AP CM Chandrababu: నూతన సంవత్సరంలో ఏపీ సీఎం చంద్రబాబు తొలి సంతకం దేనిపైనో తెలుసా..?
ఆంధ్రప్రదేశ్‌లో పాలనపై ఎన్డీయే ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. సంస్కరణలు తీసుకురావడమే కాదు.. అవి ప్రజలకు ఎలా? ఎంతమేరకు చేరుతున్నాయి?.. అమలు చేయడంలో అధికారులు ఎలా వ్యవహరిస్తున్నారు?. వీటన్నింటిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా దృష్టిపెట్టారు. ప్రజల సమస్యలపై వాస్తవ పరిస్థితిని తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో పేదలకు మెరుగైన వైద్యం కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2025 నూతన సంవత్సరం ఓ ప్రత్యేక శుభారంభంగా మారింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నూతన సంవత్సరంలో తన తొలి సంతకాన్ని ప్రజల ప్రయోజనానికి అంకితమిచ్చారు. ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నిధుల విడుదలకు సంబంధించిన ఫైలుపై సంతకం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పేద వర్గాలకు సాయం అందించడానికి తాను ఎప్పుడూ కట్టుబడి ఉంటానని మరోసారి తెలిపారు.
1600 మంది బాధితులకు రూ. 24 కోట్లు..!
ముఖ్యమంత్రి నూతన సంవత్సర తొలి సంతకంతో 1,600 మంది దరఖాస్తుదారులకు రూ. 24 కోట్ల మేర నిధులు విడుదల అయ్యాయి. గత ఏడాది డిసెంబర్ 31 వరకు ప్రభుత్వం రూ. 100 కోట్లకు పైగా సీఎంఆర్ఎఫ్ నిధులు విడుదల చేసింది. దీంతో 7,523 మంది పేద వర్గాలకు లబ్ది చేకూరింది. తాజాగా విడుదల చేసిన సీఎంఆర్ఎఫ్ నిధుల మొత్తం రూ. 124.16 కోట్లకు చేరింది. ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లబ్ది పొందిన వారి సంఖ్య 9,123 గా నమోదైంది.
సీఎంఆర్ఎఫ్ ప్రాధాన్యత
సీఎంఆర్ఎఫ్ ద్వారా రాష్ట్రంలో ఆర్థికంగా బలహీనమైన కుటుంబాలకు పలు అవసరాలు నెరవేర్చడానికి సాయం అందిస్తున్నారు.
1. ఆరోగ్య చికిత్సల కోసం అత్యవసర ఆర్థిక సాయం.
2. పేద కుటుంబాలకు తక్షణ సహాయం.
3. ఇతర అత్యవసర అవసరాలకు నిధుల అందుబాటు.
ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలోనూ సీఎంఆర్ఎఫ్ ప్రాధాన్యతను సూచిస్తూ పేదవర్గాలకు మద్దతుగా నిలిచినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. ముఖ్యమంత్రి నూతన సంవత్సర తొలి సంతకంతో ప్రజలకు మరోసారి సంక్షేమ ప్రభుత్వం భావాన్ని పునరుద్ఘాటించారు. సీఎంఆర్ఎఫ్ కింద గత ఏడాది నుంచే పేదలకు తక్షణ పరిష్కారాలు అందించడంలో ప్రభుత్వం చురుకుగా పనిచేస్తోందనీ ముఖ్యమంత్రి కార్యాలయం వివరించింది.
ప్రతీ దరఖాస్తును పరిశీలించి ప్రాధాన్యతా ప్రమాణాలతో వెంటనే నిధులు విడుదల చేయడం ముఖ్యమంత్రి కార్యాలయం పని తీరు అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. 2025 నూతన సంవత్సరంలో ప్రభుత్వం ప్రజల కోసం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. సీఎంఆర్ఎఫ్, ఇతర అభివృద్ధి కార్యక్రమాల ద్వారా పేదవర్గాల జీవితాలను మెరుగుపర్చడమే ప్రభుత్వ ధ్యేయం అని,ఈ చర్యలతో రాష్ట్రంలో సంక్షేమానికి, సేవలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో మెరుగైన మార్గదర్శకత్వం చూపించారని కూటమి నేతలు ప్రశంసిస్తూ ఉన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..