Amaravathi: కలల రాజధాని నిర్మాణానికి వేగంగా అడుగులు.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
A అంటే అమరావతి.. P అంటే పోలవరం అంటున్న ఏపీ ప్రభుత్వం.. ఐదేళ్లలో ఎట్టి పరిస్థితుల్లోనూ వాటి నిర్మాణం పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా అమరావతి పనులపై తాజాగా క్లారిటీ ఇచ్చారు మంత్రి నారాయణ.
కలల రాజధానికి ఇంకెంత దూరం అని ఎదురుచూస్తున్న వారికి ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది. డిసెంబర్ నుంచి అన్ని రకాల పనులు మొదలయ్యేలా యాక్షన్ ప్లాన్ కనిపిస్తోంది. నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందుతుండడంతో వేగంగా నిర్మాణాలు పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. అందులో భాగంగానే అమరావతిలో నిర్మాణాలకు కొత్త టెండర్లు పిలవనున్నారు. అంతేకాదు… రాజధానిపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
అమరావతికి కొత్త కళ వస్తోంది. దాదాపుగా జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తి కావడంతో.. అమరావతి రాజధాని యథాస్థానానికి చేరుకోనుంది. డిసెంబర్ నుంచి అమరావతి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించాలని సీఎం చంద్రబాబు డిసైడ్ అయ్యారు. ఇప్పటికే అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 15 వేల కోట్ల రూపాయల సాయాన్ని బడ్జెట్‌లో ప్రకటించింది. ప్రపంచ బ్యాంకు నిధుల నుంచి సర్దుబాటు చేయించింది. ఈ నిధులు సైతం త్వరలోనే విడుదల కానున్నాయి. దీంతో అమరావతిలో నిర్మాణాలకు టెండర్లు పిలవనున్నాయి. డిసెంబర్ నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణాల కోసం జనవరి నెలాఖరులోపు టెండర్లు పిలుస్తామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. సీడ్ క్యాపిటల్ నిర్మాణానికి సింగపూర్‌ను సంప్రదించాలా..?, వద్దా అని ఆలోచిస్తున్నామని చెప్పారు. 360 కిలో మీటర్ల మేర రోడ్లకు టెండర్లు పూర్తి చేస్తామన్న ఆయన.. అమరావతిలో 18 టవర్లలో 432 అపార్ట్ మెంట్ల పూర్తికి రూ.524 కోట్లు విడుదల చేశామని తెలిపారు. అమరావతిపై వర్షాలు, వరదల ప్రభావం ఉంటుందన్న ప్రచారం జరుగుతున్న వేళ.. వాటన్నింటిని కొట్టిపడేశారు మంత్రి నారాయణ. ఎంత ఫ్లడ్ వచ్చినా అమరావతిపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. వరదలు రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతిపక్షాల ఆరోపణలు అవాస్తవమన్నారు. మొత్తంగా… ప్రపంచస్థాయి నగరంగా అమరావతిని తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్న ఏపీ సర్కార్.. పనులను మరింత స్పీడప్ చేస్తోంది.
వీడియో చూడండి…
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..