Andhra Pradesh: ఏపీకి బిగ్ అలర్ట్.. వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకోండి..
ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు రోజుల పాటు వాతావరణంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్రతో పాటు రాయలసీమలో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయంటే..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు తెలిపింది. ఇది ఎత్తుకు వెళ్లేకొద్దీ నైరుతి వైపు వంగి ఉందని అధికారులు వెల్లడించారు. మరోవైపు దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉంది. వీటికి తోడు సెప్టెంబర్ 19 నాటికి పశ్చిమ రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.
ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో మంగళవారం కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. బుధవారం, గురువారం ఒకటి లేదా రెండు చోట్ల వర్షాలు పడే వీలుంది. వర్షం కురిసే సమయంలో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు.
రాయలసీమ వ్యాప్తంగా రాబోయే మూడు రోజుల పాటు ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి కేంద్రం అంచనా వేసింది. ఇక్కడ కూడా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశమున్నందున రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
