AP EAPCET 2023: ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్‌కు పోటెత్తిన దరఖాస్తులు.. పరీక్షలను మరో రోజుకు పొడిగింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఏపీ ఈఏపీ సెట్–2023కు భారీగా దరఖాస్తులు అందాయి. ఎటువంటి ఆలస్య రుసుం లేకుండా ఏప్రిల్ 15వ తేదీ నాటికే గత ఏడాది వచ్చిన దరఖాస్తుల సంఖ్యకు మించి..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఏపీ ఈఏపీ సెట్–2023కు భారీగా దరఖాస్తులు అందాయి. ఎటువంటి ఆలస్య రుసుం లేకుండా ఏప్రిల్ 15వ తేదీ నాటికే గత ఏడాది వచ్చిన దరఖాస్తుల సంఖ్యకు మించి దరఖాస్తులు వచ్చాయి. ఈ క్రమంలో మే 2 (మంగళవారం) నాటికి దరఖాస్తుల సంఖ్య 3,37,500కు చేరింది. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి 12 శాతం మేర అధికంగా దరఖాస్తులు పెరిగినట్లు ఉన్నత విద్యామండలి వర్గాలు పేర్కొంటున్నాయి. ఈఏపీ సెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్‌తో పాటు అగ్రికల్చర్ స్ట్రీమ్‌లోనూ దరఖాస్తులు ఇబ్బడిముబ్బడిగా దాఖలయ్యాయి. గత ఏడాది రూ.10 వేల అపరాధ రుసుంతో చివరి గడువు నాటికి మొత్తం దరఖాస్తులు 2.90 లక్షల వరకు మాత్రమే అందాయి. బీఎస్సీ నర్సింగ్ సీట్లను కూడా 2023–24 విద్యాసంవత్సరం నుంచి ఈఏపీ సెట్ ర్యాంకుల ఆధారంగా భర్తీ చేయనున్నారు. దీంతో ఈఏపీ సెట్‌కు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి.
కాగా రూ.1000ల ఆలస్య రుసుముతో ఈ నెల 5వ తేదీ వరకు గడువు ఉండగా, రూ.5 వేల ఆలస్య రుసుముతో మే 12 వరకు, రూ.10 వేల ఆలస్య రుసుముతో మే 14 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారు ఆఖరి రోజు వరకు వేచిచూడకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవల్సిందిగా అధికారులు సూచిస్తున్నారు.
5 రోజులపాటు ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు..
మే 15వ తేదీ నుంచి 18వ తేదీ వరకు రోజుకు రెండు సెషన్ల చొప్పున మొత్తం 8 సెషన్లలో ఈఏపీ సెట్ పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో నిర్వహించాలని తొలుత అధికారులు భావించినా దరఖాస్తుల సంఖ్య పెరగడంతో పరీక్ష రాసేందుకు ఏర్పాటైన కంప్యూటర్ల సంఖ్యకు తగ్గట్టుగా విద్యార్థులను సర్దుబాటు చేసినా ఇంకా అదనంగా వేలాది మంది అభ్యర్థులు మిగిలి ఉంటున్నారు. ఈ తరుణంలో పరీక్షలను మరో రోజుకు కూడా పొడిగిస్తూ ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. దీంతో మే 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఈఏపీ సెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షలను నిర్వహించనున్నారు. మే 22, 23 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ పరీక్షలు జరుగుతాయి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.