MPTC ZPTC Counting: ఏపీ పరిషత్ ఎన్నికల కౌంటింగ్‌పై ఇంకా సస్పెన్స్.. వచ్చే నెల 27న సమగ్ర విచారణ జరుపుతామన్న ధర్మాసనం
ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికల కౌంటింగ్‌పై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. వచ్చే నెల 27న సమగ్ర విచారణ జరుపుతామని స్పష్టం చేసింది.
AP High Court on MPTC ZPTC Counting: ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికల కౌంటింగ్‌పై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. గతంలో ఎన్నికలను రద్దు చేయాలన్న సింగిల్ జడ్జి బెంచ్ తీర్పుపై స్టే ఇచ్చింది డివిజన్ బెంచ్. అయితే,జిల్లా , మండల పరిషత్ నిర్వహించిన ఎన్నికల కౌంటింగ్ జరపాలా? లేదా? అన్న దానిపై మాత్రం ధర్మాసనం ఇంకా ఎలాంటి తీర్పు చెప్పలేదు. వచ్చే నెల 27న సమగ్ర విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. దీంతో అప్పటి వరకు పరిషత్ ఎన్నికలపై సస్పెన్స్ తప్పదు. పోలింగ్ జరిగిన తర్వాత ఆ ఎన్నికలను రద్దు చేయాలన్న సింగిల్ జడ్జి బెంచ్ తీర్పుపై అప్పీల్‌కు వెళ్లింది రాష్ట్ర ఎన్నికల సంఘం. దానిపైనే ఇవాళ రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత అందులో జోక్యం చేసుకోవడం సరికాదంటూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రస్తావిస్తోంది ఎస్ఈసీ.
ఆంధ్రప్రదేశ్ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది ఎస్ఈసీ. పోలింగ్ తేదీకి 4వారాల ముందు ఎలక్షన్ కోడ్ విధించాలన్న సుప్రీంకోర్ట్ ఆదేశాలకు విరుద్ధంగా మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చిందంటూ తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య కోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి.. ఏప్రిల్ 8న జరగనున్న ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేస్తూ 6న మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం అప్పీల్ దాఖలు చేసింది.
కాగా, వారం రోజుల క్రితం డిలే పిటిషన్ దాఖలు చేసిన ఎసీఈసీ.. నిన్న పూర్తి స్థాయి పిటిషన్ ఫైల్ చేసింది. ఇవాళ ఎస్ఈసీ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేపట్టింది ధర్మాసనం. అయితే వచ్చే నెల 27న సమగ్ర విచారణ జరుపుతామని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో అప్పటి వరకు పరిషత్ ఎన్నికలపై డివిజన్ బెంచ్ ఇవ్వబోయే తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.