పవన్ కళ్యాణ్‌కు బీజేపీ కీలక బాధ్యతలు.. రెండు రోజులపాటు మహారాష్ట్ర పర్యటన!

మహారాష్ట్ర ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమి ప్రచారంలో దూసుకుపోతుంది.

పవన్ కళ్యాణ్‌కు బీజేపీ కీలక బాధ్యతలు.. రెండు రోజులపాటు మహారాష్ట్ర పర్యటన!
Pawan Kalyan
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 15, 2024 | 2:30 PM

ఎన్‌డీఏ భాగస్వామ్యమైన జనసేన పార్ట అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు భారతీయ జనతా పార్టీ మరో కీలక బాధ్యత అప్పజెప్పింది. పవన్ కళ్యాణ్‌తో కలిసి బీజేపీ ప్రయాణం సాగుతోంది. టీడీపీతో బీజేపీ జట్టుకట్టి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఏకంగా ప్రభుత్వాన్నే ఏర్పాటు చేసింది ఎన్‌డీఏ. ఈక్రమంలోనే ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న మహారాష్ట్ర ఎన్నికల బాధ్యతలను పవన్‌కు అప్పజెప్పింది బీజేపీ.

మహారాష్ట్ర ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమి ప్రచారంలో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలోకి పవన్ కళ్యాణ్‌ను దించుతోంది భారతీయ జనతా పార్టీ. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి తరుఫున ప్రచారం చేయాల్సిందిగా పవన్ కళ్యాణ్‍ను కోరింది బీజేపీ. బీజేపీ అభ్యర్థన మేరకు మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారైంది. బీజేపీ ఆహ్వానం మేరకు నవంబర్ 16,17 తేదీల్లో పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.

పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో రెండు రోజులపాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ఈ మేరకు జనసేన పార్టీ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. మహారాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతుగా పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహిస్తారు. ఈ నెల 16, 17 తేదీల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యంగా మరట్వాడా, విదర్భ, పశ్చిమ మహారాష్ట్ర రీజియన్లలో ప్రచారం షెడ్యూల్ ఖరారైంది. బీజేపీ జాతీయ స్థాయి, మహారాష్ట్ర నాయకులు జనసేన నాయకులతో చర్చల అనంతరం పవన్‌ కల్యాణ్‌ షెడ్యూల్‌ ఖరారైనట్లు జనసేన పార్టీ వెల్లడించింది.

ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ ఐదు బహిరంగ సభల్లో, రెండు రోడ్ షోల్లో పాల్గొంటారు. మొదటి రోజు మరట్వాడా ప్రాంతంలోని నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారు. 16వ తేదీ ఉదయం నాందేడ్ జిల్లా డెగ్లూర్ నియోజకవర్గంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం అదే జిల్లాలోని భోకర్ నియోజకవర్గానికి వెళ్తారు. అక్కడ నిర్వహించే సభలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు. లాతూర్ చేరుకుంటారు. అక్కడ నిర్వహించే సభలో పాల్గొంటారు. రాత్రి 6గంటలకు షోలాపూర్ నగరంలో రోడ్ షోలో పాల్గొంటారు.

ఇక నవంబర్‌ 17వ తేదీ విదర్భ ప్రాంతానికి వెళ్తారు. ఆ రోజు ఉదయం చంద్రపూర్ జిల్లాలోని బల్లార్ పూర్ పట్టణంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం పుణె కంటోన్మెంట్ నియోజకవర్గం పరిధిలో నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం కస్బా పేట్ నియోజకవర్గంలోని ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. కాగా, 288 నియోజకవర్గాలు ఉన్న మహారాష్ట్ర శాసనసభకు నవంబర్ 20న ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 23న ఫలితాలు ప్రకటిస్తారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…