
పోస్టల్ బ్యాలెట్‌పై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. రేపు సాయంత్రం 6 గంటలకు తీర్పు వెలువరించనున్నట్లు ఏపీ హైకోర్టు న్యాయమూర్తి స్పష్టం చేసింది. ఏపీ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు వివాదంపై గత రెండు రోజులుగా హైకోర్టులో విచారణ కొనసాగింది. పోస్టల్ బ్యాలెట్‌పై గెజిటెడ్ స్టాంప్ లేకున్నా చెల్లుబాటు అవుతుందని ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని వైసీపీ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. రూల్స్‌కు విరుద్ధంగా ఈసీ ఆదేశాలు జారీ చేసిందని కోర్టుకు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని నిబంధన కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎందుకని వైఎస్ఆర్సీపీ నాయకులు పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై గతంలో ఈసీని వివరణ కోరింది ఏపీ హైకోర్టు. దానికి స్పందించిన ఈసీ ముఖేష్ కుమార్ మీనా బ్యాలెట్ ఓట్లపై ఇచ్చిన మెమోను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. అయితే ఇదే క్రమంలో మరో కీలక ప్రకటన కూడా చేశారు.
కేంద్ర ఎన్నికల కమిషన్ చెప్పిన నిబంధనల ప్రకారం నడుచుకుంటామన్నారు. మీనా ఆదేశాల మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ స్పందించింది. పోస్టల్ బ్యాలెట్లపై స్టాంపు, గెజిటెడ్ అధికారి డిజిగ్నేషన్ లేకున్నా ఆ ఓటు చెల్లుతుంది అని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో వాటిని పాటిస్తామని తెలిపారు రాష్ట్ర ఎన్నికల అధికారి మీనా. ఇదిలా ఉంటే ఏపీ ఎస్ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం సమర్ధించింది. దీనిపై వైఎస్ఆర్సీపీ తీవ్ర అభ్యంతరకరం వ్యక్తం చేసింది. తాను తీసుకొచ్చిన మెమోను ఢిల్లీ ఎన్నికల అధికారులకు పంపితేనే దానిపై కేంద్ర ఎన్నికల కమిషన్ సానుకూలంగా స్పందించిందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రధాన అధికారి ఇచ్చిన ఆదేశాలు ఎలా చెల్లుబాటు అవుతాయని.. ఎస్ఈసీ ఇచ్చిన మెమోకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సీఈసీ తీరును తప్పుబడుతూ వైసీపీ పిటిషన్ వేయడంతో హైకోర్టులో మే 31న సాయంత్రం వరకు సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ఇరువురి వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. జూన్ 1 సాయంత్రం 6 గంటలకు తీర్పును వెలువరిస్తానని స్పష్టం చేసింది. ఏపీ హైకోర్టులో తీర్పు ఎలా ఉండనుందో అన్న ఉత్కంఠ అటు ఈసీలో, ఇటు రాజకీయ వర్గాల్లో నెలకొంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…