AP CM YS Jagan: తుఫాన్ కారణంగా ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదు.. ఉత్తరాంధ్ర సమీక్షలో సీఎం జగన్ ఆదేశం!

AP CM YS Jagan: తుఫాన్ కారణంగా ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదు.. ఉత్తరాంధ్ర సమీక్షలో సీఎం జగన్ ఆదేశం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వానగండం ఇప్పుడప్పుడే వదిలేలా లేదు.. ఇటీవల తుఫాన్ ప్రభావంతో దక్షిణాంధ్ర కకావిలమైతే, తాజాగా మరో తుఫాన్ ఉత్తరాంధ్ర వైపు దూసుకువస్తోంది.

Balaraju Goud

|

Dec 02, 2021 | 10:13 AM

AP CM YS Jagan Review on Javed Cyclone: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వానగండం ఇప్పుడప్పుడే వదిలేలా లేదు.. ఇటీవల తుఫాన్ ప్రభావంతో దక్షిణాంధ్ర కకావిలమైతే, తాజాగా మరో తుఫాన్ ఉత్తరాంధ్ర వైపు దూసుకువస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉత్తరాంధ్రకు ‘జావద్‌’ తుపాన్‌ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లు, సీఎం కార్యాలయం అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో గురువారం జరిగిన ఈ సమీక్షలో.. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట్ల ప్రత్యేక పునరావాస కేంద్రాలను తెరిచేందుకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ముంపు ప్రాంతాలను గుర్తించి, లోతట్టు ప్రాంతాల వారిని అప్రమత్తం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ అధికారులందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సీఎం దిశానిర్ధేశం చేశారు.

తుపాన్‌ వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితుల వల్ల ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా చూడాలని సీఎం ఆదేశించారు. మరోవైపు ఉత్తరాంధ్రలో తుపాన్‌ సహాయ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే బాధ్యతను ముగ్గురు సీనియర్‌ అధికారులకు సీఎం అప్పగించారు. శ్రీకాకుళం జిల్లాకు హెచ్‌.అరుణ్‌కుమార్, విజయనగరం జిల్లాకు కాంతిలాల్‌దండే, విశాఖ జిల్లాలకు శ్యామలరావును నియమించారు. వారు వెంటనే ఆయా జిల్లాలకు చేరుకుని తుపాన్‌ సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించాలని సీఎం జగన్‌ ఆదేశించారు.

ఇదిలావుంటే, దక్షిణ థాయ్‌లాండ్‌ పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం భారత్ వైపు దూసుకువస్తుంది. దీనికి ‘జావద్‌’ అని నామకరణం చేశారు. ఇది అండమాన్‌ సముద్రం పరిసరాల్లోకి ప్రవేశించి, ఆ తరువాత పశ్చిమ వాయవ్యంగా పయనించి గురువారానికి వాయుగుండంగా మారి ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుంది. ఆ తరువాత 24గంటల్లో వాయవ్యంగా పయనించి తుఫాన్‌గా మారనుంది. తుఫాను శనివారం ఉదయానికి ఉత్తరాంధ్ర తీరం దిశగా పయనిస్తున్నట్లు భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. డిసెంబర్ మూడో తేదీ నుంచి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, దక్షిణ ఒడిశాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.

Read Also…  AP Weather Report: ఏపీని వీడని వరుణుడు.. రేపు, ఎల్లుండి ఆ జిల్లాల్లో భారీ వర్షాలు.. అప్రమత్తమైన అధికారులు..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu