AP Rains: ఏపీకి మళ్లీ వర్షాలు.. ముఖ్యంగా ఆ జిల్లాలకు.! పూర్తి వివరాలు..
బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఆంధ్రప్రదేశ్, యానాం దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య, ఆగ్నేయ గాలులు వీస్తున్నాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఆంధ్రప్రదేశ్, యానాం దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య, ఆగ్నేయ గాలులు వీస్తున్నాయి. ద్రోణీ ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తాలో వానలు పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. ముఖ్యంగా బుధవారం బాపట్ల, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవచ్చునని అన్నారు. దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని చెబుతున్నారు.
గడిచిన రెండు రోజుల్లో కురిసిన వర్షాలకు.. తిరుపతి జిల్లాలోని వేంకటగిరిలో అత్యధికంగా 24.6 మిల్లీమీటర్లు.. అత్యల్పంగా రాయచోటిలో 10 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో.. ఏజెన్సీ గ్రామాల్లోని ప్రజలు చలితో గజగజగా వణికిపోతున్నారు. దట్టమైన పొగమంచు కారణంగా వాహనాల రాకపోకలకూ అంతరాయం ఏర్పడింది.