చెరకు ఫ్యాక్టరీల్లో ఉద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త.. దసరా కల్లా జీతాల చెల్లింపుకు.!

దసరా కల్లా చక్కెర ఫ్యాక్టరీలలోని ఉద్యోగుల జీతాల చెల్లింపులకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు.

చెరకు ఫ్యాక్టరీల్లో ఉద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త.. దసరా కల్లా జీతాల చెల్లింపుకు.!
Ap Government
Follow us

|

Updated on: Sep 30, 2021 | 9:00 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అందించింది. చెరకు ఫ్యాక్టరీల్లో పని చేస్తోన్న ఉద్యోగుల జీతాల చెల్లింపులను విజయదశమిలోగా పూర్తి చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తోందని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. తాజాగా మంత్రివర్గ ఉపసంఘం వర్చువల్‌గా సమావేశమై చెరకు ఫ్యాక్టరీల సమస్యలు, పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు మేకపాటి గౌతమ్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, కన్నబాబు సహా వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, షుగర్స్ డైరెక్టర్ వెంకట్రావ్ తదితరులు పాల్గొన్నారు.

హైకోర్టు తీర్పుతో చెరకు రైతులకు ఎంతో మేలు జరుగుతుందని మంత్రి అన్నారు. అలాగే చెరకు రైతుల బకాయిల చెల్లింపుకు తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లుగా స్పష్టం చేశారు. అటు అక్టోబర్ 5వ తేదీన జరగబోయే టెండర్ ప్రక్రియ గురించి ఆరా తీసిన మంత్రి.. హైకోర్టు నుంచి స్టే తీసుకొచ్చేందుకు కృషి చేసిన ఉన్నతాధికారులకు అభినందనలు తెలిపారు. చెరకు రైతుల సమస్యలు, చక్కెర ఫ్యాక్టరీల ఉద్యోగుల జీతాల చెల్లింపులు తదితర అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి.. ఆ తర్వాత వాటిపై స్పష్టత తీసుకురావాలని సమాలోచనలు జరిపారు. అలాగే టెండర్ తర్వాత మరోసారి భేటి కావాలని నిర్ణయానికి వచ్చారు. అటు చక్కెర అమ్మకాలను వేగంగా పూర్తి చేసేందుకు షుగర్స్ డైరెక్టర్, కమిషనర్‌తో పాటు ఒక ఉన్నతాధికారిని ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

చక్కెర ఫ్యాక్టరీల ఇబ్బందులు, చెరకు రైతులు సమస్యలు, ఫ్యాక్టరీల ఉద్యోగుల జీతాల వంటి సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రులు తెలిపారు. చక్కెర అమ్మకాలు, వీఆర్ఎస్ స్కీమ్ అమలు సహా మంత్రివర్గ ఉపసంఘ నిర్ణయాలు ఆర్థిక శాఖతో ముడిపడి ఉన్నాయని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు. ఆప్కోబ్ బకాయిల మొత్తంపైనా మంత్రి కన్నబాబు వివరాలు అడిగి తెలుసుకున్నారు. చక్కెర అమ్మకాల మొత్తంలో ముందు రైతులకు చెల్లించేందుకే ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతగా తీసుకుందని మంత్రి వర్గ ఉపసంఘం వెల్లడించింది. అనంతరం ఉద్యోగులకు జీతాల బకాయిలను చెల్లించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు స్పష్టం చేశారు.

Latest Articles