AP MLC Election Results 2023 Live: టీడీపీ అభ్యర్థి విజయం.. చంద్రబాబు ఇంటి వద్ద నేతల కోలాహలం..

| Edited By: seoteam.veegam

Updated on: Apr 08, 2023 | 1:09 PM

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. మరో గంటలోపు ఫలితాలు వెల్లడికానున్నాయి. అయితే, ఫలితాలపై ఇరుపక్షాల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఒక్కో అభ్యర్థి విజయానికి 22 ఓట్లు అవసరం అవగా.. ముందుగా మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ఉండనుంది. అవసరమైతేనే..

AP MLC Election Results 2023 Live: టీడీపీ అభ్యర్థి విజయం.. చంద్రబాబు ఇంటి వద్ద నేతల కోలాహలం..
Panchumarthi Anuradha

ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. మరో గంటలోపు ఫలితాలు వెల్లడికానున్నాయి. అయితే, ఫలితాలపై ఇరుపక్షాల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఒక్కో అభ్యర్థి విజయానికి 22 ఓట్లు అవసరం అవగా.. ముందుగా మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ఉండనుంది. అవసరమైతేనే రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించనున్నారు. అయితే, 7 సీట్లూ గెలుస్తామని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తుండగా.. క్రాస్‌ ఓటింగ్‌పైనే టీడీపీ ఆశలు పెట్టుకుంది. ఇక రెబల్ అభ్యర్థుల ఓట్లు ఈ ఎన్నికల్లో కీలకం కానున్నాయి. టీడీపీ రెబల్ ఓట్లు నాలుగు, జనసేన ఓటు వైసీపీకే పడనుండగా.. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి ఓట్లు ఎటుపడ్డాయనే విషయం ఉత్కంఠ నెలకొంది. మరోవైపు 16 మంది తమకు టచ్‌లో ఉన్నారంటూ టీడీపీ మైండ్ గేమ్ స్టార్ట్ చేసింది.

ఇదిలాఉంటే.. ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వందశాతం ఓటింగ్‌ నమోదైంది. బుడిగొండ అప్పలన్నాయుడు ఓటు వేశారు. ఎమ్మెల్యే ఎన్నికల పోలింగ్‌లో.. మిగిలిన 174మంది ఎమ్మెల్యేలు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎమ్మెల్యే అప్పలనాయుడు మాత్రం ప్రత్యేక విమానంలో విజయవాడ వచ్చారు. అక్కడి నుంచి బయల్దేరి అసెంబ్లీకి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

కాగా, ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఉత్కంఠ రేపాయి. ఉదయం పోలింగ్ ప్రారంభంకాగానే వైఎస్సార్‌‌సీపీ, టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 12.30 వరకు 174మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల వైఎస్సార్‌సీపీ నేత అప్పలనాయుడు తన కుమారుడి వివాహం ఉండటంతో ఆలస్యమైంది. దీంతో అప్పలనాయుడు వివాహ వేడుక పూర్తి చేసుకుని ప్రత్యేక విమానంలో విజయవాడకు వచ్చారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అసెంబ్లీకి చేరుకొని ఓటు వేశారు. దాంతో మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 23 Mar 2023 09:53 PM (IST)

    బెదిరించారు.. అయినా ధర్మమే గెలిచింది..

    ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించడంపై బోండా ఉమా స్పందించారు. ఎమ్మెల్సీ అభ్యర్థి కుటుంబ సభ్యులను బెదిరించారని, అయినా ధర్మమే గెలిచిందన్నారు. ఇకపై రాష్ట్రంలో ఎలాంటి ఎన్నికలు జరిగినా టీడీపీ విజయం ఖాయం అన్నారు బోండా ఉమ. ఒక ఎమ్మెల్సీ గెలవడం కోసం సీఎం జగన్.. టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టారని ఆరోపించారు. 70 సంవత్సరాలు పైబడిన బుచ్చయ్యను భయటపెట్టడానికి అసెంబ్లీలోనే కొట్టారని దుయ్యబట్టారు.

  • 23 Mar 2023 09:48 PM (IST)

    టీడీపీ రెబల్స్ వెనక్కి వచ్చి ఓటేసి ఉంటారు..: అచ్చెన్నాయుడు

    ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం అనంతరం చంద్రబాబు ఇంటి వద్దకు అచ్చెన్నాయుడు వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. కీలక కామెంట్స్ చేశారు. ‘మాకు 23 స్ధానాలు ఉన్నాయి. మా ఓట్లు మాకు వచ్చాయి. మా ఎమ్మెల్యేలు అందరిపై నిఘా పెట్టారు. ప్రలోభ పెట్టారు. టీడీపీ రెబల్స్ వెనక్కి వచ్చి ఓటేసి ఉంటారు. వాళ్ళలో కొందరు మాటతో మాట్లాడారు. ప్రజాస్వామ్య బద్ధంగా మాకు రావాల్సిన సీటుకు వారు పోటీ పెట్టారు. మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ వ్యాపారంపై ఎంక్వైరి పెట్టి భయాందోళనకి గురి చేశారు. ‘స్క్రిప్టు భగవంతుడు ఈరోజు తిరగరాశాడు. 23 తేదీ.. 2023 సంవత్సరం.. మాకు ఓట్లు 23..’ ప్రధమ ప్రాధాన్యత ఓట్లు మాకు 23 వచ్చాయి. అధికారులు పద్ధతి ప్రకారం ప్రకటించకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటారు. విందు రాజకీయాలు ఎప్పుడూ ఏపీ చరిత్రలో జరగలేదు. విందు రాజకీయాలతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. తామ పోటీ పెట్టడం వల్ల ఎమ్మెల్యేలను సీఎం దువ్వారు. మా నాయకులకు మూడు రోజులుగా నిద్ర లేకుండా చేశారు. ఇదే విషయంపై తమ అధినేత చంద్రబాబు స్టేట్ ఎలక్షన్ కమీషన్‌తో మాట్లాడారు.’ అని చెప్పుకొచ్చారు అచ్చెన్నాయుడు.

  • 23 Mar 2023 09:29 PM (IST)

    ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టడంలో బాబు సిద్ధహస్తుడు : కన్నబాబు

    ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్లో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి కురసాల కన్నబాబు.. చంద్రబాబుపై సంచలన కామెంట్స్ చేశారు. ఇది తమ ఓటమి గానీ, టీడీపీ గెలుపు గానీ కాదని వ్యాఖ్యానించారు. ఎన్నిక జరిగిన 7 ఎమ్మెల్సీ స్థానాల్లో వైఎస్సార్సీపీ 6 స్థానాల్లో గెలిచిందని, ఒకటి టీడీపీకి వచ్చిందన్నారు. ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టడంలో చంద్రబాబు సిద్ధహస్తుడని వ్యాఖ్యానించారు. తమకున్న సంఖ్య ప్రకారం 6 స్థానాలు గెలిచామన్నారు. వాళ్లకి 23 ఎమ్మెల్యేలు ఉన్నారని, కొంత మంది తమతో ప్రయాణం చేస్తున్నారు కాబట్టి తాము పోటీ పెట్టామన్నారు. ఇవన్నీ చంద్రబాబునాయుడు టక్కు టమారా విద్యలు అని వ్యాఖ్యానించారు కన్నబాబు. ఏం జరిగింది? ఎలా జరిగింది? అనే దానిపై తాము విశ్లేషించుకుంటామన్నారు. తాము ప్రాక్టీస్ చేశాం తప్ప ఎమ్మెల్యేలను పోచింగ్ చేయలేదన్నారు. అలాంటివి చంద్రబాబే చేశాడని విమర్శించారు కన్నబాబు. చంద్రబాబుకు ఓట్లు కొనడం ఇవాళేమీ కొత్త కాదని, ఆయన హైదరాబాద్ నుంచి పారిపోయి రావడానికి కారణం కూడా అదేనని అన్నారు. ‘మన వాళ్లు బ్రీఫ్డ్ మీ.. అంటూ చంద్రబాబు అక్కడ ఓటుకు రూ.5 కోట్లు ఇవ్వాలని చూసి పట్టుబడి పారిపోయి వచ్చాడు’ అని విమర్శించారు. తమ పార్టీ నుంచి ఎవరు ఓట్లు వేశారో విశ్లేషించుకుంటామని, పలానా వాళ్లు అని తేలితే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు కన్నబాబు. పార్టీని ధిక్కరించి ప్రతిపక్ష పార్టీకి ఓట్లు వేస్తే.. అది తెలిస్తే ఊరుకుంటారా..? అని అన్నారు. ‘విశ్లేషించుకుంటాం.. మా నాయకుడు ఆలోచిస్తారు... చేయాలో నిర్ణయం తీసుకుంటారు’ అని తెలిపారు కన్నబాబు.

  • 23 Mar 2023 09:25 PM (IST)

    డబ్బుల వల్లే టీడీపీ గెలిచింది.. సజ్జల షాకింగ్ కామెంట్స్..

    తమకు సంఖ్యా బలం ఉందనే పోటీ పెట్టామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. గురువారం నాడు మీడియాతో మాట్లాడిన సజ్జల.. ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలను తాము పరిగణనలోకి తీసుకోలేదన్నారు. టీడీపీ వాళ్లు ఎవరినో కొనుగోలు చేసినట్లున్నారని ఆరోపించారు. తమవైపు నుంచి చేయాల్సిన ప్రయత్నాలు చేశామన్నారు. డబ్బులు తప్ప టీడీపీ గెలవడానికి కారణాలేవీ కనిపించడం లేదన్నారు. టీడీపీ సొంతంగా 175 స్థానాలకు పోటీ చేయగలదా? అని ప్రశ్నించారు సజ్జల. చంద్రబాబు పగటి కలలు కంటున్నారని వ్యాఖ్యానించారు.

  • 23 Mar 2023 08:58 PM (IST)

    అనురాధ గెలుపు ప్రజావిజయం.. బాలకృష్ణ అభినందనలు..

    ఎమ్మెల్యేల కోటా నుంచి ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలో టిడిపి అభ్యర్ధి పంచుమర్తి అనురాధ విజయం సాధించడంపై టీడీపీ నేత, ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించారు. ఆమె విజయం ప్రజా విజయం అని పేర్కొన్నారు. ఆమె గెలుపు అన్నివర్గాల ప్రజల గెలుపు అని అన్నారు. ఇంతటి క్లిష్ట ఎన్నికల్లో అనురాధ సునాయాస గెలుపు స్ఫూర్తిదాయకం అని పేర్కొన్నారు బాలయ్య. మొన్న జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో మొత్తం 3స్థానాల్లో విజయం సాధించడం, ఇప్పుడు పోటీచేసిన ఒకే ఒక స్థానంలోనూ టిడిపి ఘనవిజయం అద్భుతం అని అన్నారు. చంద్రబాబు పోరాట స్ఫూర్తికి, లోకేశ్ యువగళోత్సాహానికి, టీడీపీ నాయకులు, కార్యకర్తల సమష్టి కృషికి ఈ వరుస విజయాలే నిదర్శనం అని పేర్కొన్నారు బాలకృష్ణ. ఇదే స్ఫూర్తితో పనిచేసి రాబోయే సాధారణ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీని విజయపథంలో నిలబెట్టడమే మనందరి కర్తవ్యం, రాష్ట్ర ప్రజల ఆకాంక్ష అని అన్నారు బాలయ్య.

  • 23 Mar 2023 07:46 PM (IST)

    టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద సంబరాలు..

  • 23 Mar 2023 07:13 PM (IST)

    పంచుమర్తి అనురాధ గురించి మీకు ఇవి తెలుసా?

    ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ అనూహ్య రీతిలో విజయం సాధించారు. ఈ విజయం ఏపీ పాలిటిక్స్‌లో సంచలనంగా మారింది. కాగా, టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలుపొందిన పంచుమర్తి అనురాధ.. అతి పిన్న వయసులోనే విజయవాడ మేయర్‌గా పదవి బాధ్యతలు చేపట్టారు. 2000 సంవత్సరంలో ఆమె విజయవాడ మేయర్‌గా పని చేశారు. ఆ తరువాత ఆమె ఆంధ్రప్రదేశ్ కో- ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్ పర్సన్ గా పనిచేశారు. ప్రస్తుతం టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆమె.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా 23 ఓట్లతో విజయం సాధించారు.

  • 23 Mar 2023 07:06 PM (IST)

    అనురాధకు ఓటేసిన వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరు?

    ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య ఫలితం వెలువడింది. టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలుపొందారు. వైసీపీ ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ వల్లే అనురాధ గెలుపు సాధ్యమయ్యిందనేది స్పష్టం అవుతోంది. అయితే, అనురాధకు ఓటేసిన వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరు? అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఓట్లు కలిపినా టీడీపీకి పడాల్సింది -21 ఓట్లు మాత్రమే. ఇంకా ఆ 2 ఓట్లు వేసిన వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరు? అనేది ఇంట్రస్టింగ్‌గా మారింది. ఇప్పటి వరకు జయమంగళ, కోలా గురువులకు చెరో 21 ఓట్లు పడ్డాయి. ఆ ఇద్దరికీ కేటాయించిన ఎమ్మెల్యేల్లోనే క్రాస్‌ఓటింగ్‌ జరిగినట్లు అర్థమవుతోంది.

  • 23 Mar 2023 07:04 PM (IST)

    ఆ ఇద్దరిలో గెలిచేదెవరు.. ఉత్కంఠగా 7వ ఫలితం..

    ఇప్పటి వరకు వెలువడిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ 5, టీడీపీ 1 గెలుపొందాయి. గెలిచే 7వ అభ్యర్థి ఎవరనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. రెండో ప్రాధాన్యతా ఓట్లతోనే తుది ఫలితం వెలువడనుంది. జయమంగళ, కోలాగురువులకు చెరో 21 ఓట్లు పడ్డాయి. దాంతో 2వ ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపు జరుగుతోంది. దాంతో జయమంగళ, గురువులులో గెలిచేదెవరు అనేది ఉత్కంఠగా మారింది.

  • 23 Mar 2023 06:56 PM (IST)

    హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్‌లో విజయోత్సవ వేడుకలు..

    ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేల కోటా ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అనురాధా విజయంపై టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఆమె విజయం.. తెలంగాణ టీడీపీ నేతల్లో నూతనోత్సాహాన్ని నింపింది. అనురాధ విజయాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్‌లో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు తెలంగాణ టీడీపీ నేతలు.

  • 23 Mar 2023 06:53 PM (IST)

    ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలుపు.. చంద్రబాబు ఇంటివద్ద నేతల కోలాహలం..

    ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అనురాధ గెలుపు.. ఆ పార్టీలో ఆనందాన్ని రెట్టింపు చేసింది. తాడేపల్లిలో ఉన్న అధినేత చంద్రబాబు నివాసానికిక ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు చేరుకుంటున్నారు. ఇప్పటికే చినరాజప్ప, మంతెన రామరాజు, గద్దె రామ్మోహన్ వంటి నేతలు చంద్రబాబు వద్దకు వచ్చారు.

  • 23 Mar 2023 06:45 PM (IST)

    ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం.. మిన్నంటిన టీడీపీ శ్రేణుల సంబరాలు..

    ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలుపొందారు. ఆమె గెలుపుతో టీడీపీ శ్రేణులు సంబరాలు చెసుకుంటున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు బాణాసంచా కాల్చి విజయాన్ని ఎంజాయ్ చేస్తుండగా.. ఇటు హైదరాబాద్‌ ఎన్టీఆర్ భవన్‌లోనూ విజయోత్సవ వేడుకలు నిర్వహించారు పార్టీ నేతలు, కార్యకర్తలు. కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయంతో ఏపీతో పాటు, తెలంగాణ టీడీపీ క్యాడర్‌లో నూతన ఉత్సాహం నెలకొంది.

  • 23 Mar 2023 06:29 PM (IST)

    ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య పరిణామం.. టీడీపీ అభ్యర్థి గెలుపు..

    ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలుపొందారు. ఆమెకు 23 ఓట్లు వచ్చాయి. వైసీపీ నుంచి క్రాస్ ఓటింగ్ జరిగినట్లుగా అనుమానిస్తున్నారు.

  • 23 Mar 2023 06:09 PM (IST)

    ఉత్కంఠ రేపుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్..

    ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. గంటలో 50 ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. ఏడవ సీటు ఎవరిది అన్న దానిపైనే టెన్షన్ నెలకొంది. సూర్య నారాయణకు-17 ఓట్లు, బొమ్మి ఇజ్రాయిల్-07 ఓట్లు, పంచుమర్తి అనురాధ-06 ఓట్లు, మర్రిరాజశేఖర్‌-13 ఓట్లు, చంద్రగిరి యేసురత్నం-07 ఓట్లు పడ్డాయి. ఇక వైసీపీ ఏజెంట్లుగా పేర్నినాని, శ్రీకాంత్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉండగా, టీడీపీ ఏజెంట్లుగా పయ్యావుల కేశవ్, రామానాయుడు ఉన్నారు. కాగా, టీడీపీ నాయకురాలు అనురాధకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి.. ఇజ్రాయెల్‌కి రెండో ప్రాధాన్యత ఓటేశారు ఓ ఎమ్మెల్యే.

  • 23 Mar 2023 05:18 PM (IST)

    7 ఎమ్మెల్సీ స్థానాలూ మావే.. మంత్రి బొత్స ధీమా..

    ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు తమదేనని మంత్రి బొత్స సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. 7 స్థానాల్లో తమ అభ్యర్థులు గెలుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకున్నా గెలుపు తద్యం అని అన్నారు. గురువారం నాడు మీడియాతో మాట్లాడిన బొత్స.. స్కూల్‌లో టీచర్ పోస్టులు ఖాళీ వుంటే భర్తి చేస్తామన్నారు. నిరుద్యోగులు అదైర్యపడవద్దని కోరారు. సబ్జెక్టుకు ఒక టీచర్ విదానం తెచ్చామని, 12,500 టీచర్ పోస్టుల భర్తీ చేపట్టామన్నారు. డీఎస్‌సీ పరిశీలన జరుగుతోందన్నారు. ఎన్ని ఖాళీలు వున్నాయో పరిశీలిస్తామని మంత్రి బొత్స తెలిపారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారంటూ టీడీపీ నేతలు అంటున్నారని, ఎంతసేపు ఆనందపడుతారో పడనివ్వండి అంటూ సెటైర్లు వేశారు మంత్రి బొత్స.

  • 23 Mar 2023 05:06 PM (IST)

    మొదలైన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్..

    ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. మరో గంటలోపు ఫలితాలు వెల్లడికానున్నాయి.  ఫలితాలపై ఇరుపక్షాల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Published On - Mar 23,2023 5:04 PM

Follow us