Andhra Pradesh: సోషల్ మీడియాలో ప్రచారాన్ని నమ్మెద్దు.. ఏపీలో పెట్టుబడులపై పరిశ్రమల శాఖ క్లారిటీ..

ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామికాభివృద్ధిపై రకరకాల వ్యక్తిగత అభిప్రాయాలతో మీడియా, సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆ రాష్ట్ర పరిశ్రమల శాఖ తెలిపింది. అటువంటి అసత్య ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు..

Andhra Pradesh: సోషల్ మీడియాలో ప్రచారాన్ని నమ్మెద్దు.. ఏపీలో పెట్టుబడులపై పరిశ్రమల శాఖ క్లారిటీ..
AP Government
Follow us

| Edited By: Shaik Madar Saheb

Updated on: Nov 03, 2022 | 4:20 PM

ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామికాభివృద్ధిపై రకరకాల వ్యక్తిగత అభిప్రాయాలతో మీడియా, సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆ రాష్ట్ర పరిశ్రమల శాఖ తెలిపింది. అటువంటి అసత్య ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు తెలిపింది. ఈమేరకు ఆంధ్రప్రదేశ్‌ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రానికి ఒక్క పెట్టుబడి కూడా రాలేదని వస్తున్న ఆరోపణలు, వార్తలు పూర్తిగా అవాస్తవమని, రూ. 17 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయని చెప్పడం కూడా నిరాధారమని పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో స్థిరమైన పారిశ్రామికాభివృద్ధి దిశగా వాణిజ్య సంస్కరణలను అమలు చేస్తూ క్రియాశీలకంగా అడుగులేస్తోందని తెలిపింది. ప్రభుత్వం ఏపీకి తరలివస్తోన్న పెట్టుబడుల ప్రతిపాదనలను పరిశ్రమలు స్థాపనలుగా మలుచుకుంటూ ముందుకు సాగుతోందని చెప్పింది. కొత్త ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన తర్వాత పెట్టుబడుల ప్రవాహం పరుగులు పెడుతోందని ప్రకటనలో ఏపీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. జూన్, 2019 నాటి నుంచి నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ కి 107 మెగా పరిశ్రమలు వచ్చాయని, వీటి ద్వారా రూ. 46,002 కోట్ల పెట్టుబడులు ఏపీకి వచ్చినట్లు తెలిపింది. గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలు ( ఎమ్ఎస్ఎమ్ఈ)లు రెట్టింపు స్థాయిలో ఏపీలో స్థాపించబడ్డాయని పేర్కొంది. గత మూడున్నరేళ్ళ కాలంలో మొత్తం 1,06,249 ఎమ్ఎస్ఎమ్ఈలు రాష్ట్రానికి వచ్చాయని, తద్వారా రాష్ట్రానికి రూ.14,656 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు తెలిపింది. 7,22,092 మందికి ఉపాధి అవకాశాలు కూడా రానున్నాయని వెల్లడించింది. మరో 57 మెగా పరిశ్రమలు పైప్ లైన్ లో ఉన్నాయిని, వీటి ద్వారా భవిష్యత్ లో రూ.91,243.13 కోట్ల పెట్టుబడులు, 1,09,307 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. మరో నాలుగు భారీ పీఎస్ యూ పరిశ్రమల ద్వారా కూడా రూ. 1,06,800 కోట్ల పెట్టుబడులతో పాటు, 79,200 మందికి ఉద్యోగాలు రానున్నాయని వెల్లడించింది.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఎస్ఐపీబీ (స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు) ద్వారా రూ.1,73,021.55 కోట్ల పెట్టుబడులు, 1,38,403 మందికి ఉద్యోగాలందించే 45 లార్జ్, మెగా పరిశ్రమలకు ప్రత్యేకంగా ప్రోత్సాహకాలందించనున్నామని ఏపీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. కియా అనుబంధ సంస్థలు చెన్నై, హైదరాబాద్ వెళ్లిపోయాయని వచ్చిన వార్తలు కూడా అవాస్తవమని, శ్రీ సత్యసాయి జిల్లాలోనే కియా అనుబంధ పరిశ్రమలన్నీ కొలువుదీరాయని తెలిపింది. కియా పరిశ్రమ అదనంగా రూ.400 కోట్లతో విస్తరణ పనులు చేపట్టిందని స్పష్టం చేసింది.

అదానీ డేటా సెంటర్ కోసం విశాఖపట్నంలో ప్రభుత్వం భూములను కేటాయించిందని, త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా విశాఖపట్నం మధురవాడలో శంకుస్థాపన జరగనున్న అదానీ డేటా సెంటర్ (ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ పార్క్ లేదా బిజినెస్ పార్క్) ద్వారా రూ.14,634 కోట్ల పెట్టుబడులు, 24,990 మందికి ఉద్యోగాలు రానున్నాయని ప్రకటించింది. విశాఖ రుషికొండ ఐ.టీ సెజ్ నుంచి ఏ కంపెనీ తరలిపోలేదని క్లారిటీ ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

లులూ, ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ సంస్థలు ప్రభుత్వానికి చెందిన రూ. వేలకోట్ల విలువైన భూములను తీసుకుని నిర్దేశించిన గడువులోగా ఆ ప్రాజెక్టు పనులు చేపట్టకపోగా ఆ భూములను నిరుపయోగంగా ఉంచడం జరిగిందని, ఒప్పందం అతిక్రమించి ప్రతిపాదించిన ప్రాజెక్టును అమలు చేయని ఆ కారణంగా నిబంధనల ప్రకారమే ప్రభుత్వం ఆ భూములను వెనక్కు తీసుకుందని తెలిపింది. ఈ కారణాలతోనే లులూ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వంటి సంస్థలతో ఒప్పందాలు రద్దయ్యాయని వెల్లడించింది. గత ప్రభుత్వం ప్రకాశం జిల్లాలో ఏర్పాటు కావలసిన ఏషియన్ పల్స్ పేపర్ పరిశ్రమకు సంబంధించిన ఒప్పందం చేసుకుని అదే ప్రభుత్వం వివిధ సాంకేతిక కారణాలతో ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. పైగా గత ప్రభుత్వం సదరు పేపర్ మిల్లుకి సంబంధించి ఎటువంటి అధికారిక జీవోను కూడా జారీ చేయలేదని తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలోకి ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయని, కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్నాయని, ఎంతో మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని ఏపీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..