Bhogapuram: ‘విమాన వేగం’తో భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ పనులు.. ఎప్పుడు అందుబాటులోకి రానుందంటే

రాష్ట్ర విభజనలో భాగంగా ఏపికి కేటాయించిన కీలక ప్రాజెక్ట్స్‌లో ముఖ్యమైన ప్రాజెక్ట్ భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్.. అలా కేటాయించిన ప్రాజెక్ట్ మూడు జిల్లాలకు అందుబాటులో ఉండేలా చేయాలని అనేక రకాల అధ్యయనం చేసింది అప్పటి రాష్ట్ర ప్రభుత్వం. అన్నివిధాలా పరిశీలించిన తరువాత విశాఖ, శ్రీకాకుళం జిల్లాలకు సమీపంలో విజయనగరం జిల్లా భోగాపురం వద్ద నిర్మించాలని...

Bhogapuram: 'విమాన వేగం'తో భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ పనులు.. ఎప్పుడు అందుబాటులోకి రానుందంటే
Bhogapuram
Follow us
G Koteswara Rao

| Edited By: Narender Vaitla

Updated on: Jun 21, 2024 | 12:00 PM

భోగాపురం విమానాశ్రయ పనులు వేగం పుంజుకున్నాయి. భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ ఏపి రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత అంశం. త్వరితగతిన ఎయిర్ పోర్ట్ నిర్మాణం పూర్తి చేసి విమానాలను రన్ వే పై దూసుకుపోయేలా చర్యలు చేపట్టాలని ఇటు నూతన రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్రం ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అందుకోసం నిరంతరం పర్యవేక్షిస్తుంది ఎపిఎడిసిఎల్. ఉత్తరాంధ్ర నడిబొడ్డున ఉన్న భోగాపురంలో నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ ఆంధ్రప్రదేశ్ కే తలమానికం. ఇటు విశాఖకు, అటు శ్రీకాకుళం జిల్లాకు మధ్యలో ఉన్న భోగాపురంలో ఎయిర్ పోర్ట్ నిర్మాణం జరిగితే ప్రయాణికుల సౌకర్యంతో పాటు కార్గో కూడా అభివృద్ధి చెందుతుంది.

రాష్ట్ర విభజనలో భాగంగా ఏపికి కేటాయించిన కీలక ప్రాజెక్ట్స్‌లో ముఖ్యమైన ప్రాజెక్ట్ భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్.. అలా కేటాయించిన ప్రాజెక్ట్ మూడు జిల్లాలకు అందుబాటులో ఉండేలా చేయాలని అనేక రకాల అధ్యయనం చేసింది అప్పటి రాష్ట్ర ప్రభుత్వం. అన్నివిధాలా పరిశీలించిన తరువాత విశాఖ, శ్రీకాకుళం జిల్లాలకు సమీపంలో విజయనగరం జిల్లా భోగాపురం వద్ద నిర్మించాలని నిర్ణయించింది. 2016లో స్థలం గుర్తించి, ఎయిర్ పోర్ట్ కు నోటిఫికేషన్ ఇచ్చింది ప్రభుత్వం. ఆ తరువాత అనేక అడ్డంకులతో భూసేకరణ పూర్తి చేసి నిర్మాణ పనులను ప్రఖ్యాతి గాంచిన జి ఎమ్ ఆర్ సంస్థకి అప్పగించింది అప్పటి చంద్రబాబు ప్రభుత్వం.

భోగాపురం అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల అనుమతులు ఇవ్వడంతో సుమారు 4,750 కోట్ల వ్యయంతో ఎయిర్ పోర్ట్ నిర్మాణంను ప్రారంభించేందుకు సిద్దమైంది జిఎం ఆర్ సంస్థ. 2023 ఫిబ్రవరి 3న శంఖుస్థాపన చేసి పనులను ప్రారంభించింది జి ఎమ్ ఆర్ సంస్థ. కేవలం మూడేళ్లలోనే ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనులు పూర్తి చేసి కార్యకలాపాలు ప్రారంభిస్తామని ఎయిర్ పోర్ట్ నిర్మాణ సంస్థ ప్రారంభించింది. అలా పనులు ప్రారంభం అయిన నత్తనడకన సాగుతుండటంతో పాటు ఎయిర్ పోర్ట్ కు అనుసంధాన సీడ్ యాక్సిస్ రోడ్ల తో పాటు చాలా పనులు ఇంకా ప్రారంభమే కాలేదు.

Bhogapuram Airport

పనులు ఎప్పటికి పూర్తవుతాయో అన్న సందేహం అందరిలో నెలకొంది. అయితే ప్రస్తుతం అదే ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం ఎంపి అయిన రామ్మోహన్ నాయుడు కేంద్ర విమానయాన మంత్రి కావడంతో కొత్త ఆశలు చిగురించాయి. ఎయిర్ పోర్ట్ పనులు పరుగులు తీయిస్తా, నిర్ణీత సమయంలోనే ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనులను పూర్తిచేస్తామని చెప్పడంతో ఉత్తరాంధ్ర వాసులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే మరో రెండేళ్లలో ఎయిర్ పోర్ట్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.

భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణం పూర్తయితే ప్రయాణికుల రాకపోకలతో పాటు కార్గో సేవలు కూడా గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయం కావటంతో ఇక్కడి నుంచి ఇతర దేశాలకు సైతం రాకపోకలు జరగనున్నాయి.. అంతే కాకుండా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావడంతో పాటు పెద్దఎత్తున పెట్టుబడులు వచ్చి వెనుకబడిన ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు అభివృద్ధి పధం వైపు దూసుకుపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..