Andhra Pradesh: రహస్య స్నేహం బయటపడింది.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు..
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అసత్యాలను ప్రచారం చేస్తూ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. చంద్రబాబు నాయుడు..
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అసత్యాలను ప్రచారం చేస్తూ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. చంద్రబాబు నాయుడు ఓ కృత్రిమ ఉద్యమం నడిపిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలంటూ రాజధాని గ్రామాల రైతుల మహాపాదయాత్ర ఓ వైపు జరుగుతుంటే.. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం వికేంద్రీకరణకు తాము కట్టుబడి ఉన్నామని వైసీపీ ప్రభుత్వం చెప్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి రాజధాని అంశంపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. వైజాగ్ నుండి పరిపాలన చేస్తామని, కోర్టు ఆదేశాల మేరకు పరిపాలన ఎంత త్వరగా సాధ్యమైతే అంత త్వరగా విశాఖపట్టణం నుండి ప్రారంభిస్తామని తెలిపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకటేనని తాము ఎప్పటినుంచో చెబుతున్నామని, రహస్యంగా ఉన్న వాళ్ళే ఇప్పుడు బయట కొచ్చారన్నారు. గత ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు జగన్ వైపు రాకూడదనే వారు విడివిడిగా పోటీ చేశారన్నారు.
ఎన్నికల దగ్గర లో లేవని, అయితే తొందరలో ఎన్నికలు వస్తున్నాయంటూ చంద్రబాబు చెబుతున్నారని అన్నారు. నటుడు వల్ల ఓట్లు వస్తాయని అనుకుంటున్నారని, పవన్ ఉంటే నాయకులు నిలబడతారనే భ్రమలో ఉంచుతున్నారని అన్నారు. బిజెపి నుండి కమ్యూనిస్టు ల వరకూ అందరిని కలిపి జగన్ ను అధికారంలో నుండి దించాలనే చంద్రబాబు నాయుడు చూస్తున్నారంటూ విమర్శించారు. టీడీపీ, జనసేన ముసుగు తొలగిపోయిందన్నారు. ప్రజల్లో లేని నాయకుడు అధికారంలోకి రావాలని చూస్తున్నారని చంద్రబాబునాయుడును ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.
మూడు రాజధానులను తాము ఎన్నికల్లో గెలిపించే ఎజెండా గా చూడటం లేదని, ఆచరణ సాధ్యం కాని అమరావతి నిర్మాణంతో అధిక నిధులు ఖర్చు పెట్టలేక సమగ్రాభివృద్ధి కోసమే మూడు రాజధానులు అంటున్నామన్నారు. రియల్ ఎస్టేట్ ద్వారా వేల కోట్లు సంపాదించాలనుకున్న చంద్రబాబు నాయుడు , వారి బినామీల ఆలోచన సాధ్యం కాలేదన్నారు. చంద్రబాబు నాయుడు ఐదేళ్ళలో కరకట్ట వేయలేకపోయారని విమర్శించారు సజ్జల రామకృష్ణారెడ్డి. విశాఖపట్టణం నుంచి వీలైనంత త్వరలోనే పరిపాలనను ప్రారంభిస్తామన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతీ హామిని నెరవేర్చిన వ్యక్తి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..