AP New Variant Virus: ఏపీలో కొత్త వైరస్ గుబులు.. వివరణ ఇచ్చిన రాష్ట్ర సర్కార్.. పాతదే కానీ వేగంగా వ్యాప్తి చెందుతుందన్న జవహర్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రకం కరోనా వైరస్ వ్యాప్తిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. కొత్త రకం వైరస్ అనవాళ్లు లేవని వివరణ ఇచ్చింది. బి.1.617 తోపాటు బి1 సంబంధించిన వైరస్ మాత్రమే రాష్ట్రంలో ఉన్నట్లు..

AP New Variant Virus: ఏపీలో కొత్త వైరస్ గుబులు.. వివరణ ఇచ్చిన రాష్ట్ర సర్కార్.. పాతదే కానీ వేగంగా వ్యాప్తి చెందుతుందన్న జవహర్ రెడ్డి
Ks Jawahar Reddy

AP Government Clarifies on Virus: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రకం కరోనా వైరస్ వ్యాప్తిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. కొత్త రకం వైరస్ అనవాళ్లు లేవని వివరణ ఇచ్చింది. బి.1.617 తోపాటు బి1 కు సంబంధించిన వైరస్ మాత్రమే రాష్ట్రంలో ఉన్నట్లు.. ఏప్రిల్ నెల డేటా ఆధారంగా దీన్ని గుర్తించామని, ఇది చాలా తొందరగా వ్యాప్తి చెందుతోందని ఏపీ స్టేట్ కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ చైర్మన్ కేఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. ఏపీలో కొత్తగా వెలుగుచూసిన N440K వేరియెంట్ ప్రమాద ఘంటికలు మోగిస్తోందన్న వార్తలు రాష్ట్ర ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. కర్నూలు జిల్లాలో నమోదైన ఈ కొత్త రకం వైరస్ ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా శరవేగంగా విస్తరిస్తోందని వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే దీనిపై కేఎస్ జవహర్ రెడ్డి మీడియా సమావేశంలో వివరణ ఇచ్చారు. గత ఏడాది జూన్, జులై‌లో ఈ స్ట్రెయిన్‌ను ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు నమూనాలు నుంచి సీసీఎంబీ గుర్తించిందని తెలిపారు.

‘ఏపీ లో 2021 ఫిబ్రవరి వరకు కనిపించి క్రమంగా తగ్గిందన్న ఆయన.. ఇప్పుడు ఈ రకం వైరస్‌ను చాలా తక్కువ‌గా గుర్తిస్తున్నామన్నారు. ప్రస్తుతం సౌత్ ఇండియా నమూనాలు నుంచి బి.1.617 తోపాటు బి1 గుర్తించామన్నారు. ఏప్రిల్ నెల డేటా ఆధారంగా దీన్ని గుర్తించామని తెలిపారు. ఇది చాలా తొందరగా వ్యాప్తి చెందుతోందని గ్రహించామన్నారు. ఇది ముఖ్యంగా అన్ని వయస్కులతో పాటు యువకుల్లో సైతం దీని వ్యాప్తి అధికం ఉంటుందని జవహర్ రెడ్డి తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా బి.1.617ను వేరియెంట్ ఆఫ్ ఇంటరెస్ట్‌గా ప్రకటించిందన్నారు.. అయితే ఎన్440కే పై ఎలాంటి ప్రస్తావన చేయలేదని జవహర్ రెడ్డి వెల్లడించారు.

మరోవైపు, ఏపీలో కొత్త రకం వైరస్ లేదని కేంద్ర బయో టెక్నాలజీ శాఖ కార్యదర్శి రేణూస్వరూప్‌ స్పష్టం చేశారు. దేశంలో కొత్తగా గుర్తించిన బి167 మినహా కొత్త రకం వైరస్‌ ఎక్కడా లేదన్నారు. ఈ మధ్యకాలంలో బి 618 రకం కనుగొన్నప్పటికీ అది త్వరగా కనుమరుగైందని రేణూస్వరూప్‌ పేర్కొన్నారు. ఎన్‌ 440కే వైరస్‌ ప్రభావం దేశంలో ఎక్కడా కనిపించలేదని స్పష్టం చేశామని.. దేశంలో బి167 వైరస్‌ ప్రభావమే ఉందని కేంద్ర బయోటెక్నాలజీశాఖ కార్యదర్శి పేర్కొన్నారు.

ఇదిలావుంటే, కర్నూలు జిల్లాలో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదు అవుతున్నాయి. కర్నూలు జిల్లాలో రెండో వేవ్ లో మాత్రం వైరస్‌ ప్రభావం తీవ్రంగా ఉండటంతో చిన్నా, పెద్దా తేడా లేకుండా కుటుంబం మొత్తం కరోనా బారిన పడుతున్నారు. జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు వెయ్యికి చేరగా.. కరోనా వల్ల 15 మంది మరణించారు. జిల్లాలోని శ్రీశైలం మండలంలో మరోసారి కరోనా కేసులు భారీగా పెరిగిపోయాయి. శ్రీశైలం మండలంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 109 కరోనా కేసులు నమోదయ్యాయి. శ్రీశైలం, సున్నిపెంటలో కరోనా కేసుల సంఖ్య 1,160కి చేరుకుంది.

ప్రస్తుతం కరోనా రెండో వేవ్ జిల్లాలో వేగంగా విస్తరిస్తోంది. ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు నెల రోజుల వ్యవధిలో 27వేల పైగా కేసులు నమోదయ్యాయంటే తీవ్రత అర్థం చేసుకోవచ్చు. మహమ్మారితో జిల్లాలో నెల రోజుల్లో 79 మరణాలు చోటు చేసుకున్నాయి. నమోదవుతున్న కేసుల్లో 5% నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపుతున్నారు. కాగా, కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో కర్ఫ్యూను పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్‌ వీరపాం డియన్‌, ఎస్పీ ఫక్కీరప్ప అధికారులను ఆదేశించారు. కర్ఫ్యూ అమలు, నిత్యావసర సరుకుల పంపిణీపై కలెక్టర్‌, ఎస్పీ సమీక్ష నిర్వహించారు. దేశంలో అత్యంత వేగంగా కోవిడ్ వ్యాప్తి చెందుతున్న జిల్లాలో కర్నూలు 30వ స్థానంలో ఉంది.

Read Also….  AP Corona: డబ్బులు కట్టి చేరినప్పటికీ క‌నీస వైద్యం అందించ‌డం లేదు.. డిప్యూటీ తహ‌సీల్ధార్ వీడియో వైర‌ల్