒక్క కొండూరు సర్పంచ్‌ స్థానం మాత్రం టీడీపీ డబ్బు ఖర్చు చేసి గెలుచుకోవడం వల్లే బీజేపీ ఇతర పార్టీలకు ఇక్కడ ఓట్లు పడే ఛాన్సే లేనట్లు కనిపిస్తోంది. అట్లూరు మండలంలో మొత్తం 14,701 ఓట్లు పోలయ్యాయి. ఓటింగ్ శాతం 75.73గా నమోదైంది.

  • 02 Nov 2021 07:04 AM (IST)

    బద్వేల్ రూరల్‌ మండలంలో పోటా-పోటీ

    బద్వేల్ రూరల్‌ మండలం విషయానికి వస్తే గతంలో YCP-TDPకి ఇక్కడ సమాన పట్టుంది. ఈసారి మాత్రం ఇక్కడ…బీజేపీ కాస్త బలపడినట్లుగా కనిపిస్తోంది. ముఖ్యంగా బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌కి చెందిన నాయుడు సామాజికవర్గం అంతా బీజేపీ వైపు ఉండటం… బీజేపీ ఏజెంట్లను కూడా గట్టివాళ్లను పెట్టడం వల్ల ఇక్కడ కమలం అభ్యర్ధికి అధికంగా ఓట్లు పడే ఛాన్సుంది. మొత్తం 40719 ఓటర్లుండగా …28727 ఓట్లు పోలయ్యాయి. 70.54శాతం పోలింగ్ శాతం నమోదైంది.

  • 02 Nov 2021 07:03 AM (IST)

    బద్వేల్ అర్బన్‌లో వారిదే హవా

    బద్వేల్ అర్బన్ …ఇది మొదట్నుంచి టీడీపీ స్థానబలం ఉన్న ప్రాంతం. కాని వైసీపీ క్రమంగా పుంజుకుంటూ వచ్చింది. మొన్న జరిగిన ఎన్నికల నాటికి బద్వేల్ మున్సిపాలిటిలీలో 3స్థానాలు మినహా అన్నింటిని వైసీపీనే కైవసం చేసుకునే స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం జరిగిన ఎన్నికలో మున్సిపల్ వైస్‌ ఛైర్మెన్‌గా ఉన్నటువంటి యాదవ సామాజికవర్గానికి చెందిన గోపాలస్వామి వల్ల వైసీపీకి ఓట్లు పడే అవకాశం ఉన్నప్పటికి అడా చైర్మెన్ గురుమోహన్ ప్రభావం తగ్గే అవకాశం ఉంది. ఇక మున్సిపల్‌ చైర్మెన్‌గా ఉన్నటువంటి రాజగోపాల్‌రెడ్డిపై భూకబ్జాల విమర్శలు వైసీపీ క్యాండెట్‌కి కొంత మైనస్ అయ్యే ఛాన్సుంది. మార్కెట్ యార్డ్ మాజీ చైర్మెన్ కరెంట్ రమణారెడ్డిపై కూడా స్థానికంగా ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉంది. ఈపరిణామాలన్ని …బీజేపీకి కొంత అనుకూలంగా మారే ఛాన్సుంది.

  • 02 Nov 2021 07:01 AM (IST)

    మండలాల వారిగా పార్టీల బలాబలాలు

    బద్వేల్‌ నియోజకవర్గంలో మొత్తం 7 మండలాలు ఉన్నాయి. ఏ మండలం ఓటర్లు ఇవాళ్టి ఫలితాల్లో విజేతను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తారంటే…అది అక్కడున్న స్థానిక నాయకత్వంపైనే ఆధారపడినట్లుగా కనిపిస్తోంది. బద్వేల్‌ నియోజకవర్గంలోని బద్వేల్ అర్బన్‌, రూరల్‌తో పాటు అట్లూరు, గోపవరం, కలసపాడు, పోరుమామిళ్ల, కాశీనాయన , బి.కోడూరు మండలాలు ఉన్నాయి.

Published On - Nov 02,2021 6:53 AM

Follow us
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?