AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మూడు నెలలే టైం.. పార్టీ ప్రక్షాళనపైనే సీఎం జగన్ ఫోకస్.. వారిపై వేటు తప్పదు.!

ఒకవైపు పార్టీలో ప్రక్షాళన.. మరోవైపు.. పాలనపై ఫోకస్‌.. ఇదీ.. ఇప్పుడు.. సీఎం జగన్‌ ఫాలో అవుతున్న రూల్‌.. అవును.. ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో సీఎం జగన్‌ డ్యుయల్‌ రోల్‌ పోషిస్తున్నారు. ఎన్నికలకు రెడీ అవుతూనే.. పాలనలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుడుతున్నారు.

మూడు నెలలే టైం.. పార్టీ ప్రక్షాళనపైనే సీఎం జగన్ ఫోకస్.. వారిపై వేటు తప్పదు.!
CM Jagan
Ravi Kiran
|

Updated on: Dec 29, 2023 | 8:00 AM

Share

ఒకవైపు పార్టీలో ప్రక్షాళన.. మరోవైపు.. పాలనపై ఫోకస్‌.. ఇదీ.. ఇప్పుడు.. సీఎం జగన్‌ ఫాలో అవుతున్న రూల్‌.. అవును.. ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో సీఎం జగన్‌ డ్యుయల్‌ రోల్‌ పోషిస్తున్నారు. ఎన్నికలకు రెడీ అవుతూనే.. పాలనలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటికే.. పార్టీ పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్న జగన్‌.. వచ్చే రెండు నెలల ప్రభుత్వ కార్యక్రమాలకూ షెడ్యూల్‌ ఫిక్స్‌ చేసేశారు.

తెలంగాణలో అధికార బీఆర్ఎస్‌ ఓట‌మి త‌ర్వాత ఏపీ రాజ‌కీయాలపై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. దానికి తగ్గట్లే.. సీఎం జ‌గ‌న్ వ్యూహాలకు వేగంగా పదును పెడుతున్నారు. తెలంగాణ‌లో సిట్టింగ్ ఎమ్మెల్యేల‌ను మార్చక‌పోవ‌డం వ‌ల్లే బీఆర్ఎస్ ఓట‌మి పాలైంద‌నే ప్రచారం జరిగింది. కొత్త అభ్యర్థుల‌ను నిలిపిన చోట బీఆర్ఎస్‌కు సానుకూల ఫ‌లితాలు రావడమే అందుకు నిదర్శనం. ఈ క్రమంలోనే.. సీఎం జ‌గ‌న్ కూడా పార్టీ పరంగా భారీ ప్రక్షాళ‌న మొదలుపెట్టారు. మరో మూడు నెలల్లోనే ఏపీలో ఎన్నికలు ఉండడంతో ఏమాత్రం ఆలోచించకుండా స్పీడ్‌ పెంచారు. వైసీపీ ప్రభుత్వం.. ఏ రాష్ట్రం చేయ‌ని విధంగా సంక్షేమ ప‌థ‌కాల‌ను చిత్తశుద్ధితో అమ‌లు చేస్తోంది. కానీ.. అధికార పార్టీపై వ్యతిరేక‌త ఉంద‌న్న ప్రచారం విస్తృతంగా సాగుతోంది. దాంతో.. సీఎం జగన్‌ అలెర్ట్‌ అయ్యారు.

వాస్తవానికి.. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల‌పై వ్యతిరేక‌త ఉన్నట్టు ప‌లు స‌ర్వే సంస్థలు.. త‌మ నివేదిక‌ల‌ను సీఎం జ‌గ‌న్‌కు స‌మ‌ర్పించాయి. సర్వే రిపోర్ట్‌ల ఆధారంగా.. చాలా చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేల‌ను కొన‌సాగిస్తే మూల్యం చెల్లించుకోవాల్సి వ‌స్తుంద‌ని జ‌గ‌న్ గ్రహించారు. అందుకే.. చాలా చోట్ల ఎమ్మెల్యేల‌ను మార్చడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఎవరూ ఊహించని విధంగా.. ఇప్పటికే.. 11 స్థానాల్లో అభ్యర్థులను మార్చేశారు. అప్పటినుంచి.. జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూనే ఉన్నారు. అభ్యర్ధుల విషయంలో ఓ అంచనాకు వచ్చిన సీఎం జగన్‌.. ఇవాళ, రేపట్లో ఏకంగా.. 50 నుంచి 60 స్థానాల్లో కొత్త ఇన్‌చార్జులను ప్రకటించనున్నట్లు రెండు రోజుల క్రితమే సంకేతాలు ఇచ్చారు. అనుమానం ఉన్న ప్రాంతాల్లో తగ్గేదేలే అన్నట్లు ప్రత్యామ్నాయంగా అభ్యర్థుల‌ను సిద్ధం చేసుకుంటున్నారు. అదే సమయంలో.. ప‌లు స‌ర్వేల్లో వ్యతిరేక‌త ఎక్కువ‌గా ఉన్న ఎమ్మెల్యేల‌ను పిలిపించుకుని జ‌గ‌న్ మాట్లాడుతున్నారు. ఇక.. స‌రిదిద్దులకోలేని పరిస్థితుల్లోనున్న ఎమ్మెల్యేల‌కు టికెట్ ఇవ్వలేన‌ని జ‌గ‌న్ తేల్చి చెబుతున్నారు. టికెట్ ఇవ్వలేకపోతుండడంతో ప్రత్యామ్నాయంగా నామినేటెడ్ ప‌ద‌వులు ఇస్తాన‌ని స‌ర్ది చెప్తున్నట్లు వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఇదిలావుంటే… ఒకవైపు.. పార్టీలో సమూల ప్రక్షాళన చేస్తూనే.. మరోవైపు.. పాలనపైనా ఫుల్‌ ఫోకస్‌ పెట్టారు సీఎం జగన్‌. సరిగ్గా.. రెండు, మూడు నెలల్లో ఏపీలో ఎన్నికలు జరుగనుండడంతో ప్రాలనపైనా దృష్టి సారించారు. ఇప్పటికే.. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన వైసీపీ ప్రభుత్వం.. జనవరిలో ప్రధానమైన నాలుగు కార్యక్రమాలు ప్రారంభిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. తాజాగా.. తాడేపల్లి నుంచి జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. వైయస్సార్‌ పెన్షన్‌ కానుక, వైయస్సార్‌ ఆసరా, వైయస్సార్‌ చేయూత, అంబేద్కర్‌ విగ్రహం ప్రారంభోత్సవంతోపాటు పలు కార్యక్రమాలపై కలెక్టర్లతో చర్చించారు సీఎం జగన్‌. ఆయా కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. వైయస్‌ఆర్ పింఛను కానుక జనవరి 1 నుండి 8 వరకు, ఆసరా జనవరి 23 నుండి 31వరకు, చేయూత ఫిబ్రవరి 5 నుండి 14 వరకు, జనవరి 19న అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ ఉంటుందన్నారు. 8 రోజులకు ఒక షెడ్యూల్ తయారు చేసుకోవాలని చెప్పారు. షెడ్యూలుపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలన్నారు సీఎం జగన్‌. మొత్తంగా.. ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో సీఎం జగన్‌ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ ప్రక్షాళనతోపాటు.. పాలనపైనా ఫోకస్‌ పెట్టి డ్యుయల్‌ రోల్‌ పోషిస్తున్నారు.