Andhra Pradesh: ఏపీ హైకోర్టులో వైసీపీ నేతలకు చుక్కెదురు.. బెయిల్ పిటిషన్‌ కొట్టివేత

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వైసీపీ నేతలకు చుక్కెదురయింది. టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో.. ముందస్తు బెయిల్‌ కోసం వైసీపీ నేతలు వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. 2021లో మంగళగిరి టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో.. దేవినేని అవినాష్, నందిగం సురేష్, అప్పిరెడ్డి, తలశిల రఘురామ్ సహా 14మంది నిందితులుగా ఉన్నారు.

Andhra Pradesh: ఏపీ హైకోర్టులో వైసీపీ నేతలకు చుక్కెదురు.. బెయిల్ పిటిషన్‌ కొట్టివేత
AP High Court
Follow us

|

Updated on: Sep 04, 2024 | 6:55 PM

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వైసీపీ నేతలకు చుక్కెదురయింది. టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో.. ముందస్తు బెయిల్‌ కోసం వైసీపీ నేతలు వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. 2021లో మంగళగిరి టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో.. దేవినేని అవినాష్, నందిగం సురేష్, అప్పిరెడ్డి, తలశిల రఘురామ్ సహా 14మంది నిందితులుగా ఉన్నారు. వీరంతా తమను అరెస్ట్ చేయకుండా.. ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు. దీంతో.. వారి అభ్యర్థనను తోసిపుచ్చింది. కనీసం సుప్రీంకోర్టుకు వెళ్లే వరకు 2 వారాల పాటు.. తమను అరెస్ట్‌ చేయవద్దని కోరారు వైసీపీ నేతలు. అరెస్ట్ నుంచి మినహాయింపు ఇవ్వొద్దని.. టీడీపీ తరపు లాయర్లు వాదనలు వినిపించారు. రెండు వర్గాల వాదనల తర్వాత.. మధ్యంతర ఉత్తర్వుల అభ్యర్థనను తిరస్కరించింది హైకోర్ట్. బెయిల్‌ పిటిషన్లు డిస్మిస్‌ చేసిన తర్వాత.. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది.

మరోవైపు చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మాజీమంత్రి జోగి రమేష్ పిటిషన్ కూడా తిరస్కరించింది హైకోర్ట్. ముందస్తు బెయిల్‌ ఇవ్వడం కుదరదని తీర్పునిచ్చింది హైకోర్ట్. దీంతో జోగి రమేష్‌తో పాటు.. టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.

మరోవైపు.. హైకోర్టు తీర్పు నేపథ్యంలో మాజీ ఎంపీ నందిగాం సురేష్‌ను అరెస్ట్ చేసేందుకు ఆయన ఇంటికి వెళ్లారు పోలీసులు. ఆయన ఇంట్లో లేరని అక్కడి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వెనుదిరిగి వెళ్లిపోయారు. హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేయడంతో సురేష్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో.. ఆయన ఎక్కడకు వెళ్లారనే దానిపై పోలీసులు నిఘా పెట్టారు. టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో.. మిగతా నిందితులను కూడా అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

ప్రభుత్వం కావాలనే కేసులతో వేధిస్తుందని వైసీపీ నాయకులు అంటున్నారు. ప్రజా సమస్యలు ప్రస్తావించకుండా.. ప్రతిపక్ష పార్టీల నాయకుల్ని జైలుకు పంపడమే పనిగా పెట్టుకున్నారని విమర్శిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..