TDP MLA Atchannaidu: అందుకే గవర్నర్ ప్రసంగాన్ని బాయ్‌కాట్ చేశాం.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు

AP Assembly budget session 2022: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం.. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజునే వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. ఎవరూ ఊహించని విధంగా గవర్నర్‌ ప్రసంగానికి అడ్డుతగిలి జగన్ ప్రభుత్వంపై పోరుకు తెలుగు తమ్ముళ్లు మరో ముందడుగు వేశారు.

TDP MLA Atchannaidu: అందుకే గవర్నర్ ప్రసంగాన్ని బాయ్‌కాట్ చేశాం.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
Atchannaidu
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 07, 2022 | 2:34 PM

AP Assembly budget session 2022: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం.. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజునే వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. ఎవరూ ఊహించని విధంగా గవర్నర్‌ ప్రసంగానికి అడ్డుతగిలి జగన్ ప్రభుత్వంపై పోరుకు తెలుగు తమ్ముళ్లు మరో ముందడుగు వేశారు. గవర్నర్‌ ప్రసంగం మొదలు కాగానే టీడీపీ సభ్యులు.. రాజ్యాంగ వ్యవస్థలను కాపాడలేని గవర్నర్‌ గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. ఒక దశలో వెల్‌లోకి వచ్చి ప్రసంగ ప్రతులను చించేసి పోడియంపైకి విసిరేశారు. వారి ఆందోళనతో దాదాపు 20 నిమిషాలు గవర్నర్‌ ప్రసంగానికి తీవ్ర ఆటంకం కలిగింది. అయితే.. టీడీపీ సభ్యుల తీరుపై సీఎం జగన్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే.. టీడీపీ గవర్నర్‌ ప్రసంగాన్ని ఎందుకు అడ్డుకుందన్న విషయం ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. అసలు టీడీపీ వ్యూహం ఏంటీ.. జగన్ ప్రభుత్వానికి ఏ విధంగా చెక్ పెట్టబోతుంది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే.. అసెంబ్లీ వాకౌట్ అనతరం టీడీపీ ఏపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడారు.

అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. వైఎస్ఆర్‌సీపీ వ్యవహరిస్తున్న తీరుపై ఫిర్యాదు చేసినప్పటికీ.. గవర్నర్ ఏనాడు స్పందించలేదని.. అందుకే ఆయన ప్రసంగాన్ని బాయ్‌కాట్ చేశామంటూ పేర్కొన్నారు. వైసీపీ మూడు సంవత్సరాల పాలనలో రాజ్యాంగ వ్యవస్థలపై దాడి జరిగిందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థపై దాడి చేసినా.. ముఖ్యమంత్రిని పిలిచి మందలించలేదన్నారు. గవర్నర్ పేరు మీద అప్పులు చేస్తే.. మేము గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్ళామని.. అయినా గవర్నర్ బిశ్వభూషణ్ స్పందించలేదన్నారు. ఎన్నికల కమిషన్‌పై దాడి చేసి.. రాత్రికి రాత్రి తొలగించారు. మండలిలో చైర్మన్ షరీఫ్‌పై దాడిచేసి బూతులు తిట్టారన్నారు. సీఆర్డీఏ చట్టం.. అసెంబ్లీలోనే తాము చేసిందేనన్నారు. ఈ చట్టాన్ని రద్దుచేస్తే.. మూడు రాజధానులు బిల్లుపై గవర్నర్ సంతకం చేశారన్నారు. అనేకసార్లు గవర్నర్‌ను కలిసి వినతిపత్రం ఇస్తే.. ఒక్కసారి కూడా స్పందించలేదన్నారు. ఈ విషయాలన్నింటిపై ఆవేదనతోనే నిరసన వ్యక్తంచేశామన్నారు.

చంద్రబాబు కుటుంబంపై వ్యక్తిగత దూషణలు చేశారు.. సభకు వెళ్లకూడదని అనుకున్నామని అచ్చెన్నాయుడు వివరించారు. ప్రజల పక్షాన పోరాటం చేయాలని.. బాధను దిగమింగుకొని అసెంబ్లీకి హాజరయ్యామన్నారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడంపై బీఏసీలో సీఎం అడిగారన్నారు. చంద్రబాబు వయస్సు ఎంత.. అతన్ని ఎన్ని బూతులు తిట్టారు.. హేళన చేశారన్నారు. చంద్రబాబు సతీమణిపై ఏమి వ్యాఖ్యలు చేశారో.. స్పీకర్‌కు వీడియోలు అందిస్తామన్నారు. అయితే.. మంత్రి బొత్స సత్యన్నారాయణ చేసిన వ్యాఖ్యల గురించి మాట్లాడుతూ.. ఆయన గురించి మాట్లాడటం సమయం వృధా అన్నారు. బొత్స మాటలతో పలచన అవుతున్నారంటూ విమర్శించారు. మూడు రాజధానులు వద్దని హైకోర్టు తీర్పు స్పష్టంగా ఇచ్చింది. హైదరాబాద్ వెళితే వెళ్ళండి.. ఎవరు వద్దన్నారంటూ బోత్సాను ఉద్దేశించి పేర్కొన్నారు. బొత్స సత్యనారాయణ హైదరాబాద్‌ను రాజధానిగా భావిస్తుంటే ఇక్కడ వదిలేసి అక్కడికే వెళ్లిపోవచ్చంటూ విమర్శించారు.

గవర్నర్ విఫలమయ్యారు.. గోరంట్ల బుచ్చయ్య చౌదరి

రాష్ట్ర ప్రభుత్వాన్ని సరైన మార్గంలో నడిపించడంలో గవర్నర్ విఫలమయ్యారంటూ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తంచేశారు. హక్కుల కోసం సభ్యుల బలంతో సంబంధం లేకుండా మేం పోరాడుతున్నామంటూ పేర్కొన్నారు. రెండేళ్లు ప్రభుత్వం కోవిడ్ ని అడ్డంపెట్టుకుని బతికిపోయిందన్నారు. గవర్నర్ ఉత్సవ విగ్రహంలా ఉండటం సబబు కాదనే గో బ్యాక్ అన్నామంటూ గోరంట్ల పేర్కొన్నారు. తమ ఒక్క గొంతు నొక్కితే లక్ష గొంతులు మద్దతుగా లెగుస్తాయంటూ గోరంట్ల పేర్కొన్నారు.

Also Read:

AP Assembly: ముగిసిన వైసీపీ BAC సమావేశం.. అచ్చెన్నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం.

AP Assembly: అప్పుడు జగన్‌, ఇప్పుడు చంద్రబాబు.. ప్రతిపక్ష నాయకుడు లేకుండానే ఏపీ అసెంబ్లీ సమావేశాలు..