ఈనెల 18న మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక.. కసరత్తు మొదలుపెట్టిన వైసీపీ.. అగ్రనేతలను ప్రసన్నం చేసుకుంటున్న కార్పొరేటర్లు
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు పూర్తి అయ్యాయి. దీంతో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
AP municipal corporation mayor elections : ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు పూర్తి అయ్యాయి. దీంతో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నెల 18న మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల కోసం పార్టీ అగ్రనేతలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. మేయర్ రేసులో ఉన్న అభ్యర్థులు స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులుతో ప్రయత్నాలు చేసుకుంటున్నారు. స్థానికంగా ఉన్న అన్ని అంశాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిగణంలోకి తీసుకుని మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులను ఖారారు చేయనున్నారు.
ఆదివారం వెలువడిన ఫలితాల్లో వైస్సార్‌సీపీకి చెందిన అభ్యర్థులు అన్ని మున్సిపల్ కార్పొరేషన్లను చేజిక్కించుకున్నారు. మొత్తం 11 కార్పొరేషన్లకు ఎన్నికల నిర్వహించగా.. 11కార్పొరేషన్ లు వైసీపీకే దక్కాయి. దీంతో ఆ పార్టీలో పోటీ తీవ్రంగా ఉంది. ముఖ్యంగా కార్పొరేషన్ల పరంగా పెద్ద నగరాల్లో పోటీ తీవ్రంగా ఉంది. ప్రాంతాల వారీగా.. సామాజికవర్గాల వారిగా పరిగణంలోకి తీసుకునే అవకాశం ఉంది.
ముఖ్యంగా ఏపీలో పెద్ద నగరమైన విశాఖపట్నం మేయర్ పీఠంపై అందరి చూపు నెలకొంది. దీంతో ఇక్కడ పోటీ తీవ్రంగా ఉంది. జీవీఎంసీలో మొత్తం 98 డివిజన్లు ఉన్నాయి. వైసీపీకి చెందిన అభ్యర్థులు 58 మంది గెలుపొందడంతో మేయర్ అభ్యర్థి వైసీపీ నుంచే ఎన్నిక కానున్నారు. మేయర్ పదవి బీసీ జనరల్‌కు రిజర్వు అయ్యింది. వైసీపీ పార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ బీసీ సామాజికవర్గం కావడంతో అతని పేరు ప్రముఖంగా వినబడుతుంది. ఇతను 21వ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా గెలుపొందారు. వంశీ కృష్ణ గతంలో పలు మార్లు అసెంబ్లీకి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో వంశీ కృష్ణకు టిక్కెట్ దక్కలేదు. దీంతో అతనికి అసెంబ్లీ ఎన్నికల అనంతరం పదవి ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చింది. దీంతో మేయర్ పీఠంపై కన్నేసిన వంశీ కృష్ణకు తీవ్రప్రయత్నాలు మొదలుపెట్టారు. మరోవైపు, శ్రీనివాస్‌ను కాదని ఎవరికైన మహిళకు ఇస్తే ఎలా ఉంటుందని వైసీపీ అధిష్టానం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. మహిళలకు ఇస్తే అక్కరమాని రోహిణి, కోరుకొండ వెంకటరత్నస్వాతి, పుర్రె పూర్ణశ్రీ ముగ్గురులో ఒకరిని ఎంపిక చేయవచ్చని తెలుస్తోంది.
మరోవైపు, విశాఖ మేయర్ అభ్యర్థి విషయంలో ఎంపీ విజయసాయిరెడ్డి నిర్ణయం కీలకం కానుంది. ఆయన ఎవరి పేరు సూచిస్తే వారినే సీఎం జగన్ ఖరారు చేసే అవకాశం ఉందని వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో ప్రముఖ నగరాల్లో విశాఖ, విజయవాడ తర్వాత తిరుపతి కూడా ఉంది. తిరుపతి మేయర్ కూడా బీసీ మహిళకే రిజర్వేషన్ అయ్యింది. దీంతో ఇక్కడ మేయర్ రేసులో ఉన్న శిరీష్ కూడా యాదవ్ సామాజికవర్గానికి చెందినవారు. అయితే, విశాఖపట్నం మేయర్ పీఠం వంశీ శ్రీనివాస్‌కు కట్టబెడితే, ఇద్దరు యాదవ్ సామాజికవర్గం అవుతారు. దీంతో పెద్ద నగరలైన రెండు చోట్ల ఒకే సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో వారికే ఎంత వరకు అవకాశం దక్కుతుందో చూడాలి.
ఏపీలో రెండవ పెద్ద నగరమైన విజయవాడలో కూడా మేయర్ కోసం పోటీ ఎక్కువగా ఉంది. విజయవాడ మేయర్ పదవి జనరల్ మహిళకు కేటాయించారు. ఇక్కడ 64 డివిజన్లు ఉండగా, 49 డివిజన్లు వైసీపీ కైవసం చేసుకుంది. దీంతో ఇక్కడ మేయర్ వైసీపీకే చెందినవారే కానున్నారు. తమ నియోజకవర్గానికే మేయర్ పీఠం దక్కాలని మంత్రి, ఎమ్మెల్యేలు, స్థానిక నేతలు ప్రయత్నాలు మొదలు పెట్టారు. మేయర్ రేసులో 34వ డివిజన్ నుంచి విజయం సాధించిన బండి పుణ్యశీలకే అవకాశం ఎక్కువగా ఉందని వర్గాలు భావిస్తున్నాయి. గతంలో కార్పొరేషన్లో వైసీపీ ఫ్లోర్ లీడర్ గా వ్యవహరించారు ఆమె. కార్పొరేషన్‌లో రాజకీయ అనుభవం ఉండటం పుణ్యశీలకు కలిసొచ్చే అంశం. మేయర్ రేసులో ఉన్న గౌతమ్ రెడ్డి కుమార్తె లిఖితారెడ్డి ఓటమి చెందడంతో ఇప్పుడు పుణ్యశీలకు దక్కే అవకాశం ఉంది. విజయవాడ మేయర్ ఎవరనేది అధిష్టానమే నిర్ణయిస్తుందని వైసీపీ నేతలు అంటున్నారు. ఇక్కడ ముఖ్యంగా జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎవరి వైపు మొగ్గు చూపితే వారే మేయర్ అయ్యే అవకాశాలున్నాయని వర్గాలు భావిస్తున్నాయి. ఒక వేళ పోటీ ఎక్కువగా ఉండటంతో మేయర్ పదివిని రెండున్నరళ్ల పాటు విభజించి ఇద్దర్ని ఎంపిక చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
ఇక, విజయనగం కార్పొరేషన్ లో 50 డివిజన్లు ఉండగా… వైసీపీ 48 డివిజన్లు కైవసం చేసుకుని తన సత్తా చాటింది. ఒకరు టీడీపీ .. మరొకరు ఇండిపెండెంట్ గా విజయం సాధించారు. ఇక్కడ మంత్రి బొత్స సత్యానారాయణ వర్గానికి చెందిన వ్యక్తి లేదా స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి మద్దతు ఇచ్చిన వ్యక్తే మేయర్ అయ్యే అవకాశం ఉంది. విజయనగరం కార్పొరేషన్ అయిన తర్వాత తొలిసారి ఎన్నికల జరగడంతో ఆ పదవి కోసం పోటీ పడుతున్నావారు కూడా అధికంగా ఉన్నారు. ముఖ్యంగా ఆశపు సూజత లేదా యడ్ల కృష్ణవేణికి మేయర్ పీఠం దక్క అవకాశం ఉంది.
మచిలీపట్నం కార్పొరేషన్ లో 50 డివిజన్లు ఉండగా… వైసీపీ 44 డివిజన్లు కైవసం చేసుకుంది. దీంతో వైసీపీకి చెందిన వారే మేయర్ కానున్నారు. ఇక్కడ మంత్రి పేర్ని నాని సూచించిన వ్యక్తే మేయర్ కానున్నారు. దీంతో అక్కడ రేసులో ఉన్న వారు పేర్ని నానిని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. శీలం భారతీ కుసుమకుమారి, మేకా వెంకటేశ్వరమ్మ, చిటికెన వెంకటేశ్వరమ్మ మేయర్ పదవిని ఆశిస్తున్నారు.
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 57 డివిజన్లు ఉన్నాయి. ఇక్కడ వైసీపీకి 44 డివిజన్లు రావడంతో ఆ పార్టీకి చెందిన వ్యక్తే మేయర్ కానున్నారు. గుంటూరు కూడా పెద్ద నగరం కావడంతో మేయర్ అభ్యర్థి కోసం పోటీ ఎక్కువగా నెలకొంది. గుంటూరు జిల్లాలో 15 ఏళ్ల తర్వాత కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి. మేయర్ పదవి కోసం కావాటి మనోహర్ నాయుడు, పాదర్తి రమేష్ గాంధీ పోటీ పడుతున్నారు. వారిద్దరులో ఒకరును వైసీపీ అధిష్టానం ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఒంగోలు కార్పొరేషన్ లో 50 డివిజన్లున్నాయి. వైసీపీ 41 వార్డుల్లో విజయం సాధించింది. ఇక్కడ వైసీపీకి చెందినవారే మేయర్ కానున్నారు. మేయర్ పదవి కోసం పోటీ పడుతున్న వారి సంఖ్య కూడా అధికంగా ఉంది. ముఖ్యంగా ఇక్కడ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎవరి వైపు మొగ్గు చూపితే వారే మేయర్ కానున్నారు. ముఖ్యంగా మేయర్ రేసులో ముందున్న వారిలో గంగాడ సుజాత, కొచ్చెర్ల కమల పేర్లు వినబడుతున్నాయి.
చిత్తూరు జిల్లాలో చిత్తూరు, తిరుపతి కార్పొరేషన్లు ఉన్నాయి. ఇక్కడ రెండు కార్పొరేషన్ లు వైసీపీకే దక్కుతాయి. తిరుపతిలో 50 డివిజన్లుండగా 48 డివిజన్లు వైసీపీకే దక్కాయి. తిరుపతి మేయర్ పదవి బీసీ మహిళకు కేటాయించారు. దీంతో డాక్టర్ శిరీష పేరు ముందు వరుసలో ఉంది. వైసీపీ నేత అన్నా రామచంద్రయ్య ఇద్దరు కూతుళ్లు కూడా పోటీలో ఉన్నారు. డాక్టర్ సంధ్య, డాక్టర్ అనిత కూడా పోటీ పడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆశీస్సులు ఉన్న వారికే మేయర్ పీఠం దక్కుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. డిప్యూటీ మేయర్‌గా ఇప్పటికే భూమన కొడుకు అభినయ్ రెడ్డి పేరు ఖరారు అయ్యింది.
చిత్తూరు కార్పొరేషన్ లో 50 డివిజన్లుకు 46 డివిజన్లు వైసీపీకే దక్కాయి. ఇక్కడ మేయర్ పీఠం ఎస్సీ జనరల్ కు కేటాయించారు. ఇక్కడ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులు ఉన్న వ్యక్తే మేయర్ అయ్యే అవకాశాలున్నాయి. మేయర్ పదవి కోసం సన్నిషర్మిలా ప్యారీ, పూమణి, చల్లముత్తుల పోటీ పడుతున్నారు. ఇప్పటికే డిప్యూటీ మేయర్ గా చంద్రశేఖర్ పేరు ఖరారైందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కడప కార్పొరేషన్ లో 50 డివిజన్లుండగా..వైసీపీ 48 డివిజన్లు కైవసం చేసుకుంది. ఇప్పటికే మాజీ మేయర్ సురేష్‌బాబును రెండో పర్యాయం మేయర్ అభ్యర్థిగా సీఎం జగన్ ఇప్పటికే ఎంపిక చేశారు. దీంతో ఇక్కడ పోటీ లేకుండా సురేష్ బాబు మేయర్ కానున్నారు. కర్నూలు కార్పొరేషన్ లో 52 డివిజన్లు ఉన్నాయి. ఇక్కడ 41 డివిజన్లు వైసీపీ దక్కించుకుంది. దీంతో ఇక్కడ వైసీపీ సీనియర్ నేత బి. రామయ్య పేరు దాదాపు ఖరారు అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక, అనంతపురం కార్పొరేషన్ లో 50 డివిజన్లు ఉన్నాయి. ఇక్కడ వైసీపీ 48 వార్డులను కైవసం చేసుకుంది. అనంతపురం కార్పొరేషన్‌లో మేయర్ కుర్చీని ఆశిస్తున్న వారిలో మహాలక్ష్మి శ్రీనివాస్, చవ్వా రాజశేఖర్‌రెడ్డి, కోగటం విజయభాస్కర్‌రెడ్డి, మాజీ మేయర్ రాగే పరశురాం సతీమణి బండి నాగమణి పోటీలో ఉన్నారు. మేయర్ అభ్యర్థిగా మహాలక్ష్మి శ్రీనివాస్ వైపు వైసీపీ అధిష్టానం మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ మేయర్ రాగే పరశురాం స్థానిక ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. దీంతో ఆయన సతీమణి నాగమణి పేరు పరిశీలనకు వచ్చే అవకాశముంది.