Andhra News: జాతరలో అశ్లీల నృత్యాలు.. పోలీసుల ఎంట్రీతో సీన్ సితార్..!
అన్నమయ్య జిల్లాలో జరిగిన ఒక జాతరలో అశ్లీల నృత్యాలు కలకలం రేపాయి. భక్తితో జరుపుకునే జాతరలో అశ్లీల డ్యాన్స్‌లు ఏంటి..? అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కురబలకోట మండలం ముదివేడులో జరిగిన గ్రామదేవత జాతరలో ఏర్పాటు చేసిన అశ్లీల నృత్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

అన్నమయ్య జిల్లాలో జరిగిన ఒక జాతరలో అశ్లీల నృత్యాలు కలకలం రేపాయి. భక్తితో జరుపుకునే జాతరలో అశ్లీల డ్యాన్స్‌లు ఏంటి..? అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కురబలకోట మండలం ముదివేడులో జరిగిన గ్రామదేవత జాతరలో ఏర్పాటు చేసిన అశ్లీల నృత్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ నెల 19, 20 తేదీల్లో రెండు రోజులు పాటు జరిగిన గ్రామదేవత దండు మారెమ్మ జాతరకు పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకున్నా చాందినీ బండ్లపై అశ్లీల నృత్యాలు మాత్రం యథేచ్చగా కొనసాగాయి.. ముదివేడు పరిసర గ్రామాల ప్రజలు, ధర్మ కర్తలతో సమావేశం నిర్వహించి అనుమతులు ఇచ్చిన మదనపల్లి రూరల్ పోలీసులు చాందిని బండ్ల పై డీజే మోతను మాత్రం ఆపలేకపోయారు. గ్రామ దేవత జాతరలో చాందిని బండ్లను కట్టే వారిని 32 మందిని గుర్తించి పోలీసులు కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. అశ్లీల నృత్యాలతో ప్రదర్శనలు చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు వార్నింగ్ ఇచ్చినా.. దానిని బేఖాతరు చేశారు గ్రామస్థులు.. ముదివేడు జాతరలో చాందిని బండ్లపై శృతి మించిన అశ్లీల నృత్యాలు చేయించారు. పోటాపోటీగా డీజేలు ఏర్పాటు చేసి ఆధ్యాత్మిక సంబరాన్ని అశ్లీలంతో నింపారని గ్రామస్థులు కొందరు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
చాందిని బండ్లను విద్యుత్ కాంతులతో అలంకరించి.. డీజే ఏర్పాటు చేసి.. కొందరు యువతులతో డాన్సులు చేయిస్తూ రాత్రంతా గ్రామంలోని వీధుల్లో తిప్పారు. గ్రామంలోని యువత ఈ బండ్ల చుట్టూ చేరి.. నానా హంగమా చేశారు.. దీంతో మహిళలు బయటకు రాని పరిస్థితి ఏర్పడింది.
రంగంలోకి దిగిన పోలీసులు..
అయితే.. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగి చర్యలు ప్రారంభించారు. నలుగురి చేత అశ్లీల నృత్యాలు చేయించిన నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా 2 ట్రాక్టర్లు, డీజేలను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిర్వాహకులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు మదనపల్లి రూరల్ పోలీసులు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..