Tirumala: భక్తులకు అలర్ట్.. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు.. టికెట్లపై టీటీడీ కీలక నిర్ణయం.. సామాన్యులకే..
తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. డిసెంబర్ 30 నుండి జనవరి 8 వరకు దర్శనాలు కొనసాగుతాయి. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యతనిస్తూ 164 గంటల దర్శన సమయం కేటాయించారు. గతేడాది తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఈ సారి ఆన్‌లైన్ ద్వారా టికెట్లను కేటాయించనున్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ ఏడాది సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పించేలా దర్శన సమయాలను కేటాయించింది. డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలను కొనసాగించాలని పాలకమండలి నిర్ణయించింది.
మొత్తం 182 గంటల దర్శన సమయంలో 164 గంటలు సామాన్య భక్తులకు సర్వదర్శనం కల్పించేందుకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఇది సీఎం ఆదేశాల మేరకు సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వడంలో భాగమని తెలిపింది. గతంలో తిరుపతిలోని కౌంటర్లలో ఆఫ్ లైన్‌లో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లను జారీ చేసే విధానాన్ని ఈసారి రద్దు చేశారు. గతేడాది తిరుపతిలోని కౌంటర్ల వద్ద జరిగిన తొక్కిసలాట సంఘటనను దృష్టిలో ఉంచుకుని, భక్తులకు ఇబ్బందులు కలగకుండా, పారదర్శకత కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు.
టోకెన్ల కేటాయింపు విధానం
సామాన్య భక్తుల కోసం ఉద్దేశించిన సర్వదర్శనం టోకెన్ల కేటాయింపులో టీటీడీ కొత్త విధానాన్ని అమలు చేస్తోంది. డిసెంబర్ 30, 31, జనవరి 1న దర్శనాలకు సంబంధించి మొదటి మూడు రోజులకు ఈ-డిప్ ద్వారా టికెట్లను కేటాయించనున్నారు. నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. డిసెంబర్ 2న ఆన్‌లైన్ డిప్ ద్వారా టోకెన్లను కేటాయిస్తారు. టోకెన్లను టీటీడీ వెబ్‌సైట్, యాప్, వాట్సాప్ ద్వారా మాత్రమే జారీ చేస్తారు. ఆఫ్ లైన్ విధానం పూర్తిగా రద్దు చేశారు.
దర్శనాల రద్దు
వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, జనవరి 1న శ్రీవాణి ట్రస్ట్, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. 10 రోజుల పాటు ప్రొటోకాల్ దర్శనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. మిగిలిన అన్ని బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ నిర్ణయాలన్నీ సామాన్య భక్తులకు అధిక సంఖ్యలో వైకుంఠ ద్వార దర్శనం కల్పించడం, గతంలో జరిగిన అపశ్రుతులు పునరావృతం కాకుండా చూడటం లక్ష్యంగా తీసుకున్నట్లు టీటీడీ చైర్మన్, ఈఓ తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
