Andhra Pradesh: సీఐఐ సమ్మిట్‌లో ఆ జిల్లాకు వేల కోట్ల పెట్టుబడులు.. మారనున్న దశ..దిశ..
విశాఖపట్నం సీఐఐ సదస్సుతో ఏపీ రికార్డు స్థాయిలో రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. సీఎం చంద్రబాబు నాయుడు పాలనా దక్షతకు ఇది నిదర్శనని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు అన్నారు. 16 లక్షల ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. నెల్లూరు జిల్లాకు రూ.6815 కోట్ల పెట్టుబడులు, 4,800 ఉద్యోగాలు దక్కనున్నాయి.

విశాఖపట్నంలో జరిగిన సీఐఐ సమ్మిట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రికార్డు స్థాయిలో రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. సీఎం చంద్రబాబు పాలనా దక్షతకు ఈ పెట్టుబడుల ప్రవాహం నిదర్శనమని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు కొనియాడారు. ఈ పెట్టుబడుల్లో నెల్లూరు జిల్లాకు పారిశ్రామికంగా భారీగా లబ్ధి చేకూరనుంది. ఈ సదస్సు విజయవంతం కావడంతో ప్రభాకర్ రెడ్డి దంపతులు తమ నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్, మంత్రి నారా లోకేష్ నిరంతర కృషి వల్లే ఈ సీఐఐ సమావేశం విజయంవంతమైందని ప్రభాకర్ రెడ్డి తెలిపారు.
ప్రభుత్వం తొలుత రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులను అంచనా వేస్తే, అంతకుమించి రూ.13,25,716 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు కుదుర్చుకోవడం దేశంలోనే అత్యధికమని, ఇది గొప్ప విషయమని ఆనందం వ్యక్తం చేశారు. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో దాదాపు 16 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. పేపర్లపై కాకుండా నేలపై శంకుస్థాపనలు చేసి, ఆ కంపెనీలను పూర్తి చేసేలా ఫాలోఅప్ చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన స్పష్టం చేశారు.
నెల్లూరు జిల్లాకు రూ.6,815 కోట్ల పెట్టుబడులు
రాష్ట్ర స్థాయి పెట్టుబడులతో పాటు జిల్లా స్థాయిలో కూడా భారీగా అభివృద్ధి జరగనుందని ఎంపీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లాకు మొత్తం రూ.6,815 కోట్ల పెట్టుబడుల ద్వారా 4,800 మందికి ఉద్యోగాలు రానున్నట్లు తెలిపారు. ఈ పెట్టుబడుల్లో ప్రముఖంగా జేఎం బాక్సీ గ్రూప్ సంస్థ రూ.3 వేల కోట్లతో మెరైన్ సర్వీస్, లాజిస్టిక్స్, పోర్ట్ బేస్డ్ కంపెనీని ఏర్పాటు చేయనుండగా దీని ద్వారా 3 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. అలాగే ఇండోసోల్ కంపెనీ రూ.2,200 కోట్లతో ఏర్పాటు కానుంది. ఐటీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు సంబంధించిన ఆర్‌సీఆర్‌టీ కంపెనీ రూ.1615 కోట్లు పెట్టుబడులు పెట్టనుండగా.. దీని ద్వారా 1300 మంది ఉద్యోగాలు పొందుతారని వివరించారు. త్వరలోనే గ్లాస్ తయారీ కంపెనీలు కూడా జిల్లాకు రాబోతున్నాయని ఆయన ప్రకటించారు.
పాలనా దక్షత – దార్శనికత
గత ప్రభుత్వ విధానాల కారణంగా రాష్ట్రం వదిలి వెళ్లిపోయిన ఫ్రాంక్లిన్ టెంపుల్‌టన్, లూలూ, బి.ఆర్. షెట్టి గ్రూప్, టైటాన్ వంటి ప్రముఖ పరిశ్రమలు తిరిగి రాష్ట్రానికి వస్తున్నాయంటే అది సీఎం చంద్రబాబు నాయుడు పాలనా నైపుణ్యం అని ఎంపీ కొనియాడారు. ఇతర రాష్ట్రాలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి ఆలోచిస్తుంటే, సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వైపు రాష్ట్రాన్ని తీసుకువెళుతున్నారని ఆయన వివరించారు. 2029 నాటికి రాష్ట్రాన్ని దేశంలోనే తొలిస్థానంలో ఉండేలా అభివృద్ధి చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఇది సరికొత్త ఆంధ్రప్రదేశ్
కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ.. గత 17 నెలలుగా కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తోందని, ఈ పెట్టుబడుల ప్రవాహం చూస్తుంటే ఇది సరికొత్త ఆంధ్రప్రదేశ్ అని నమ్మకం కలుగుతోందన్నారు. అనుభవం, అడ్మినిస్ట్రేషన్‌కు ఈ విజయం నిదర్శనమని చెప్పారు. ఒక ప్రాంతానికే కాకుండా మూడు ప్రాంతాలకు సమ ప్రాధాన్యత ఇస్తూ కంపెనీలను తీసుకువచ్చారని ఆమె స్పష్టం చేశారు. గతంలో ఇచ్చిన 20 లక్షల ఉద్యోగాల హామీని చేరుకునే దిశగా ఈ పెట్టుబడులు దోహదపడతాయని, గత ప్రభుత్వం పేపర్‌పై పెట్టుబడులు చూపితే, తమ ప్రభుత్వం వాస్తవ పెట్టుబడులు చూపుతోందని వివరించారు. కోవూరు నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసి, యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు తాను కట్టుబడి ఉన్నానని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి తెలిపారు. అందరి భాగస్వామ్యంతో జిల్లాను మరింత అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
