బైక్స్‌పై వస్తున్నవారిని ఆపి తనిఖీ చేశారు.. వారి వద్ద బ్యాగుల్లో ఏమున్నాయంటే..?
అల్లూరి సీతారామరాజు జిల్లా సరిహద్దు ప్రాంతంలో పంగోలిన్ పొలుసుల అక్రమ రవాణా గుట్టురట్టైంది. ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లాలో అటవీ శాఖ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో 352 అలుగు పొలుసులు పట్టుబడ్డాయి. అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఆరుగురిని అధికారులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా సరిహద్దు ప్రాంతంలో వన్యప్రాణుల అక్రమ రవాణాకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏఓబీ పరిధిలోని ఒడిశాలో భారీగా అలుగు పొలుసులు పట్టుబడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉన్న పంగోలిన్ పొలుసులను స్మగ్లింగ్ చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు ఒడిశా అటవీ శాఖ అధికారులు. ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లా అటవీ శాఖ రేంజ్ పరిధిలో ఇటీవల అటవీ అధికారులు నిఘా కఠినతరం చేశారు. దీనిలో భాగంగా.. పద్మగిరి- పండ్రీపాని రహదారిపై మత్తిలి, మల్కాన్‌గిరి అటవీ శాఖ సిబ్బంది సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో.. ఆ మార్గంలో అనుమానాస్పదంగా వస్తున్న మూడు ద్విచక్ర వాహనాలను అధికారులు తనిఖీ చేశారు. దీంతో.. వారి దగ్గర అటవీ జంతువు అలుగుకు చెందిన 352 పొలుసులు దొరకడం అటవీ శాఖ సిబ్బందికి షాకిచ్చింది. అంతరించిపోతున్న అలుగులను వేటాడి, వాటి పొలుసులను అక్రమంగా తరలిస్తున్నట్టు గుర్తించి ఆరుగుర్ని అరెస్ట్ చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కేవలం ఈ ఆరుగురు మాత్రమే అలుగులను వేటాడుతున్నారా?.. దీని వెనుక అంతర్రాష్ట్ర స్మగ్లింగ్ నెట్‌వర్క్ ఏమైనా ఉందా?.. ఈ రాకెట్ ఎక్కడికి సరఫరా అవుతోంది?.. అనే కోణాల్లో ఒడిశా అటవీ అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు. అటవీ సంపదను, వన్యప్రాణులను ధ్వంసం చేసే అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతామని ఫారెస్ట్ అధికారులు హెచ్చరించారు.
