Lokesh Padayatra: నారా లోకేష్ పాదయాత్ర 100 రోజులు పూర్తి.. తనయుడికి అండగా తల్లి భువనేశ్వరి..
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 'యువగళం' పాదయాత్ర 100 రోజులు పూర్తి చేసుకుంది. 100 వరోజు యాత్రలో కుమారుడు లోకేష్‌కు సంఘీభావంగా నారా భువనేశ్వరి పాల్గొన్నారు.
జనవరి 27 చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ప్రారంభమైన లోకేష్ పాదయాత్ర కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకర్గంలో వంద రోజులకు చేరుకుంది. లోకేష్ పాదయాత్రకు మద్దతుగా ఆయన తల్లి భువనేశ్వరి, ఇతర కుటుంబసభ్యులు యాత్రలో పాల్గన్నారు. దారి మధ్యలో భువనేశ్వరి షూలేస్ ఊడిపోవడంతో.. తానే స్వయంగా లేస్ కట్టారు లోకేష్. యాత్ర వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మోతకూరు వద్ద పైలాన్‌ను ఆవిష్కరించారు. ఇక లోకేష్ పాదయాత్రకు సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తలు, నాయకులు పాదయాత్రలు చేశారు. 100 రోజుల యాత్రలో సామాన్య ప్రజానీకం సమస్యలను తెలుసుకుంటూ.. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయా సమస్యలను పరిష్కరిస్తామని భరోసానిస్తూ ముందుకు సాగారు లోకేష్ . పనులు నిలిచిపోయిన పలు ప్రాజెక్టుల వద్ద సెల్ఫీలు తీసుకుంటూ రాష్ట్ర మంత్రులకు, వైసిపి ఎమ్మెల్యేలకు సవాళ్లు విసిరారు.
శ్రీశైలం నియోజకవర్గంలో సాగిన 100 వ రోజు పాదయాత్రలో సంత జూటూరు వద్ద చెంచులతో ముఖాముఖి నిర్వహించారు నారా లోకేష్. పాత ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేస్తామని, ఆర్‌డిటి లాంటి సంస్థలతో ఒప్పందం చేసుకుని చెంచులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, ఐటిడిఎలను ప్రక్షాళన చేసి దామాషా ప్రకారం నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. చెంచులకు విద్యను చేరువ చేసేందుకు వారినే ఉపాధ్యాయులుగా నియమిస్తామన్నారు. బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.
పాదయాత్ర 100 వ రోజు బాణసంచా మోత, డప్పు చప్పుళ్లతో జాతరను తలపించింది. పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలి వచ్చారు. సాయంత్రం యాత్ర ముగిసిన అనంతరం యువగళం వాలంటీర్లు, టీమ్ సభ్యులకు నారా భువనేశ్వరి స్వయంగా భోజనం వడ్డించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..