AP Rains: ‘అసెంబ్లీకి రాకపోయినా పర్లేదు.. అక్కడ పర్యటించండి’.. మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం జగన్ ఆదేశాలు
వరద తగ్గడం లేదు. వర్షాలు ఆగడం లేదు. ఆ నాలుగు జిల్లాల్లో జనజీవనం స్తంభించిపోయింది. రవాణా వ్యవస్థ అతలాకుతలమైంది. ఈ నేపథ్యంలో.. ఆయా జిల్లాల్లోని మంత్రులు, ఇంచార్జ్ మినిస్టర్లు, ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్
వరద తగ్గడం లేదు. వర్షాలు ఆగడం లేదు. ఆ నాలుగు జిల్లాల్లో జనజీవనం స్తంభించిపోయింది. రవాణా వ్యవస్థ అతలాకుతలమైంది. ఇప్పుడు కుండపోత వానలు ప్రకాశం, గుంటూరు జిల్లాలనూ తడిసి ముద్ద చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ఆయా జిల్లాల్లోని మంత్రులు, ఇంచార్జ్ మినిస్టర్లు, ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ.. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని.. బాధితులను ఆదుకునేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం జగన్. ఇందుకోసం అసెంబ్లీ సమావేశాలకు సైతం హాజరు కావాల్సిన అవసరం లేదని సూచించారు. వరద మిగిల్చిన నష్టంపై పక్కాగా అంచనాలు సిద్ధం చేయాలన్నారు. గ్రామాల్లో రేషన్ సరుకుల పంపిణీ పకడ్బందీగా జరగాలన్నారు. పట్టణాల్లో పారిశుద్యం, డ్రైనేజీల పూడికతీత పనులతో పాటు అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య సదుపాయాలు కల్పించాలన్నారు సీఎం జగన్.
ప్రకాశం జిల్లాను ముంచెత్తుతున్న వర్షాలు…
ప్రకాశం జిల్లాను కూడా వర్షాలు ముంచెత్తుతున్నాయ్. పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు దంచికొడుతున్నాయ్. పర్చూరు నియోజకవర్గంలో రెండ్రోజులుగా కురుస్తోన్న వర్షాలతో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయ్. జిల్లాలో కురుస్తోన్న భారీ వర్షాలతో అనేకచోట్ల హైవేలు, ప్రధాన రహదారులు కోతకు గురవుతున్నాయి. మార్టూరు-డేగర్లమూడి మధ్య 13వ నేషనల్ హైవే కాలువలా మారింది. వాగు వంతెనపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి.
యద్దనపూడి మండలం పోలూరు దగ్గర పర్చూరు వాగు పొంగి పొర్లుతోంది. ఇంకొల్లు మండలంలో మూడు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయ్. పూసపాడు దగ్గర కప్పలవాగు… దగ్గుబాడు దగ్గర అలుగు వాగు… దుద్దుకూరు దగ్గర చిన్న వాగు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయ్. వాగులు ఉప్పొంగడంతో ఒంగోలు-పర్చూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. చెన్నై జాతీయ రహదారిని వరద ముంచెత్తడంతో మేదరమెట్ల దగ్గర వాహనాలను నిలిపిస్తున్నారు పోలీసులు. అలాగే, నెల్లూరు దగ్గర హైవే కోతకు గురికావడంతో అద్దంకి-నార్కెట్‌పల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
సంతమాగులూరు అడ్డరోడ్డు దగ్గర కూడా వరద పోటెత్తుతోంది. దాంతో, ఇక్కడ కూడా వాహనాలను నిలిపివేస్తున్నారు. హైవే కోతకు గురవడంతో చెన్నై వెళ్లాల్సిన వాహనాలను కడప మీదుగా దారి మళ్లిస్తున్నారు. రాగల 72గంటల్లో కుండపోత వర్షాలు ముంచెత్తుతాయన్న వాతావరణశాఖ వార్నింగ్స్‌తో ప్రకాశం జిల్లాలో యంత్రాంగం అలర్ట్ అయ్యింది. ఎక్కడికక్కడ ముందుజాగ్రత్తలు చేపడుతున్నారు. అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటికి రావాలంటూ ప్రజలకు సూచిస్తున్నారు.
నెల్లూరు జిల్లాలో వరుణుడి విధ్వంసం
నెల్లూరు జిల్లాలో వరుణుడి విధ్వంసం కొనసాగుతోంది. జిల్లా అంతటా వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయ్. కుండపోత వర్షాలకు ఊళ్లూ ఏర్లు ఏకమవుతున్నాయ్. అసలు ప్రజలు ఊర్లో ఉన్నారా? లేక చెరువులో ఉన్నారా? అన్నంతగా గ్రామాలను వరదలు ముంచెత్తుతున్నాయ్. ఉగ్రరూపం దాల్చిన పెన్నానది ప్రజలను భయపెడుతోంది. పెన్నాతోపాటు ఉప నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో జిల్లా ప్రజలు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. స్వర్ణముఖి, కాలంగి, పంబలేరు వాగులు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గూడూరు హైవేపై ఇప్పటికీ వరద ప్రవాహం కొనసాగుతోంది. సోమశిల జలాశయానికి వరద ఉధృతికి కంటిన్యూ అవుతుండటంతో లోతట్టు ప్రాంతాలు ఇప్పటికీ ముంపులోనే ముగ్గుతున్నాయ్.
వరద బీభత్సానికి రోడ్లకు రోడ్లే కొట్టుకుపోతున్నాయ్. జాతీయ రహదారులు సైతం కోతకు గురవుతున్నాయ్. చెన్నై-విజయవాడ హైవేను వరద నీరు ముంచెత్తడతో రాకపోకలు నిలిచిపోయాయి. దాంతో, జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి
Also Read: Telangana: బైక్‌పై వెళ్తుండగా ఆగిన గుండె.. క్షణాల్లోనే ఊపిరి పోయిన వైనం.. Watch Video
మైక్ టైసన్ గురించి సంచలన సీక్రెట్.. రింగ్‌లోకి దిగటానికి ముందు శృంగారం.. అదీ ఒకరిద్దరితో కాదు..